జెనీవా: పెయిన్ కిల్లర్ టైలినాల్(ఇండియాలో పారాసిటమాల్)ను గర్భిణీ స్త్రీలు వాడకూడదని ట్రంప్ పేర్కొన్న విషయం తెలిసిందే. ఆ డ్రగ్ వాడకం వల్ల ఆటిజం పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నట్లు ట్రంప్ చేసిన వ్యాఖ్యలను ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO)కొట్టిపారేసింది. ప్రెగ్నెన్సీ సమయంలో పారాసిటమాల్ ట్యాబ్లెట్లను వాడడం వల్ల ఆటిజం పిల్లలు పుట్టే అవకాశాలు ఉన్నాయన్న వాదనకు ఆధారాలు లేవని డబ్ల్యూహెచ్‌వో పేర్కొన్నది. జెనీవాలో డబ్ల్యూహెచ్‌వో ప్రతినిది తారిక్ జాసరవిక్ మాట్లాడుతూ.. టైలినాల్, ఆటిజం మధ్య ఉన్న లింకు అంశంలో ఆధారాలు సరిగా లేవన్నారు. వ్యాక్సిన్ల వల్ల ఆటిజం రాదన్న విషయం తెలుసు అని, టీకాలు కోట్లాది మంది ప్రాణాలను కాపాడుతున్నాయని, ఇది శాస్త్రీయంగా నిర్ధారణ జరిగిందని, దీన్ని ప్రశ్నించలేమని డబ్ల్యూహెచ్‌వో ప్రతినిధి తారిక్ తెలిపారు.
డబ్ల్యూహెచ్‌వో చెప్పిన విషయాన్నే యురోపియన్ మెడిసిన్స్ ఏజెన్సీ కూడా సమర్థించింది. ఈయు దేశాల్లో పారాసిటమాల్‌ను అసిటమినోఫిన్గా వాడుతుంటారు. ప్రగ్నెన్సీ మహిళల్లో నొప్పులు, జ్వరం వస్తే ఆ మందునే వినియోగిస్తారు. అయితే ప్రస్తుతం ఆ మాత్రలను మార్చే కొత్త ప్రతిపాదనలు ఏమీ లేవని యురోపియన్ మెడికల్ ఏజెన్సీ పేర్కొన్నది. జ్వరంతో ఉన్న ప్రెగ్నెంట్ మహిళలకు పారాసిటమాల్‌నే వాడుతామని ఈఎంఏ చీఫ్ మెడికల్ ఆఫీసర్ స్టీఫెన్ తిర్స్ట్రుప్ తెలిపారు. ప్రెగ్నెన్సీలో పారాసిటమాల్ వాడితే దాని వల్ల పిల్లల్లో ఆటిజం వస్తుందన్న ఆధారాలు తమ వద్ద లేవన్నారు.
ట్రంప్ ఆదేశాల తర్వాత అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ స్పందించింది. అసిటమినోఫెన్ ఉత్పత్తులకు వార్నింగ్ లేబుల్స్ జత చేయనున్నట్లు ఎఫ్‌డీఏ చెప్పింది. గర్భం దాల్చిన సమయంలో ఈ మందును వాడడం వల్ల నరాల సంబంధిత ఆటిజం వ్యాధి సోకే ప్రమాదం ఉందని ఆ హెచ్చరికలో తెలుపనున్నట్లు ఎఫ్‌డీఏ పేర్కొన్నది.
టైలినాల్ వాడకం వల్ల ఆటిజం వస్తుందన్న ట్రంప్ వ్యాఖ్యలను ఆ మందు తయారీ చేసే కెన్వూ కంపెనీ కొట్టిపారేసింది. అసిటమినోఫెన్ తీసుకోవడం వల్ల ఆటజం రాదన్న విషయాన్ని శాస్త్రీయంగా నిర్ధారించినట్లు ఆ కంపెనీ చెప్పింది. పారాసిటమాల్ వినియోగంపై భారత ప్రభుత్వ ఆరోగ్య శాఖ ఇంకా ఎటువంటి ప్రకటన చేయలేదు.