మారుతున్న జీవనశైలి.. కాలేయానికి చేటు చేస్తున్నది. శరీరంలో అతిముఖ్యమైన ఈ అవయవం.. క్రమంగా అనారోగ్యం బారిన పడుతున్నది. అయితే, చిన్నచిన్న అలవాట్లతోనే.. కాలేయాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవచ్చని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
కాఫీ.. టీ: ఉదయాన్నే వేడివేడిగా తీసుకునే కాఫీ, టీలు.. కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయట. క్రమం తప్పకుండా ఈ ఉష్ణోదకాలను తాగేవారిలో నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ సమస్యతోపాటు ఇతర కాలేయ వ్యాధుల ప్రమాదం తగ్గుతుందని పలు పరిశోధనల్లో తేలింది. కాఫీలో ఉండే క్లోరోజెనిక్ యాసిడ్.. కాలేయం వాపును తగ్గిస్తుంది. కాలేయ కణాలను రక్షిస్తుంది. అయితే, బ్లాక్ కాఫీని ఎంచుకోవడంతోపాటు చక్కెర వాడకపోవడం వల్ల మంచి ప్రయోజనాలు పొందొచ్చు. కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ‘బ్లాక్ టీ’ సమర్థంగా పనిచేస్తుంది.
గ్రీన్ టీ: కాటెచిన్ అనే యాంటి ఆక్సిడెంట్లు గ్రీన్ టీలో పుష్కలంగా లభిస్తాయి. ఇవి కాలేయ ఆరోగ్యానికి మద్దతునిస్తాయి. కాలేయ కణాలు దెబ్బతినకుండా కాపాడటంతోపాటు లివర్‌ను బాగు చేయడంలోనూ ముందుంటాయి. రెగ్యులర్‌గా గ్రీన్ టీ తాగేవారిలో కాలేయంలో కొవ్వు పేరుకుపోవడం తగ్గుతుందని పలు అధ్యయనాలు నిరూపించాయి. అయితే.. అధిక మొత్తంలో తీసుకుంటే కాలేయంపై ఒత్తిడి పడే ప్రమాదం ఉంటుంది.
బీట్రూట్ జ్యూస్: కాలేయ ఆరోగ్యానికి బీట్రూట్ జ్యూస్ ఎంతో మేలుచేస్తుంది. కాలేయంలో కొవ్వు పేరుకుపోకుండా కాపాడుతుంది. ఎంజైమ్‌ల పనితీరును మెరుగుపరుస్తుంది. ఇందులో ఉండే బీటైన్ అనే పదార్థం.. కాలేయ డిటాక్సిఫికేషన్‌కు మద్దతునిస్తుంది. శరీరంలో ఫ్రీ రాడికల్స్‌ను నియంత్రించడంలో బీట్రూట్ జ్యూస్ సాయపడుతుంది. ఫలితంగా, కాలేయంపై పనిభారం తగ్గుతుంది.