పాఠశాల, కళాశాలల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయురాళ్లే ఎక్కువ! కానీ, ప్రిన్సిపాల్, కరస్పాండెంట్ లాంటి నాయకత్వ స్థానాల్లో మాత్రం.. మహిళల ప్రాతినిధ్యం చాలా తక్కువ. ఇటీవల ‘యునెస్కో’ విడుదల చేసిన ‘గ్లోబల్ ఎడ్యుకేషన్ మానిటరింగ్’ నివేదిక.. ఈ విషయాన్ని తేల్చింది. పాఠశాలలు మొదలుకొని మంత్రిత్వ శాఖల వరకు.. విద్యా వ్యవస్థలో అన్ని స్థాయుల్లో మహిళల నాయకత్వం తక్కువగా ఉన్నదని పేర్కొన్నది. ఈ సందర్భంగా అనేక విషయాలు వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సెకండరీ స్కూల్ టీచర్లలో.. మహిళల వాటా 57 శాతం. కానీ, మహిళా ప్రిన్సిపాల్స్ నిష్పత్తి మాత్రం చాలా తక్కువ. ఉన్నత విద్యలోనూ ఇదే పరిస్థితి. కళాశాల అధ్యాపకులలో మహిళలు 45 శాతం కనిపిస్తున్నారు.
నాయకత్వ పాత్రలలో 30శాతం మాత్రమే ఉన్నారు. మన దేశం విషయానికి వస్తే.. ప్రాథమిక పాఠశాలల బోధన సిబ్బందిలో మహిళలు 60 శాతం కంటే ఎక్కువగా పనిచేస్తున్నారు. కానీ, నాయకత్వ స్థానాల్లో మాత్రం భూతద్దం పెట్టి వెతికినా కనిపించడం లేదు. నియామకాల్లో ప్రతిభను కొలమానంగా చూస్తున్న యాజమాన్యాలు.. ప్రమోషన్ల విషయంలో లింగ భేదాన్ని పాటిస్తుండటమే ఇందుకు కారణమని యునెస్కో నివేదిక చెబుతున్నది. ఇక సంస్థాగతంగా మద్దతు లేకపోవడం, భద్రతా సమస్యలు, ఇక్కడ లోతుగా పాతుకుపోయిన లింగ అసమానతలు.. ఇవన్నీ విద్యా వ్యవస్థలో మహిళలను ఎదగనీయకుండా చేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ అసమానత రాజకీయ రంగంలోనూ కనిపిస్తున్నదట.
2010 – 2023 మధ్య.. ప్రపంచవ్యాప్తంగా పనిచేసిన విద్యాశాఖ మంత్రులలో కేవలం 27శాతం మాత్రమే మహిళలు ఉండటం దీనికి నిదర్శనం. అదే సమయంలో కొన్ని దేశాలు పాఠశాల నాయకత్వంలో లింగ సమానత్వాన్ని ప్రోత్సహిస్తున్నాయి. కానీ, వాటి సంఖ్య చాలా తక్కువ. ప్రపంచవ్యాప్తంగా 11 శాతం దేశాలు మాత్రమే.. పాఠశాలకు మహిళల నాయకత్వాన్ని సమర్థిస్తున్నాయి. మహిళల నాయకత్వంపై వివక్ష కొనసాగుతున్నప్పటికీ.. వారి నేతృత్వంలో నడుస్తున్న పాఠశాలల్లోనే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నాయట.
ముఖ్యంగా.. సైన్స్ – గణితం లాంటి సబ్జెక్టులలో మహిళా ప్రిన్సిపాల్స్ ఉన్న పాఠశాలల విద్యార్థులు చురుగ్గా ఉంటున్నారట. పురుషుల నేతృత్వంలోని పాఠశాలల విద్యార్థులతో పోలిస్తే.. వీరు కనీసం ఆరు నెలలు ముందున్నారని నివేదిక పేర్కొన్నది. ఇక విద్యా వ్యవస్థలో మహిళల నాయకత్వం పెరిగేందుకు చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉన్నదని నివేదిక చెబుతున్నది. ప్రమోషన్లలో పారదర్శకత పాటించడం, ఆశావహ మహిళలకు శిక్షణతోపాటు మార్గదర్శకం కల్పించడం, పనిలో వారికి సౌకర్యవంతమైన ఏర్పాట్లు చేయడం లాంటి సూచనలను సిఫారసు
చేస్తున్నది.