మ్యారేజ్ రిజిస్ట్రేషన్ విధానాలకు సంబంధించి యూపీ ప్రభుత్వం నిరుడు నిబంధనలను మరింత కఠినతరం చేసింది. తల్లిదండ్రుల అనుమతి లేకుండా పెండ్లి చేసుకొనే మేజర్లకు పలు కీలక సూచనలు చేసింది. ఈ మేరకు వివాహ ధ్రువీకరణ పత్రం జారీ చేయాలంటే వధువు లేదా వరుడి తరుఫు కుటుంబ సభ్యులు లేదా బంధువుల్లో ఎవరో ఒకరు తప్పనిసరిగా సంబంధిత అధికారి ముందు హాజరు కావాలి. వివాహం జరిపించిన పూజారి కూడా అధికారి ముందు వ్యక్తిగతంగా హాజరవ్వడంతో పాటు అఫిడవిట్ సమర్పించాలి. పెండ్లికి సంబంధించిన వీడియో ఫుటేజీని పెన్‌డ్రైవ్‌లో వధూవరులు ఇవ్వాలి. ఆధారాలు అన్నీ సరిగ్గా ఉన్నాయని తేలిన తర్వాతే మ్యారేజ్ సర్టిఫికెట్ జారీ చేస్తారు. వివాహ ధ్రువీకరణ పత్రం కావాల్సిన వారు తమ తల్లిదండ్రుల శాశ్వత నివాసం ఏ జిల్లాలో ఉంటుందో ఆ జిల్లాలోని సంబంధిత మ్యారేజ్ రిజిస్ట్రేషన్ ఆఫీసులోనే ధ్రువపత్రం కోసం దరఖాస్తు చేసుకోవాలి. నకిలీ మ్యారేజ్ సర్టిఫికెట్ల కేసులు పెరుగుతున్న నేపథ్యంలో గత ఏడాది అలహాబాద్ హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు యూపీ ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకొన్నది. ప్రస్తుతం ఆ రాష్ట్రంలో ఈ నిబంధనలే అమలవుతున్నాయి.