సరసిజ నయనే సరోజహస్తే ధవళ తరాంశుక గంధమాల్య శోభే
భగవతి హరివల్లభే మనోజ్ఞే త్రిభువన భూతికరి ప్రసీదమహ్యమ్
సిరిసంపదలు, సంతానం, సౌభాగ్యం, ధైర్య సాహసాలు, విజయాలు ప్రసాదించే దేవత శ్రీమహాలక్ష్మి. సకల లోకాలకు ఈమె ఐశ్వర్య ప్రదాత. ఇరువైపులా గజరాజులు సేవిస్తుండగా, రెండు చేతుల్లో కమలాలు ధరించి, అభయ, వరద ముద్రలతో భక్తులకు దర్శనమిస్తుంది. త్రిపురాత్రయంలో ఈమె మధ్యశక్తి. శ్రీసూక్తం లక్ష్మీదేవి వైభవాన్ని ఎంతగానో ప్రకటిస్తుంది. అగ్ని, మత్స్య పురాణాలు లక్ష్మీదేవి ఆకృతి, శిల్ప నిర్మాణ నియమాలను వివరంగా చెబుతున్నాయి. అష్టలక్ష్ములకూ అధిష్ఠాన దేవత ఈమె. మహాలక్ష్మి ఉపాసనతో లౌకిక సంపదతోపాటు అలౌకికమైన మోక్షసంపద కూడా లభిస్తుంది. శ్రీసూక్త విధానంగా ఎర్రని పుష్పాలతో, లక్ష్మీ అష్టోత్తర నామాలతో అర్చించి, పూర్ణాలు నివేదన చేయాలి. అమ్మకు ప్రీతిగా సువాసినీ పూజ చేయాలి.