Ganesh Chaturthi | భారతీయుల ఆరాధనలో అత్యంత ప్రజాదరణ పొందిన దైవాల్లో వినాయకుడు ముఖ్యుడు. ఆదిదంపతులు పార్వతీపరమేశ్వరుల కొడుకు. దేవ సేనాధిపతి కుమారస్వామి సోదరుడు. విజ్ఞానం, విజయం, అదృష్టానికి వినాయకుడు ఆదిదైవం.. అధిదైవం. విఘ్నాలను పరిహరించేవాడిగా ఏ కార్యక్రమం మొదలుపెట్టినా తొలిపూజ గౌరవం వినాయకుడిదే. ఆయనను ఆవరించి ఉన్న కొన్ని వస్తువుల అంతరార్థం ఇదీ…
ఓ రోజు పార్వతీదేవి తన శరీరానికి ఉన్న నలుగు నుంచి ఓ బాలుడిని తీర్చిదిద్దింది. స్నానానికి వెళ్తూ ద్వారానికి అతణ్ని కాపలా ఉంచింది. ఇంతలో పరమశివుడు వచ్చాడు. లోపలికి వెళ్లబోయాడు. బాలుడు అడ్డుకున్నాడు. ఇద్దరి మధ్య యుద్ధం జరిగింది. శివుడు కోపంతో త్రిశూలంతో బాలుడి తల తెంచేశాడు. పార్వతి వచ్చి అసలు విషయం వివరిస్తుంది. దాంతో పరమశివుడు అక్కడ పడి ఉన్న మొండానికి ఏనుగు తలను అమరుస్తాడు. ఆ బాలుడిని శివగణాలకు అధిపతిని చేస్తాడు. అలా ఏనుగు తలతో పునరుజ్జీవం పొందిన గజాననుడు మన జీవితంలో కూడా కొత్తమార్పునకు సంకేతంగా నిలుస్తాడు. కొంతమంది మాత్రం ఏనుగు తల సంపదకు సంకేతంగా పేర్కొంటారు.
ఏనుగులను దారికి తెచ్చుకోవడానికి మావటులు అంకుశాన్ని ఉపయోగిస్తారు. మనం కూడా మనల్ని చెడుదారిలో పయనించేలా చేస్తున్న మనలోని అజ్ఞానాన్ని దారికి తెచ్చుకోవాలని వినాయకుడి చేతిలోని అంకుశం సందేశం ఇస్తుంది.
వినాయకుడు సాహిత్యానికి, సర్వ విద్యలకు అధిపతి అని తెలియజేస్తుంది. మహాభారతం రచనకు ఈ దంతాన్నే ఏకదంతుడు వినియోగించాడని పురాణ కథ.
మనం లక్ష్యం దిశగా సాగుతున్నప్పుడు, దారిలో మనకు ఎదురయ్యే ఆటంకాలను వినాయకుడు పాశంతో లాగేస్తాడు. విజయాన్ని సులభతరం చేస్తాడు అనే దానికి గణనాథుడి చేతిలోని పాశానికి ప్రతీక.
ఎడమవైపు తిరిగి ఉంటే గృహస్థాశ్రమంలో… అంటే ఇహలోక కోరికలను తీరుస్తాడని అర్థం. అదే కుడివైపు తిరిగి ఉంటే ఆధ్యాత్మిక యాత్రలో మోక్షాన్ని ప్రసాదిస్తాడని సూచిస్తుంది.
లంబోదరుడి బానపొట్టను ఆవరించి నాగబంధం ఉంటుంది. పెద్దపొట్ట విశ్వానికి సంకేతం కాగా, అదంతా గణేశుడి లోపలే ఉంటుందని
నాగబంధంతో సూచిస్తారని అంటారు. అంతేకాదు యోగశాస్త్రంలో పాము కుండలినీ శక్తికి సంకేతం కూడా. ఇక గణపతి దగ్గర శత్రుత్వ భావనలు ఉండవనడానికి, విరోధులు కూడా కలిసిమెలిసి ఉంటారనడానికి పాము, ఎలుక నిదర్శనాలుగా కనిపిస్తాయి.
గణపతి చేతుల్లో అన్నం గిన్నె, మామిడిపండు, లేదంటే మోదక్, లడ్డు లాంటి మిఠాయిలు ప్రధానంగా ఉంటాయి. మోదకం డబ్బు సంచిలా ఉంటుంది. అలా ఇది సంపదకు సంకేతంలా నిలుస్తుంది.
తను వెళ్లే మార్గంలో ఎంతటి ఆటంకం వచ్చినా ఎలుక తప్పించుకుని ముందుకు సాగుతుంటుంది. గణపతిని నమ్ముకుంటే మనకు ఎదురయ్యే విఘ్నాలన్నీ ధ్వంసం అవుతాయనడానికి ఎలుక గుర్తుగా నిలుస్తుంది.
పద్మం స్వచ్ఛతకు, జీవించడానికి అవసరమైన దైవశక్తికి నిదర్శనం. ఇక బురదలో వేళ్లూనికుని ఉన్నప్పటికీ పద్మం నీటిపైకి వచ్చి, వికసిస్తుంది. బురద అంటుకోకుండా స్వచ్ఛంగా ఉంటుంది. మనం కూడా మన చుట్టూ ఇబ్బందికరమైన పరిస్థితులు ఉన్నప్పుడు కూడా స్వచ్ఛంగా, స్థిరబుద్ధితో మెలగాలని వినాయకుడు కూర్చున్న పద్మపీఠం సందేశం ఇస్తుంది.
గణం అంటే గుంపు. సమూహాన్ని నడిపే పాలకుడు గణపతి. నాయకత్వ లక్షణాలకూ ఆయనే అధినాథుడు. శిక్షణనిచ్చి బుద్ధిని దిద్దే ప్రభువు ‘వినాయకుడు’. కోరినవి సిద్ధింపజేయడం వల్ల ‘వరసిద్ధి వినాయకుడు’ అనే పేరు పొందాడు. దుఃఖం, అజ్ఞానం, దారిద్య్రం వంటి బాధలు ప్రగతికి, పరమార్థానికి అడ్డంకులు. వాటినే ‘విఘ్నాలు’ అంటారు. అలాంటి విఘ్నాలను పోగొట్టి విజయాన్ని, ఆనందాన్ని ప్రసాదించే దైవం- విఘ్నేశ్వరుడు.