Jobs interview | ఎదుటి మనిషి అందంగా కనిపిస్తే, తొలిచూపులోనే మనకు ఓ మంచి అభిప్రాయం ఏర్పడుతుంది. అదనంగా.. మాట్లాడే తీరు, నడవడిక బాగుంటే తిరుగే ఉండదు. ఆకర్షణీయమైన రూపం ఉన్నవారు ఉద్యోగ ఇంటర్వ్యూలలో సులభంగా ఎంపిక అవుతారని, మిగిలినవాళ్లతో పోలిస్తే కొంత ఎక్కువ జీతమే పొందుతారని తాజా అధ్యయనం వెల్లడించింది. అమెరికాలోని యూనివర్సిటీ ఎట్ బఫెలో స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్కు చెందిన పరిశోధకులు ఈ విషయంపై లోతైన అధ్యయనం చేశారు. అందానికి మంచి మార్కులు పడటం ఉన్నమాటే అయినా, ఆకర్షణీయమైన రూపంతోపాటు, వారిలోని చురుకుదనం కూడా ముఖ్యపాత్ర పోషిస్తుందని పర్సనల్ సైకాలజీ జర్నల్లో ప్రచురితమైన నివేదికలో వారు పేర్కొన్నారు. ‘అందంగా ఉన్నవాళ్లకు ఆత్మ విశ్వాసమూ ఎక్కువగానే ఉంటుంది. ఇతరులతో తేలిగ్గా కలిసిపోతారు. ఈ గుణాలన్నీ వాళ్లకు అదనపు అర్హతలే. ఉద్యోగ విజయానికి ఇదీ ఓ కారణమే’ అంటూ పరిశోధన వ్యాసాన్ని ముక్తాయించారు.