ఇండస్ట్రీలో రాణించాలంటే.. స్టార్‌కిడ్స్ మరింత కష్టపడి పనిచేయాలని బాలీవుడ్ వెటరన్ స్టార్ సునీల్ శెట్టి సూచిస్తున్నాడు. ఇతరుల నుంచి పోటీతోపాటు భారీ అంచనాలు, విమర్శలు కూడా వారిపై ఒత్తిడి పెంచుతున్నాయని ఆందోళన వ్యక్తంచేస్తున్నాడు. తాజాగా, ఓ జాతీయ మీడియాతో సునీల్ శెట్టి మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో వచ్చిన మార్పులు, నట వారసత్వం గురించి పలు విషయాలను పంచుకున్నాడు.
తాను చిత్రసీమలోకి వచ్చినప్పటి పరిస్థితులతో పోలిస్తే.. ఇప్పుడంతా భిన్నంగా ఉన్నదని చెబుతున్నాడు సునీల్ శెట్టి. ప్రస్తుతం స్టార్‌కిడ్స్ సక్సెస్ సాధించడం చాలా కష్టమని అంటున్నాడు. “సినీతారల వారసులు తమను తాము నిరూపించుకోవడానికి మరింత కష్టపడాలి.
ఎందుకంటే.. వారిపై ఎక్కువ ఒత్తిడి ఉంటున్నది. అయితే, నేటితరానికి నటులుగా ఎలా సిద్ధమవ్వాలో.. ఏ విషయాన్ని ఎలా నేర్చుకోవాలో పూర్తిగా తెలుసు. ఇండస్ట్రీలోకి రావాలని అనుకున్నప్పటి నుంచే నటన, డాన్స్‌తోపాటు శరీరాకృతిపైనా ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు” అంటూ చెప్పుకొచ్చాడు. ఇక నెపోటిజం, స్టార్‌కిడ్స్‌పై వస్తున్న విమర్శల గురించీ సునీల్ శెట్టి ప్రస్తావించాడు. “ప్రస్తుతం ప్రతిఒక్కరూ తమకు తామే విమర్శకులమని నమ్ముతున్నారు. సినిమాలు, నటుల గురించి తోచిన తీర్పులు చెబుతున్నారు. ఇప్పుడిప్పుడే ఓనమాలు నేర్చుకుంటున్న వారిపైనా లేనిపోని విమర్శలు గుప్పిస్తున్నారు” అంటూ ఆగ్రహం వ్యక్తంచేశాడు. ఇక చాలామంది సినిమాను విమర్శనాత్మకంగా ప్రశంసించడం లేదనీ, సినిమాపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారంటూ మండిపడ్డాడు.
సునీల్ శెట్టి ఇద్దరు పిల్లలూ ఇండస్ట్రీలోకి వచ్చారు. ఆయన కూతురు అతియా శెట్టి.. 2015లో ‘హీరో’ చిత్రంతో సినీరంగంలోకి అడుగుపెట్టింది. ఆ తర్వాత బాల్యమిత్రుడైన క్రికెటర్ కె.ఎల్. రాహుల్‌ను పెళ్లిచేసుకొని.. ఇండస్ట్రీని వదిలిపెట్టింది. ఇక సునీల్ శెట్టి నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చాడు అహాన్ శెట్టి. 2021లో యాక్షన్ రొమాన్స్ చిత్రం ‘తడప్’తో తెరంగేట్రం చేశాడు. ‘స్టార్ డెబ్యూ ఆఫ్ ది ఇయర్-మేల్’ విభాగంలో ‘ఐఫా’ అవార్డునూ అందుకున్నాడు. ప్రస్తుతం రెండుమూడు సినిమాలతో బిజీగానే ఉన్నాడు. సునీల్ శెట్టి విషయానికి వస్తే.. చిత్రసీమలో మూడు దశాబ్దాలకు పైగా అనుభవమున్న సీనియర్ నటుడు. 1992లో ‘బల్వాన్’ ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టాడు. హిందీతోపాటు తెలుగు, మలయాళం, తమిళ్, మరాఠీ, కన్నడ, ఆంగ్ల, టర్కిష్ భాషల్లో దాదాపు 100 పైగా సినిమాల్లో నటించాడు. త్వరలోనే.. హంటర్, వెల్కమ్ టు ది జంగిల్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించనున్నాడు.