చర్మ సంరక్షణ కోసం శనగపిండిని వాడటం మనకు తెలిసిన విషయమే. కానీ గోధుమ పిండి కూడా మేనికి మంచిదేనని చెబుతున్నారు సౌందర్య నిపుణులు.
ట్యాన్ ప్యాక్
కావలసినవి: రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, పావు కప్పు నీళ్లు.ఒక గిన్నె తీసుకుని, గోధుమ పిండిలో నీళ్లు పోసి మెత్తటి పేస్టులా కలపండి. ఈ మిశ్రమాన్ని ఎండ కారణంగా నల్లగా మారిన చర్మం మీద రాసి పదినిమిషాల పాటు ఆరనివ్వండి. తర్వాత చల్లటి నీటితో కడిగేయండి. రోజుకు రెండుసార్లు ఇలా చేస్తే ట్యాన్ మాయమైపోతుంది.
మెరిసే చర్మానికి
కావలసినవి: రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, రెండు టేబుల్ స్పూన్ల పాలు. పాలు, పిండిని పేస్టులా కలుపుకొని ముఖానికి రాసి పదినిమిషాలు ఆరనివ్వండి. తర్వాత ముఖం మీద వలయాకారంలో నెమ్మదిగా మర్దన చేస్తూ నీళ్లతో కడిగేయండి. అప్పుడప్పుడూ ఇలా చేస్తే చర్మం కొత్త నిగారింపును సంతరించుకుంటుంది.
జిడ్డు తగ్గేలా
కావలసినవి: 4 టేబుల్ స్పూన్ల గోధుమ పిండి, 3 టేబుల్ స్పూన్ల పాలు, ఒక టేబుల్ స్పూను రోజ్ వాటర్.
మూడు పదార్థాలను బాగా కలిపి శుభ్రంగా కడిగిన ముఖం, మెడ మీద పూతలా రాయాలి. దాదాపు 20 నిమిషాల పాటు ఆరనివ్వాలి. తర్వాత చల్లటి నీటితో కడిగేయాలి. వారానికి కనీసం రెండుసార్లు ఇలా చేస్తే మంచి ఫలితాలు వస్తాయి.