Child | జైపూర్ : ఇది అమానవీయ ఘటన.. ముచ్చుపచ్చలారని ఓ పసికందు పట్ల కనుకున్న తల్లిదండ్రులు కర్కశకంగా ప్రవర్తించారు. ఆ బిడ్డ నోట్లో రాయి పెట్టి.. మూతికి జిగురు అతికించి అడవిలో వదిలేసి వెళ్లిపోయారు. అయినా కూడా ఆ పసిపాప ప్రాణాలతో బతికి బయటపడింది.
వివరాల్లోకి వెళ్తే.. రాజస్థాన్లోని భిల్వారా జిల్లాలోని ఓ అడవిలో చెట్ల పొదలు, రాళ్ల మధ్య ఓ 15 రోజుల పసికందు ఓ పశువుల కాపరి కంటపడింది. ఆ పసిపాప కొన ఊపిరితో కొట్టుమిట్టాడుతోంది. ఆ బిడ్డ నోటికి జిగురు పెట్టి అరవకుండా చేశారు. అయితే ఆ పశువుల కాపరి మూతికి ఉన్న జిగురు తీయగా.. మరో దిగ్భ్రాంతికర విషయం వెలుగు చూసింది. పాప నోట్లో రాయి పెట్టారు. అంటే ఆ బిడ్డ అరవకుండా.. ఊపిరాడక ప్రాణాలు కోల్పోవాలనే ఉద్దేశంతోనే ఇదంతా చేసి ఉంటాని ఆ వ్యక్తి నిర్ధారించుకున్నారు.
రాయిని నోట్లో నుంచి తీసేశాడు కాపరి. ఇక ఏ మాత్రం ఆలస్యం చేయకుండా.. ఆ పసికందును ఎత్తుకుని ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలివెళ్లాడు. ప్రస్తుతం శిశువు చికిత్స పొందుతుంది. పాప ఆరోగ్యం నిలకడగా ఉండడంతో పశువుల కాపరి సంతోషం వ్యక్తం చేశారు.
ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. స్థానికంగా ఉన్న ఆస్పత్రుల్లో 15 రోజుల క్రితం అయిన డెలివరీలను పరిశీలిస్తున్నారు. శిశువు తల్లిదండ్రుల ఆచూకీ కోసం గాలిస్తున్నారు.