Walking | నడక.. వ్యాయామాల్లోనే అత్యంత సులువైంది. అత్యంత ప్రభావవంతమైంది. స్థిరమైన నడక.. బరువును అంతే స్థిరంగా తగ్గిస్తుంది. ఆరోగ్యానికీ అండగా నిలుస్తుంది. వాకింగ్ చేయాలంటే.. ప్రత్యేకమైన పరికరాలు కొనాల్సిన పనిలేదు. జిమ్‌లో చేరాల్సిన అవసరం అంతకన్నా లేదు. ప్రతిరోజూ 30 నుంచి 40 నిమిషాల సమయం కేటాయిస్తే చాలు. అలాకాకుండా.. ‘సమయం లేదు మిత్రమా?’ అంటారా? అయితే, ఈ చిట్కాలు మీకోసమే!
ఆఫీస్‌లో, మాల్స్‌లో మాటిమాటికీ లిఫ్ట్‌ను లిఫ్ట్ అడగకుండా.. మెట్లు ఎక్కడం అలవాటుగా మార్చుకోండి. దీనివల్ల కండరాలు ఎక్కువగా పనిచేస్తాయి. ఫలితంగా, ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయి. నడక కంటే మెట్లు ఎక్కడం వల్ల దాదాపు 20 రెట్లు ఎక్కువ క్యాలరీలు ఖర్చవుతాయని పలు అధ్యయనాలు తేల్చాయి కూడా! ఇక మెట్లు దిగడం ద్వారా కూడా దాదాపు ఐదు రెట్లు ఎక్కువ క్యాలరీలు ఖర్చు చేసుకోవచ్చు. బయటికి వెళ్లాలంటే.. బైక్ తీయాల్సిన పనిలేదు. కూరగాయలకు, ఇంటి దగ్గరి సూపర్ మార్కెట్లకు చక్కగా నడిచే వెళ్లండి. ఇటు ఆరోగ్యాన్ని కాపాడుకోవడంతోపాటు పెట్రోల్ కూడా పొదుపు చేసినవాళ్లు అవుతారు.
ఆఫీస్‌కు వెళ్లినప్పుడు బైక్, కార్‌ను కాస్త దూరంగా పార్క్ చేయండి. దానివల్ల కొద్దిదూరమైనా నడిచే అవకాశం దొరుకుతుంది. పని ఎలాగూ కుర్చీలో కూర్చునే చేస్తారు. కనీసం క్లయింట్స్‌తో ఫోన్లో మాట్లాడేటప్పుడైనా.. అలా లాన్లో నడుస్తూ మాట్లాడండి. పచ్చని మొక్కల మధ్య నడిస్తే.. మానసిక ప్రశాంతత కూడా లభిస్తుందని గుర్తుంచుకోండి. ప్రతి పనికీ ఆఫీస్ బాయ్‌పైనే ఆధారపడకండి. నీళ్ల కోసమో, ప్రింట్స్ తెచ్చుకోవడానికో అప్పుడప్పుడూ కుర్చీల్లోంచి లేవండి. క్యాంటీన్లో కాఫీ తాగేటప్పుడు కూడా కుర్చీలు, టేబుల్స్ అవసరమా? కొలీగ్స్‌తో కలిసి కాఫీ తాగేటప్పుడు కూడా ఓ నాలుగు అడుగులు వేయండి.