చలికాలంలో వేధించే ఆరోగ్య సమస్యల్లో గొంతు నొప్పి ఒకటి. చలి వాతావరణంతోపాటు హానికారక బ్యాక్టీరియా, వైరస్లవల్ల గొంతు ఇన్ఫెక్షన్ వస్తుంది. దీనివల్ల అన్నం తినడం, నీళ్లు తాగడం కూడా కష్టమవుతుంది. అయితే.. వంటింట్లోనే దొరికే పసుపు, మిరియాలు, లవంగాలతోనే గొంతు నొప్పికి చెక్ పెట్టవచ్చు.
పసుపు-పాలు.. గొంతు సమస్యలకు అద్భుతమైన పరిష్కారం. ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలపడుతుంది. గ్లాసు గోరువెచ్చని పాలలో రెండు చిటికెల పసుపును కలిపి తాగితే.. గొంతు ఇన్ఫెక్షన్లు ధరిచేరవు.
లవంగాలు.. శక్తిమంతమైన యాంటి సెప్టిక్ లక్షణాలను కలిగి ఉంటాయి. ఇందులో ఉండే యూజినాల్ అనే సమ్మేళనం.. గొంతులోని బ్యాక్టీరియాను చంపేస్తుంది.
మిరియాల్లో యాంటి ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువ. ఇందులో లభించే పైపెరిన్ అనే సమ్మేళనం.. గొంతులో వాపు, మంటను తగ్గించడంలోనూ సాయపడుతుంది. ఇందులోని యాంటి బ్యాక్టీరియల్ గుణాలు.. ఇన్ఫెక్షన్కు కారణమయ్యే బాక్టీరియాను నాశనం చేస్తాయి.
ఒక టేబుల్ స్పూన్ తేనెలో చిటికెడు నల్ల మిరియాల పొడి కలిపి తీసుకుంటే.. గొంతు నొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
ఒక గ్లాసు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపి, ప్రతిరోజూ ఉదయం పుక్కిలిస్తే.. గొంతునొప్పి దూరమవుతుంది.
ఒక టీస్పూన్ తేనెలో రెండుమూడు తులసి ఆకుల రసాన్ని పిండి.. తాగినా గొంతునొప్పి తగ్గుతుంది.