కార్పొరేట్ సంస్థల విజయాల్లో మహిళా నాయకులు కీలకపాత్ర పోషిస్తున్నారు. అదే సమయంలో.. వారి ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో మాత్రం వెనకబడి పోతున్నారు. నాయకత్వ బాధ్యతల్లో ఉన్న మహిళలు.. ఆ విధుల్లో బందీలుగా మారుతున్నారు. అనేక మానసిక, శారీరక ఆరోగ్య సమస్యలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ విషయాలను పలు అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి. సంస్థల అభివృద్ధి కోసం కృషిచేస్తున్నవారి శ్రేయస్సును కార్పొరేట్ సంస్థలు గాలికి వదిలేస్తున్నాయని విమర్శిస్తున్నాయి.
కార్పొరేట్ సంస్థలను విజయతీరాలకు చేర్చాలంటే ఎన్నో అడ్డంకులను అధిగమించాలి. మరెన్నో సవాళ్లను ఎదుర్కోవాలి. ఈక్రమంలో నాయకత్వ స్థానాల్లో కీలకంగా ఉన్న మహిళలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురవుతున్నారట. ఈ సమస్య కంటికి కనిపించకుండా.. చాపకింది నీరులా విస్తరిస్తున్నదట. ఫలితంగా, లేడీబాస్లు ఎక్కువగా బర్న్ అవుట్ అవుతున్నారు. ఈ సంక్షోభం.. భవిష్యత్తులో తీవ్రమైన దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలకు దారితీసే ప్రమాదం ఉన్నదని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఇందుకు ప్రధాన కారణం.. మహిళలు ద్విపాత్రాభినయం చేయడమేనని చెబుతున్నారు. నాయకత్వ స్థానాల్లో ఉన్న మహిళలు.. వ్యూహాత్మక నిర్ణయాలు తీసుకోవడంతోపాటు ఊపిరి సలపని పనులతో సతమతం అవుతుంటారు. అదే సమయంలో ఇంటి బాధ్యతలను కూడా నిర్వహిస్తుంటారు. ఇక పురుషులతో పోలిస్తే.. మహిళా నాయకులపైనే అధిక అంచనాలు ఉంటున్నాయి. ఈ కారణం కూడా వారిపై ఒత్తిడిని పెంచుతున్నదని ప్రముఖ కన్సల్టింగ్ సంస్థలు నిర్వహించిన అధ్యయనాల్లో తేల్చాయి. ఉన్నత స్థానాల్లో ఉండే పురుషుల్లో 31శాతం మంది మెంటల్లీ బర్న్ అవుట్ అవుతుండగా.. మహిళల వాటా 43 శాతం ఉన్నదని వెల్లడిస్తున్నాయి. పెద్దస్థాయిలో పని ఒత్తిడిని ఎదుర్కొంటున్న మహిళల్లో హృద్రోగాలు వచ్చే అవకాశం 50% ఎక్కువగా ఉన్నదని తేలింది.
ఆందోళన, నిరాశలో కూరుకుపోయే ప్రమాదం పురుషులతో పోలిస్తే.. 1.6 రెట్లు ఎక్కువట. అధిక ఒత్తిడితో పనిచేసే మహిళల్లో నిద్రలేమి, జీవక్రియలు మందగించడం, రోగ నిరోధక వ్యవస్థ పనితీరు కూడా తగ్గే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బర్న్ అవుట్స్.. రక్తపోటు, మధుమేహం ప్రమాదాన్ని పెంచుతాయని అమెరికన్ హార్ట్ అసోసియేషన్ కూడా హెచ్చరిస్తున్నది. అయితే.. మహిళా నాయకుల్లో ఈ వర్క్ ఓవర్‌లోడ్, బర్న్ అవుట్‌ను పరిష్కరించడం కేవలం వ్యక్తిగత బాధ్యత కాదనీ, నేరుగా ఎదుర్కోవాల్సిన సంస్థాగత సవాలు అని అంటున్నారు మానసిక నిపుణులు. కార్పొరేట్ కంపెనీలు తమ మహిళా నాయకుల ఆరోగ్యం, శ్రేయస్సును కాపాడటానికి విశ్వసనీయ వ్యూహాలను అభివృద్ధి చేయాలని సూచిస్తున్నారు. సౌకర్యవంతమైన పని వసతులు, మానసిక ఆరోగ్య వనరులు, నిర్మాణాత్మక మార్గదర్శక కార్యక్రమాలు నిర్వహించాలని చెబుతున్నారు. చివరగా.. వ్యాపారంలో విజయం సాధించాలంటే.. దానికి నాయకత్వం వహించేవారి ఆరోగ్యంపైనా శ్రద్ధ చూపాలి. అందులోనూ మహిళలపై మరింత ఎక్కువ ఫోకస్ పెట్టాలి. వారి ఆరోగ్యం, మానసిక శ్రేయస్సుకు ప్రాధాన్యతనిచ్చే సంస్థలు.. అగ్రశ్రేణి ప్రతిభను నిలుపుకోవడంతోపాటు మరింత స్థిరమైన అభివృద్ధిని సాధిస్తాయని నిపుణులు చెప్పుకొస్తున్నారు.