Transgenders | వాళ్లంతా ఏదో ఒక దశలో, ఎవరో ఒకరి చేతిలో వెక్కిరింతకు గురైనవారే. చేస్తే భిక్షాటన, లేకపోతే వ్యభిచారం.. అంతకు మించి మరోదారి తెలియనివారే. అడుగడుగునా వివక్షను తట్టుకుని అంధకారంలో బతికినవారే. చేయీ చేయీ కలిపి ఓ అద్భుతాన్ని సృష్టించారు. జీవితాలను మార్చుకున్నారు.
ఓ ట్రాన్స్జెండర్స్ బృందం విజయగాథ ఇది. కుటుంబం, సమాజం వీళ్లను చీదరించుకున్నాయి. భిక్షాటన, వ్యభిచారం, చావు-పెండ్లి నృత్యం.. ఇవే వారి బతుకు మార్గాలు. ‘ఈ జన్మ ఎందుకురా దేవుడా!’ అని గుండెలు బాదుకున్న సందర్భాలు అనేకం. ఆ చేదు అనుభవాలు ప్రేమలీలనూ ఆలోచింపజేశాయి. తన ప్రతిభను, నైపుణ్యాన్ని పెంచుకోవాలనీ, సమాజంలో గుర్తింపు పొందాలనీ భావించింది. తక్షణం భిక్షాటన ఆపేసింది. హైదరాబాద్లోని స్టేట్ ఉమెన్స్ కో-ఆపరేటివ్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్, ప్రభావన కో-ఆపరేటివ్ సొసైటీ ఆధ్వర్యంలో నడుస్తున్న స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్లో చేరింది. పవిత్ర, సహస్ర, అశ్విని, గీతతోపాటు మరో నలుగురు కూడా అక్కడ చేరారు. వీరికి జనపనార ఉత్పత్తుల తయారీలో శిక్షణ ఇచ్చారు. బృందంగా ఏర్పడి జ్యూట్ వస్తువుల తయారీని ఆరంభించారు.
అతి తక్కువ సమయంలోనే అందమైన బాస్కెట్లు, బ్యాగ్లు, ఫైల్ హోల్డర్లు, ఇతర వస్తువుల తయారీలో ప్రావీణ్యం సంపాదించారు ప్రతి ఒక్కరూ.
ఆ వ్యాపారంతో గౌరవప్రదమైన గుర్తింపు దక్కింది. ఆర్థిక స్వావలంబన సాధ్యమైంది. చీత్కారాలు అందుకున్నచోటే.. సత్కారం స్వీకరించే స్థాయికి ఎదిగారు. జెండర్ ఈక్వాలిటీ ఫైటర్ హోదాలో ఎంతోమంది ట్రాన్స్జెండర్లలో ఆత్మైస్థెర్యం నింపుతున్నది ప్రేమలీల. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా పవిత్ర నెలకు రూ.15,600 సంపాదిస్తున్నది. అందులోనే తల్లిదండ్రులకూ ఎంతోకొంత పంపుతున్నది. ఒకప్పుడు గెంటేసిన కుటుంబమే, ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నది తనను. అశ్విని ఒక పాపను దత్తత తీసుకున్నది. రేపోమాపో ఆ పాపను స్కూల్లో చేర్చబోతున్నది. గీత ఇప్పుడు సమాజానికి భయపడటం లేదు. దర్జాగా వెళ్లి అమ్మానాన్నలను కలుస్తున్నది. ఒక చిన్న నైపుణ్యం బతకగలమనే ధైర్యాన్ని ఇచ్చింది. కాస్తంత ఆసరా కొండంత ఆత్మవిశ్వాసాన్ని ప్రసాదించింది. నెలనెలా బ్యాంకు ఖాతాలో పడుతున్న సంపాదన దూరమైన బంధాలను దారంలా కలిపింది. వాళ్లంతా కోరుకున్నది కూడా ఇలాంటి సానుకూలమైన మార్పునే!
ట్రాన్స్జెండర్ల సమస్యలపై పోరాడుతున్న డాక్టర్ త్రినేత్ర.. ఎవరీమె !!”
Kamathipura Post Office | కామాటిపురలోని సెక్స్ వర్కర్ల జీవితంలో వెలుగు తీసుకొస్తున్న పోస్టాఫీస్”