దేశమంతా 79వ స్వతంత్ర దిన వేడుకలకు సిద్ధమవుతున్నది. మీరూ.. ఈ జెండా పండుగకు ప్రత్యేకంగా ముస్తాబవ్వాలని అనుకుంటున్నారా? అయితే.. మన త్రివర్ణ పతాకం నుంచి ప్రేరణ పొందిన ఫ్యాషన్‌కు జై కొట్టండి. కాషాయం, తెలుపు, ఆకుపచ్చ రంగుల మేళవింపుతో.. దుస్తులను ఎంచుకోండి. మీ కార్యాలయంలో, కాలనీల్లో నిర్వహించే పంద్రాగస్టు వేడుకలకు హాజరై.. మీ దేశభక్తిని చాటండి.
జాతీయ పండుగలకు సాంప్రదాయ దుస్తులే మంచి ఎంపిక. అయితే, ఇందుకోసం కొత్తగా షాపింగ్ చేయాల్సిన పని లేదు. మీ వార్డ్‌రోబ్‌లోని తెల్లటి కుర్తా సరిపోతుంది. దీనికి ఆకుపచ్చని లెగ్గింగ్స్/ ప్యాంట్/ పలోజాను జతచేసుకోండి. వాటిపైకి మ్యాచింగ్‌గా నారింజ రంగు దుపట్టా వేసుకుంటే చాలు.. పంద్రాగస్టు వేడుకలకు సిద్ధమైనట్లే! అలా కాకుండా.. చీరకట్టును ఇష్టపడుతారా? అయితే.. కుంకుమ పువ్వు, ఆకుపచ్చ రంగుల్లో మెరిసిపోయే షిఫాన్ చీరను తీసుకోండి. దానికి మ్యాచింగ్‌గా తెలుపురంగు బ్లౌజ్‌ను ఎంచుకోండి. అంతే.. మీ లుక్‌లో భారతీయత కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది.
దుస్తులతో ప్రయోగాలు వద్దనుకుంటే.. మేకప్, నెయిల్ పాలిష్లోనూ దేశభక్తిని ఇనుమడింపచేయొచ్చు. ట్రై-కలర్ స్ఫూర్తితో మీ ఐ షాడోను తీర్చిదిద్దుకోండి. మువ్వన్నెల బొట్టుబిళ్లను ఎంచుకోండి. ఇక గోళ్లకు కాస్త సృజనాత్మకంగా త్రివర్ణాలను దిద్దుకోండి. ‘ఇదంతా ఓకే.. మరి ఆభరణాల మాటేమిటీ?’ అంటారా? అందులోనూ దేశభక్తిని చాటే నగలు ఇప్పుడు మార్కెట్లో సందడి చేస్తున్నాయి.
కాషాయం, ఆకుపచ్చ రంగురాళ్లతో గాజులు, చెవిపోగులు, నెక్లెస్‌లు రూపుదిద్దుకున్నాయి. వాటితో మరింత అందంగా ముస్తాబవ్వండి. ఇక చివరిగా.. మీ లుక్‌ను పూర్తిగా మార్చేయడానికి నారింజ లేదా ఆకుపచ్చ బ్యాగ్‌ను ఎంచుకోండి. ఇలా, ‘త్రివర్ణ సుందరి’గా సిద్ధమై.. ఈ పంద్రాగస్టు వేడుకలను మరింత ప్రత్యేకంగా జరుపుకోండి.