మా భర్తలతో పాటు మమ్మల్నీ చంపండి… అంటూ ధైర్యంగా మృత్యువుకు ఎదురు నిలిచిన సందర్భంలోనూ, మిమ్మల్ని చంపితే పిరికిపందలం అనుకుంటారు, అందుకే చంపం… అంటూ అత్యంత బలహీనులుగా భారత మహిళల్ని పహల్గామ్లో ఉగ్రవాదులు భావించి వెక్కిరించారు. అందుకే ఉగ్రశిబిరాల మీద దాడులు ఎలా చేశారో మహిళా ఆఫీసర్లతోనే చెప్పించింది భారత్. వాళ్లను ఇందులో కీలక భాగ స్వాముల్ని చేసింది. కుక్కకాటుకు చెప్పు దెబ్బలాంటి పని… ఆపరేషన్ సిందూర్ వివరాల వెల్లడి సందర్భంలో చేసింది. ఇక్కడ మాట్లాడిన ఆర్మీ, ఎయిర్ ఫోర్స్ ఆఫీసర్లు సాదాసీదా వ్యక్తులేం కాదు, అమిత పరాక్రమ శక్తులు. బాధిత మహిళల పసుపు కుంకుమల సాక్షిగా ఆపరేషన్ సిందూర్ ద్వారా ఉగ్రవాదుల రక్తాన్ని పారించిన కల్నల్ సోఫియా ఖురేషి, వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్‌ల గురించి మనం తప్పకుండా పరిచయం చేసుకోవాలి.
పాకిస్థానీ టెర్రరిస్టుల మీద ఆపరేషన్ సిందూర్‌ను ఎలా నిర్వహించారో తెలుపుతూనే, ఇంకొక్కసారి ఇలాంటి కవ్వింపు చర్యలకు పాల్పడితే గట్టిగా బుద్ధి చెప్పేందుకు భారత సాయుధ బలగాలు సంసిద్ధంగా ఉంటాయంటూ వార్నింగ్ ఇచ్చారు వింగ్ కమాండర్ వ్యోమికా సింగ్. భారత ఎయిర్ ఫోర్స్‌లో కీలక ఆఫీసర్‌గా పనిచేస్తున్న ఆమె వాయుసేనలో చేరాలని ఆరో తరగతిలోనే అనుకున్నారట.
కలల్ని నిజం చేసుకోవడం అంటే ఏమిటో వ్యోమికా సింగ్‌ని చూసి నేర్చుకోవాలి. మన జీవితానికి పరమార్థం ఏంటి, దాని లక్ష్యం ఏంటి అనేది కొందరికి పరిణతి వస్తేగానీ అర్థం కాదు. కానీ వ్యోమిక మాత్రం తానేం కావాలన్నది పన్నెండేండ్ల వయసులోనే తెలుసుకుంది. చిన్ననాడు స్నేహితులంతా కలిసి ఎవరి పేరుకు ఏమిటి అర్థం అని మాట్లాడుకుంటుండగా, ఒకరు లేచి ‘వ్యోమిక అంటే ఆకాశంలో నివసించేది’ అని అర్థం కదూ… నువ్వు ఆకాశాన్ని సొంతం చేసుకుంటావా… అని అడిగారట. ఆ క్షణమే ఆమె నిర్ణయించుకుంది ఆకాశమంతా తనదే అన్నట్టుగా నింగిలో విహంగంలా ఎగరాలని. అందుకు తగ్గట్టుగానే చదువులోనూ ప్రణాళికలు వేసుకుంది. స్కూల్లో ఎన్సీసీ క్యాడెట్‌గా చేరింది. ఏవియేషన్‌లో పనిచేసేందుకు వీలుగా ఉండే ఇంజినీరింగ్ చేసి, ఇండియన్ ఎయిర్ ఫోర్స్‌లో పైలట్‌గా చేరింది. వాళ్ల కుటుంబం నుంచి వాయుసేనలో చేరిన తొలి వ్యక్తి వ్యోమికే.
భారత వాయు దళంలో 2019 సంవత్సరంలో చేరిన ఆమె, మంచి పనితీరుతో పేరు తెచ్చుకుంది. ఇప్పటిదాకా 2,500 గంటలకు పైగా వ్యోమిక యుద్ధ విమానాన్ని నడిపించారు. ప్రముఖ యుద్ధ విమానాలు చేతక్, చీతా లాంటి వాటిని అలవోకగా అధీనంలోకి తీసుకున్నారు. జమ్మూకశ్మీర్‌లాంటి మంచు ముసుగులో ఉండే ప్రాంతాల నుంచి ఈశాన్య భారతంలోని దట్టమైన అడవులు, ఎత్తయిన కొండలూ ఉండే ప్రదేశాల దాకా ఎన్నో రకాల వాతావరణాల్లో ఆమె లోహ విహంగాన్ని చాకచక్యంగా నడిపారు.
అరుణాచల్ ప్రదేశ్‌లో 2020 సంవత్సరంలో వచ్చిన వరదల సమయంలో కీలక ఆపరేషన్‌లో పాల్గొన్నారు వ్యోమిక. సముద్ర మట్టానికి వేల అడుగున ఎత్తున, మారుమూల ప్రాంతాల్లో, క్లిష్టమైన వాతావరణ పరిస్థితుల్లో ప్రజలను రక్షించే మిషన్‌లో విజయవంతంగా పాలుపంచుకున్నారు. ఇలా సంక్లిష్ట పరిస్థితుల్లో పనిచేయడం తనకెంతో ఉత్సాహాన్నిస్తుందని చెప్పే వ్యోమిక ఆ రంగంలో పనిచేస్తున్న ఎందరో మహిళలకు స్ఫూర్తి ప్రదాత.
సైన్యంలో కొలువంటే సాహసం. ఆ సాహసాల్లో ఆరితేరాలంటే కండబలమే కాదు గుండె బలమూ ఉండాలి. ఈ రెంటికి తోడు బుద్ధిబలంతో ఎన్నో విజయాలు సాధించింది కల్నల్ సోఫియా ఖురేషి. సైనిక దళాల నాయకత్వంలో, అంతర్జాతీయ శాంతి పరిరక్షణలో ఆమె చూపిన తెగువకు దేశం గర్విస్తున్నది. నిన్నటి ఆపరేషన్ సిందూర్‌లోనూ ఆమెది కీలక పాత్ర.
సోఫియా ఖురేషి స్వస్థలం గుజరాత్‌లోని వడోదర. వాళ్ల తాతకు భారత సైన్యంలో పనిచేసిన అనుభవం ఉంది. సైనిక కుటుంబంలో పుట్టి పెరగడం వల్ల చిన్నప్పటి నుంచే సైన్యంలో చేరాలనే కోరికతో పెరిగింది సోఫియా. బయోకెమిస్ట్రీలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తిచేసిన తర్వాత సైనిక ఉద్యోగానికి ప్రయత్నం చేసి ఎంపికైంది. చెన్నైలోని సైనిక అధికారుల శిక్షణా సంస్థలో శిక్షణ పొంది, విధుల్లో చేరింది. ఆ తర్వాత మిలటరీ అధికారిని వివాహం చేసుకుంది.
సోఫియా సామర్థ్యాలు, నాయకత్వ లక్షణాలను గుర్తించిన సైనికాధికారులు భారత దేశ అంతర్జాతీయ శాంతి దళానికి నాయకత్వం వహించేందుకు ఎంపిక చేశారు. కాంగోలో శాంతిని నెలకొల్పేందుకు ఐక్యరాజ్య సమితి పంపిన శాంతి పరిరక్షణ దళం నాయకత్వ బాధ్యతల్లో ఆరేళ్లపాటు పని చేశారామె. కాంగోలో సాయుధ ఘర్షణలు జరుగుతున్న ప్రాంతాల్లో కాల్పుల విరమణ అమలు చేయడంతోపాటు, శాంతి స్థాపన కోసం పాటుపడ్డారు. అక్కడ పనిచేయడం గొప్ప అనుభవమనీ చెబుతారామె.
ఎనిమిదేళ్ల క్రితం పూణెలో అంతర్జాతీయ సైనిక శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. సౌత్ ఈస్ట్ ఏషియన్ నేషన్స్ ఆర్గనైజేషన్‌లోని సభ్య దేశాలు, కొన్ని ఇతర దేశాల సేనలు ఈ శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నాయి. భారతదేశంలో జరిగిన అతిపెద్ద అంతర్జాతీయ సైనిక కార్యక్రమం ఇదే! ఇందులో భారత ఆర్మీకి ప్రాతినిధ్యం వహించిన శాంతి దళానికి సోఫియా ఖురేషి నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో మొత్తం18 దేశాలు పాల్గొన్నాయి. భారత దళం తప్ప మిగతా అన్ని దేశాల దళాలకూ పురుషులే నాయకత్వం వహించారు. అధికారుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా అప్పగించిన బాధ్యతలు విజయవంతంగా పూర్తిచేసి దేశం గర్వించే సైనిక నాయికగా ఎదిగారు సోఫియా. కొద్దిపాటి ప్రోత్సాహాన్ని అందిస్తే ఎంతటి కష్టమైన పనినైనా దేశం గర్వించదగ్గ స్థాయిలో మహిళలు పూర్తి చేయగలరు అని కల్నల్ సోఫియా నిరూపిస్తున్నారు.