e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Sunday, November 28, 2021
Home జిందగీ తెలంగాణ.. తొలి వెలుగులు!

తెలంగాణ.. తొలి వెలుగులు!

ఆమె ఆలోచన.. ఒక మేల్కొలుపు.  

ఆమె ఆచరణ.. ఒక ఆదర్శం. 

- Advertisement -

ఆమె అనుభవం.. ఒక విజయం. 

మొత్తంగా, సమాజానికి ఒక వెలుగు ఆమె . 

ఆ కాంతిని నింపుకోవడానికి ముందు, యుగాలకు యుగాలు చీకట్లోనే మగ్గింది. 

వెనుకటి అనుభవాలు నేర్పిన పాఠాలతో, ఆ చీకటితోనే పోరాడి గెలిచింది.   

అర్హత లేదన్న చోటే, అగ్రస్థానాన్ని అందుకుంది. 

పనికిరావన్న దగ్గరే పట్టాభిషేకం చేయించుకుంది. 

చేతకాదని చులకన చేసినవారితోనే చేతులెత్తి మొక్కించుకుంది. 

నాయకత్వం తెలియదని నవ్వినవారే పాలనా ప్రతిభకు  ప్రణామాలు చేస్తున్నారు. 

ఆకాశంలో సగమనో..భూమిలో పావు వంతనో..బేరాలుపేట్టే బేలతనాన్ని ఎప్పుడో దాటేసిందామె! ఇప్పుడు..  ఏ రంగమైనా..ఆమెకు కదనరంగమే! 

ఆత్మవిశ్వాసమే అక్షౌహిణుల సైన్యం. మనోబలమే మర ఫిరంగులు. 

ఆ జైత్రయాత్రకు.. పురుషాధిక్య ప్రపంచమూ జయజయ ధ్వానాలు చేయకతప్పని పరిస్థితి. 

ఒంటరి ప్రయాణం నుంచి.. ఒకటో స్థానం వరకూ ఆ యాత్ర 

స్ఫూర్తిదాయక కథనాల అక్షయపాత్ర! 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం (మార్చి 8) సందర్భంగా భిన్న రంగాలలోని ‘తెలంగాణ తొలి మహిళల’కు తొలి వందనాలు సమర్పిస్తూ..

ఎడవల్లి ఆదిలక్ష్మి  

మొన్నటివరకు ఆదిలక్ష్మి ఒక సాధారణ గృహిణి. భర్త కష్టం మీదే ఆధారపడి బతికేది. కానీ ఎన్ని రోజులు అలా? అడుగు ముందుకేసింది. కంఫర్ట్‌ జోన్‌నుంచి బయటకు వచ్చింది. తెలంగాణ తొలి మహిళా మెకానిక్‌గా గుర్తింపు పొందింది. ఆదిలక్ష్మిది భద్రాద్రి కొత్తగూడెం. భర్త మెకానిక్‌. అంతంత మాత్రమే సంపాదన. ఆ వెంటనే లాక్‌డౌన్‌ ప్రభావం. ఇక కష్టాలు తప్పవని అనుకున్న తరుణంలో ధైర్యంతో మెకానిక్‌గా మారి, ఆర్థిక స్వావలంబన వైపు అడుగులు వేస్తూ అంజనాపురంలో మెకానిక్‌ షెడ్డు ఏర్పాటు చేసింది. 

అజ్మీరా బాబీ 

ఆకాశంలో విమానాలు వెళ్తుంటే, అబ్బురంగా చూసి చప్పట్లు కొట్టిన అజ్మీరా బాబీ.. పెద్దయ్యాక అదే విమానానికి పైలట్‌ అయ్యింది. ఆ స్థాయికి చేరుకోవడానికి ఎంతో కష్టపడింది. కలలు కనడం కాదు.. ఆ కలలను వెంటాడాలి, ఒడిసిపట్టుకోవాలి.. అన్నంత కసిని పెంచుకున్నది. మంచిర్యాలకు చెందిన అజ్మీరా  తన దుబాయ్‌ అత్తకు వీడ్కోలు చెప్పేందుకు మొదటిసారి ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లింది. ఆకాశంతో తనకు ఏదో దగ్గరి అనుబంధం ఉందని మళ్లీ మళ్లీ అనిపించిందట. అంతే, పైలట్‌ కావడమే లక్ష్యంగా పెట్టుకొని తొలి ప్రయత్నంలోనే విజయం సాధించింది. తెలంగాణ తొలి గిరిజన మహిళా పైలట్‌గా రికార్డు సృష్టించింది. 

బబ్బూరి శిరీష 

విద్యుత్‌ శాఖలో లైన్‌మెన్‌లే ఉండాలా? లైన్‌ ఉమెన్‌లు ఉండకూడదా? అని కొట్లాడి కొలువు తెచ్చుకున్నది బబ్బూరి శిరీష. సిద్దిపేట జిల్లా గణేశపల్లి తన ఊరు. ఐటీఐ చేసిన శిరీష విద్యుత్‌శాఖలో లైన్‌మెన్‌ ఉద్యోగాల నోటిఫికేషన్‌ విడుదలైతే దరఖాస్తు చేసుకోవాలని అనుకున్నది. కానీ అక్కడ మహిళలకు ఆప్షనే  లేదు. ఎంత వివక్ష? విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లింది. కోర్టుకూడా సానుకూలంగా స్పందించింది. పరీక్ష రాసినా ఫలితాల్లో అమ్మాయిల పేర్లు లేకపోవడంతో మళ్లీ కోర్టుకెక్కింది. పోరాడి లైన్‌ ఉమెన్‌ ఉద్యోగం సంపాదించింది. ఒకే ఒక నిమిషంలో, అంతెత్తు విద్యుత్‌ స్తంభం ఎక్కి పురుషులకన్నా భేష్‌ అనిపించుకున్నది. 

గంటా స్వాతి 

పోరాటస్ఫూర్తిని నింపే సినిమాలు కొందర్ని బలంగా ప్రభావితం చేస్తాయి. అలాంటి చిత్రమే ‘బోర్డర్‌’. ఆదిలాబాద్‌ జిల్లా కైలాస్‌నగర్‌కు చెందిన గంటా స్వాతి బోర్డర్‌ సినిమాను చూసిన తర్వాత తనూ పైలట్‌ కావాలని అనుకున్నది. వజ్రసమాన సంకల్పంతో తన గమ్యాన్ని చేరుకున్నది. శిక్షణ పొందిన చోటే ఇన్‌స్ట్రక్టర్‌గా రాణించి తెలంగాణలో తొలి మహిళా పైలట్‌గా రికార్డుకెక్కింది. 2007లో హైదరాబాద్‌లో పైలట్‌ శిక్షణ తీసుకున్న స్వాతి, ఆ తర్వాత ఫిలిప్పీన్స్‌ ఏవియేషన్‌ అకాడమీలో కమర్షియల్‌ పైలట్‌గా పట్టా పొందింది. 

జీఆర్‌ రాధిక 

‘ఇప్పటికే ఒక బాధ్యతగల ఉద్యోగంలో ఉన్నాం కదా? ఇంకా  సమయం ఎక్కడిది?’ అని అనుకోకుండా, దొరికిన ప్రతి అవకాశాన్నీ అందిపుచ్చుకున్నది. మరింత ఉన్నత లక్ష్యాన్ని ఏర్పరుచుకున్నది.. పోలీస్‌ ఆఫీసర్‌ జీఆర్‌ రాధిక. ఆదిలాబాద్‌ అడిషనల్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌గా పనిచేస్తున్న రాధిక లక్ష్యం.. ఎవరెస్ట్‌. అంతెత్తు శిఖరం ఊరించేదీ, ఉడికించేదీ, కలలోనూ సవాలు విసిరేది. హిమశిఖరం దిశగా వెళ్తున్నప్పుడు ఎన్నో ప్రతిబంధకాలు. వాటిని పట్టించుకోకుండా.. కష్టతరమైన ఎవరెస్ట్‌ పర్వతాన్ని అధిరోహించిన తొలి మహిళా పోలీస్‌గా చరిత్ర సృష్టించింది జీఆర్‌ రాధిక. 

సబితా ఇంద్రారెడ్డి 

తెలంగాణ రాష్ట్రంలో తొలి మహిళా మంత్రి సబితా ఇంద్రారెడ్డి. 2000లో మొదటిసారి చేవెళ్ల నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా విజయం సాధించిన సబిత, తర్వాత 2004లో కూడా గెలుపొంది మంత్రిగా పనిచేశారు. 2009లో దేశంలోనే తొలి మహిళా హోంమంత్రి పదవి చేపట్టి రికార్డు సృష్టించారు. 2018లో మహేశ్వరం నుంచి విజయం సాధించిన సబితకు సీఎం కేసీఆర్‌ విద్యాశాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. 

సునీతా లక్ష్మారెడ్డి

తెలంగాణ రాష్ట్ర తొలి మహిళా కమిషన్‌ చైర్‌పర్సన్‌ సునీతా లక్ష్మారెడ్డి. 1999లో తొలిసారిగా  నర్సాపూర్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన సునీత, తర్వాత వరుసగా రెండుసార్లు గెలుపొందారు. నీటిపారుదలశాఖ మంత్రిగా పనిచేశారు. తండ్రి, భర్త వారసత్వాల్ని కొనసాగిస్తూ రాజకీయాల్లోకి వచ్చిన సునీత, ప్రజల మనిషిగా గుర్తింపు పొందారు. మహిళలకు కాంగ్రెస్‌పార్టీ తగిన ప్రాధాన్యం ఇవ్వడం లేదన్న కారణంతో టీఆర్‌ఎస్‌ పార్టీలో చేరారు. సీఎం కేసీఆర్‌ సునీతకు మహిళా కమిషన్‌ బాధ్యతలు అప్పజెప్పారు.

సుప్రియా సనమ్‌ 

హైదరాబాద్‌కు మెట్రో రైలే కొత్త. ఇక దాన్ని నడపడం అంటారా? ఏ దిల్లీ నుంచో ముంబయి నుంచో డ్రైవర్లు వచ్చి ఉంటారని అనుకునేవాళ్లూ ఉన్నారు. కానీ హైదరాబాద్‌ మెట్రో రైలు ప్రారంభోత్సవం నాడే రైలు నడిపిన లోకో పైలెట్‌ ఓ తెలంగాణ అమ్మాయి. నిజామాబాద్‌కు చెందిన సుప్రియా సనమ్‌కు సాహసాలు అంటే చాలా ఇష్టం. అందరిలా కాకుండా, భిన్నంగా ఆలోచించే స్వభావం. కాబట్టే,  లోకో పైలట్‌ కావాలనే లక్ష్యం ఏర్పరచుకున్నది. కష్టపడి విజయం సాధించింది. సుప్రియ తర్వాత వరంగల్‌ సింధుజ, మహబూబ్‌నగర్‌ వెన్నెల, హైదరాబాద్‌ ప్రణయ 

బండి నడిపారు. 

గద్వాల విజయలక్ష్మి 

స్వతంత్ర తెలంగాణలో హైదరాబాద్‌ తొలి మహిళా మేయర్‌గా గద్వాల విజయలక్ష్మి ఎన్నికయ్యారు. హైదరాబాద్‌లోని హోలీమేరీ స్కూల్‌, రెడ్డి ఉమెన్స్‌ కాలేజీలో ఇంటర్‌ చదివిన విజయ భారతీయ విద్యాభవన్‌ నుంచి జర్నలిజంలో పట్టా అందుకున్నారు. సుల్తాన్‌ ఉల్‌ ఉలూమ్‌ కాలేజీలో లా చదివారు. పెండ్లి తర్వాత అమెరికా వెళ్లిన ఈమె, 18 ఏండ్లపాటు అక్కడే ఉన్నారు. ఉత్తర కరోలినాలోని డ్యూక్‌ యూనివర్సిటీలో కార్డియాలజీ డిపార్ట్‌మెంట్‌లో రీసెర్చ్‌ అసిస్టెంట్‌గా పనిచేశారు. 2007లో అమెరికా పౌరసత్వాన్ని వదులుకొని హైదరాబాద్‌ తిరిగొచ్చారు. క్రియాశీల రాజకీయాల్లో కొనసాగుతూ 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో బంజారాహిల్స్‌ కార్పొరేటర్‌గా విజయం సాధించారు. 

రాసకట్ల సంధ్య 

దేశంలోనే తొలిసారిగా అండర్‌గ్రౌండ్‌ మైనింగ్‌లో సెకెండ్‌ క్లాస్‌ మేనేజర్‌గా సర్టిఫికెట్‌ సాధించింది రాసకట్ల సంధ్య. భూపాలపల్లి జిల్లా కేంద్రానికి చెందిన సంధ్య అండర్‌గ్రౌండ్‌ మైన్‌లో ఎన్‌సీఎంఎంసీ ధ్రువీకరణ పత్రం పొందిన తొలి మహిళ కావడం విశేషం. మైనింగ్‌లో బీటెక్‌ చేసిన సంధ్య రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో ఉన్న హిందుస్థాన్‌ జింక్‌లో విధులు నిర్వర్తిస్తున్నారు. తండ్రి రఘు సింగరేణి కార్మికుడు. 

తోటి కల్యాణి 

ఆదివాసీ తండాల్లో పరిస్థితి ఎలా ఉంటుందో మనకు తెలియనిది కాదు. కనీస సౌకర్యాలూ ఉండవు. అలాంటి మారుమూల ప్రాంతం నుంచి వచ్చింది కల్యాణి. అంతరించిపోతున్న ఆదివాసీ సముదాయమైన ‘తోటి తెగ’కు చెందిన యువతి తను. చదువంటే ఏమిటో తెలియని నేపథ్యం నుంచి వచ్చిన కల్యాణి జేఎన్‌టీయూలో అడుగు పెట్టిన తొలి తోటి అమ్మాయిగా చరిత్ర సృష్టించింది. ఆర్థిక సమస్యలనూ, వెనుకబాటునూ లెక్క చేయకుండా యూనివర్సిటీలో సీటు సంపాదించుకున్నది. 

మానసా వారణాసి

తెలంగాణ యువతి మానసా వారణాసి ‘వీఎల్‌సీసీ ఫెమినా మిస్‌ ఇండియా వరల్డ్‌-2020’ టైటిల్‌ను కైవసం చేసుకున్నది. దేశవ్యాప్తంగా వర్చువల్‌ హంట్‌లో మొత్తం 31 మంది ఫైనలిస్ట్‌లను ఎంపికచేయగా వీరిలో ఓ తెలంగాణ అమ్మాయి టైటిల్‌ను పొందడం గర్వకారణం. హైదరాబాద్‌ వాసవీ ఇంజినీరింగ్‌ కాలేజీలో చదివిన మానస, ప్రస్తుతం ఫైనాన్షియల్‌ ఇన్ఫర్మేషన్‌ ఎక్సేంజ్‌ అనలిస్ట్‌గా పనిచేస్తున్నది. 

యెండల సౌందర్య

భారత మహిళా హాకీ జట్టుకు ఎంపికైన తొలి తెలంగాణ యువతిగా యెండల సౌందర్య రికార్డు సృష్టించింది. నిజామాబాద్‌కు చెందిన సౌందర్యకు ఆటలపై ఆసక్తి ఎక్కువ. ఒలింపిక్స్‌ చాంపియన్‌ కావాలనే లక్ష్యంతో  ఆమె క్రీడా ప్రయాణం మొదలైంది. తొలిసారిగా 2016లో సౌందర్య భారత మహిళా హాకీ జట్టుకు ఎంపికైంది. 

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement