నా వయసు పద్దెనిమిది. కాలేజీ విద్యార్థిని. నాదొక ఇబ్బందికర పరిస్థితి. మా ఇంట్లో ఎవరూ మాంసాహారం ముట్టరు. మడి, ఆచారం ఎక్కువ. వెల్లుల్లి, ఉల్లిపాయలు కూడా వంటల్లో వాడం. అలాంటి ఆహారాన్ని బయటి నుంచి ఆర్డర్ చేయడానికి కూడా అనుమతించరు. అయితే, ఒకరోజు నా స్నేహితురాలు తన పుట్టినరోజు పార్టీకి నన్ను ఆహ్వానించింది. అందరూ ఆరగిస్తుంటే, నేను కూడా కుతూహలంకొద్దీ చికెన్ తిన్నాను. చాలా రుచిగా అనిపించింది. ఆ తర్వాత తనే మరో రెండుసార్లు ఇంటికి పిలిచి కొసరికొసరి వడ్డించింది. అప్పుడు ఇష్టంగానే తిన్నా.. తర్వాత చాలా బాధపడ్డాను. అమ్మానాన్నలను మోసం చేశాననే అపరాధ భావం నన్నింకా వెంటాడుతున్నది. నిజం చెప్పేద్దామనే నిర్ణయానికి వచ్చాను. కానీ ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదు.
– సోదరి
ఈ ప్రశ్నకు సమాధానం మీ మాటల్లోనే తొంగి చూస్తున్నది. మీరు మాంసాహారం తింటూ తిననట్టు నటిస్తే అది కచ్చితంగా ఇంట్లోవారిని మోసగించినట్టే. అబద్ధాలు బంధాలను బలహీనపరుస్తాయి. మీకంటూ ఓ మనస్సాక్షి ఉంది. ఏం తినాలో, ఏం తినకూడదో మీరే నిర్ణయించుకోగలరు. కన్నవారి మార్గంలోనే నడవాలనుకుంటే.. ఇకనుంచీ నాన్వెజ్ తినొద్దు. ఆరోగ్యం కోసమే అయితే.. కూరగాయలు, ఆకుకూరల్లో పోషక విలువలు చాలానే ఉంటాయి. వాటి గురించి క్షుణ్నంగా తెలుసుకోండి. మరొక్క మాట.. భోజనం అనేది పూర్తిగా వ్యక్తిగత విషయం. మీ అభిరుచికి సంబంధించిన వ్యవహారం.
శాకాహారంలో రుచి, సంతృప్తి దొరకని పక్షంలో మాంసాహారాన్ని ఎంచుకోవచ్చు. అయితే, ఈ విషయాన్ని ముందు ఇంట్లో చెప్పండి. ఒప్పించండి. అమ్మానాన్నలు అనుమతిస్తే నిరభ్యంతరంగా నాన్వెజ్ తినొచ్చు. ఒకవేళ ఒప్పుకోకపోతే ఎలా అన్నది సమస్య. ఇంట్లో ఏం వండాలన్నది ఆ ఇంటి పెద్దలు నిర్ణయిస్తారు. కుటుంబ సభ్యురాలిగా ఆ ఆదేశాన్ని శిరసా వహించడం మీ బాధ్యత. మీరు బాగా చదువుకొని, ఆర్థికంగా స్థిరపడి .. స్వతంత్ర జీవనం గడుపుతున్నప్పుడు.. మీదైన ఇంట్లో మీ ఇష్ట ప్రకారం వ్యవహరించవచ్చు. అప్పటివరకూ కుటుంబ సంప్రదాయానికి విలువ ఇవ్వడం మంచిదేమో. ఆలోచించండి.