పరవశింపజేసే ప్రకృతికి ఆలవాలం సాగర తీరం. కడలి ఒడిలో అంతెత్తున ఎగిసే అలలు.. తీరాన్ని చేరాలని ఉబలాటపడుతుంటాయి. తీరానికీ ఆరాటమే.. ఆ కెరటాలు తనను తాకాలని. తీరం దాటిన అలలు కొన్ని.. ఇప్పుడు ఫ్యాషన్ సంద్రంలో తుఫాను సృష్టిస్తున్నాయి. ఆభరణాల్లో కుదురుకున్న అలలు వేవ్ జువెలరీగా, టైడల్ ఆభరణాలుగా ఆధునిక మగువల మనసు దోచేస్తున్నాయి.
అతివల అలంకరణలో మొదటి స్థానంలో ఉండేవి ఆభరణాలే. సందర్భానికి, సమయానికి తగినట్టు నగలను ఎంచుకోవడంలోనూ వారికి వారే సాటి. ఎన్నిరకాల నగలున్నా ఎప్పుడూ కొత్త ట్రెండ్స్‌పైనే దృష్టిపెడుతుంది మహిళా లోకం. ఇలాంటివారిని మెప్పించడానికి ఎప్పటికప్పుడూ నయా ట్రెండ్స్ పుట్టుకొస్తుంటాయి. అలాంటివాటిలో ఒకటే వేవ్ జువెలరీ. సముద్ర అలలే ప్రధానంగా ఈ ఆభరణాలను తయారుచేస్తారు. నీలి రంగులో ఎగిసే అలల్ని బంధించి ఆభరణాల్లో పొదగడమే ఈ ఆభరణాల ప్రత్యేకత. ఎగిసే అలలు మొదలుకొని సముద్రతీరంలో కనిపించే ప్రతి అంశాన్ని ఆధారంగా చేసుకుని అచ్చంగా వాటిని పోలినట్లుగానే ఈ జువెలరీని తయారుచేస్తున్నారు డిజైనర్లు. నిజమైన అలలుగా కనిపించేందుకు ఈ ఆభరణాల తయారీలో ఎనామెల్, ఎపాక్సీలను వాడతారు. సహజత్వం ఉట్టిపడేందుకు నిజమైన ఇసుక, చిన్నచిన్న ఆల్చిప్పలు, గవ్వలను ఉపయోగిస్తున్నారు. అందంగా రూపొందించిన ఈ పెండెంట్లను బంగారం, వెండి, ప్లాటినమ్ వంటి లోహాలతో తయారుచేసిన గొలుసులకు జతచేస్తారు. సముద్రపు అందాల్ని పొదిగిన గొలుసులు, పెండెంట్లు, బ్రేస్లెట్లు, ఉంగరాలు, చెవికమ్మల రూపంలో అందుబాటులో ఉన్నాయి. ఆధునికత ఉట్టిపడే ఈ ఆభరణాలు ట్రెండీవేర్పై చక్కగా నప్పుతాయి. బంగారంతో కన్నా వెండి, ప్లాటినమ్, రోజ్‌గోల్డ్ లోహాలతో తయారుచేసినవి మరింత ఆకర్షణీయంగా ఉంటాయి. అందరికీ అందుబాటులో ఉండేలా స్టెయిన్లెస్ స్టీల్‌తో చేసిన వేవ్ జువెలరీ కూడా మార్కెట్లో దొరుకుతున్నది. మరెందుకు ఆలస్యం.. అలల నగలతో ఉప్పెన సృష్టించండి.