నమస్తే మేడం. వేసవిలో ఎండలు ఎక్కువగా ఉంటాయి కదా! ఇతర దేశాల్లాగే మనమూ ఈ సమయంలో శరీరానికి విటమిన్-డిని ఎక్కువగా అందించవచ్చా. అలా అయితే ఏ సమయంలో ఎండలో గడపాలి. దాన్ని శోషించుకునేందుకు ఎలాంటి ఆహారం తీసుకోవాలో తెలుపగలరు.
మనది సమశీతోష్ణ మండలం. చక్కగా సూర్యుడు ప్రతిరోజూ ఉదయించి ఎన్నో గంటలు ఉంటాడు. నిజానికి ఇలాంటి వాతావరణంలో విటమిన్-డి లోపం రాకూడదు. కానీ మనం కేవలం నీడ పట్టునే ఉండటం వల్ల ఈ సమస్య వస్తుంది. సహజంగా సూర్యకాంతి నేరుగా చర్మానికి తాకినప్పుడు శరీరంలో విటమిన్-డి ఎక్కువగా ఉత్పత్తి అవుతుంది. ఒక రోజులో కనీసం పావుగంట ఇలా శరీరం మీద ఎండ పడేలా చూసుకోవాలి. భారతదేశంలో ఉన్నవాళ్లకు ఏడాదంతా విటమిన్-డి వస్తుంది.
మంచు దేశాల్లోలాగా మనకు ఎండకాలంలో మాత్రమే ప్రత్యేకంగా ఇది అందుతుంది అన్నది ఏం ఉండదు. కాకపోతే వేసవిలో పగటి సమయం ఎక్కువగా ఉండటం వల్ల సాధారణం కన్నా ఎక్కువగా ఎండకు ఎక్స్పోజ్ అవుతాం. కాబట్టి ఈ సమయంలో విటమిన్ స్థాయులు పెరుగుతాయి. ఇక, వేసవిలో విటమిన్-డి కావాలనుకున్నప్పుడు ఉదయం ఆరున్నర ఏడు నుంచి తొమ్మిది గంటల మధ్య, సాయంకాలం అయిదు తర్వాత ఎండలో ఉండటం మంచిది. వేడి ఎక్కువ ఉన్న సమయంలో బయటికి వెళ్లకపోవడమే ఉత్తమం. లేకపోతే శరీరం డీ హైడ్రేషన్ బారినపడే ప్రమాదం ఉంటుంది.
ఇక విటమిన్-డి శోషణలో చర్మపు రంగు అన్నది కూడా ముఖ్యమే. అంటే లేత రంగు చర్మ ఛాయ ఉన్నవాళ్లతో పోలిస్తే ముదురు రంగు చర్మం ఉన్నవాళ్లలో డి విటమిన్ శోషణకు ఎక్కువ సమయం పడుతుంది. అందుకే తెల్లవాళ్లతో పోలిస్తే మనలాంటి ఆసియా దేశాల వారు మరికాస్త ఎక్కువ సేపు ఎండలో గడపాలి. అలాగే విటమిన్-డి మన శరీరంలో సమృద్ధిగా తయారవ్వాలంటే పండ్లూ, ఆకుకూరలూ, మాంసకృత్తులూ కలగలిపిన సమతులాహారం తీసుకోవడం తప్పనిసరి.
-మయూరి ఆవుల న్యూట్రిషనిస్ట్
Mayuri.trudiet@ gmail.com