వానాకాలం ముగింపునకు వచ్చింది.. శీతకాలం ప్రవేశిస్తున్నది. చలికాలంలో చల్లని గాలులే కాదు చుట్టూ కాలుష్యమూ ఇబ్బందిపెడుతుంది. ఈ శీతల గాలుల కారణంగా అసాధారణమైన సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది. చలి, వాయు కాలుష్యం వల్ల అనేక రకాల అలర్జీలు దాడి చేస్తాయి. అయితే అలర్జీల సమస్య అంత తీవ్రంగా ఉండకపోవచ్చు. కాబట్టి, చాలామంది చికిత్స గురించి ఆలోచించరు. కానీ, ఇలా నిర్లక్ష్యం చేస్తే.. రకరకాల సమస్యలు ఉత్పన్నం అవుతాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. అలర్జీలను పట్టించుకోకపోతే.. అవి దీర్ఘకాలిక సైనసైటిస్ సమస్యకు దారి తీయొచ్చు.
చెవుల్లో ఇన్ఫెక్షన్, ఆస్తమా, నిద్రలేమి, తలనొప్పి, కళ్లమంట తదితర సమస్యలను నిర్లక్ష్యం చేస్తే.. ఇవి జీవనశైలిపై ప్రభావం చూపి ఇతర రోగాలకు దారితీయొచ్చు. కాబట్టి అలర్జీలను నిర్లక్ష్యం చేయొద్దు. ఈ సీజన్లో తరచుగా జలుబు చేయడం, ముక్కులో దురద, తుమ్ములు, కళ్లు ఎర్రబారడం, కళ్ల దురద, గొంతులో నొప్పి, దగ్గు, అలసట, ముఖం ఉబ్బరించడం లాంటి సమస్యలు తలెత్తితే చల్లని గాలికి దూరంగా ఉండాలి. దుమ్ము పీల్చకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. చల్లని ఆహారం తీసుకోకూడదు.అలర్జీని ఎదుర్కొనేందుకు పండ్లు, పోషకాలు అధికంగా ఉండే డ్రైఫ్రూట్స్ తీసుకోవాలి. తరచుగా ఈ సమస్యలు ఉంటే వైద్యులను సంప్రదించాలి. అవసరమైతే అలర్జీ పరీక్ష చేయించుకోవాలి.