నేటితరం పిల్లలు.. ‘స్మార్ట్’గా తయారవుతున్నారు. చదువుల్లో ‘టాప్’ ర్యాంక్‌ల్లో ఉంటున్నారు. అయితే, ఇల్లు – స్కూలు తప్ప.. వేరే ఏదీ లేదన్నట్టుగా పెరుగుతున్నారు. చదువుల్లో ఫస్ట్ వస్తున్నా.. నలుగురిలో కలవలేక పోతున్నారు. బయటి ప్రపంచంలో అడుగుపెడితే.. బిత్తిరి చూపులు చూస్తున్నారు. వీరిలో కొందరు అతిగారాబం వల్ల ఇలా తయారైతే.. మరికొందరు ‘స్మార్ట్ గ్యాడ్జెట్స్’తో స్మార్ట్లెస్గా మారుతున్నారు. ఇలా పెరిగే పిల్లలు.. భవిష్యత్తులో ప్రపంచంతో పోటీ పడలేరని మానసిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. భవిష్యత్ గురించిన విషయాలను వారికి బాల్యం నుంచే నేర్పించాలని సూచిస్తున్నారు.
ముందుగా పిల్లల్లో సామాజిక విలువలను పెంచాలి. పెద్దవారిని గౌరవించడం నేర్పించాలి. ఇంట్లోవారే కాదు.. ముఖపరిచయం లేనివారికి కూడా గౌరవం ఇవ్వాలని చెప్పాలి. ముఖ్యంగా.. పేద-ధనిక వ్యత్యాసం చూపించకుండా పెంచాలి. అందరూ సమానమే అనే సత్యాన్ని వారికి ఉగ్గుపాలతోనే పట్టించాలి.
ఆర్థిక అక్షరాస్యతపై బాల్యం నుంచే అవగాహన కల్పించాలి. డబ్బు విలువ కూడా తెలియాలి. వారికి నచ్చింది కదా! అనో.. మారాం చేస్తున్నారనో అడిగిన ప్రతి ఒక్కటీ కొనివ్వకూడదు. ప్రతి వస్తువుపైన ఉండే ధరలను వారితోనే చదివించాలి. ఆ వస్తువు విలువ.. దానిని కొనడం వల్ల కలిగే ప్రయోజనం ఎంత? తదితర విషయాల గురించి చర్చించాలి. ఆ వస్తువు సరైన విలువ తెలుసుకోవడం, బేరాలు ఆడటం, మార్కెటింగ్‌పైనా అవగాహన కల్పించాలి.
బయటికి వెళ్లినప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో తెలియజేయాలి. అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఎలా స్పందించాలో పిల్లలకూ నేర్పించాలి. ఆటలు ఆడుతున్నప్పుడో.. ఇంకేదో సందర్భంలోనో ఏదైనా ప్రమాదం జరిగి.. తోటి పిల్లలకు దెబ్బలు తగిలితే, ఎలా ప్రవర్తించాలో చెప్పాలి. వారికీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు ఒంటరిగా ఆలోచించకుండా.. ఇతరుల సాయం తీసుకోవడం నేర్పాలి.
ఇక ఇంట్లో.. ఎవరి దుస్తులు వారే జాగ్రత్త చేసుకోవడం నేర్పించాలి. తమ దుస్తులను ఉతకడానికి వాషింగ్ మెషిన్లో వేయడం మొదలుకొని.. ఆరేయడం, మడతపెట్టడం, అల్మారాలో సర్దుకోవడం దాకా ప్రతి పనిలోనూ వారి సహాయాన్ని తీసుకోవాలి. వంటగదిలోనూ.. కూరగాయలు తరగడం, గిన్నెలు శుభ్రం చేయడం నేర్పిస్తే.. కొన్నిరోజులకు వారి పనులు వారే చేసుకోగలరు.