వానాకాలమో చలికాలమో ఊళ్లకీ, ట్రిప్పులకీ వెళితే బట్టలు ఆరేయడం అన్నది పెద్ద సమస్యగా ఉంటుంది. రెండు మూడు రోజులైతే ఫర్వాలేదు కానీ అంతకు మించి ఉండాల్సి వస్తే చిన్నవో పెద్దవో దుస్తులు ఉతికి ఆరేసుకోక తప్పదు. కానీ చాలా సార్లు అక్కడ వసతి ఉండదు. కొన్నిసార్లు వాతావరణం కారణంగా ఆరు బయట దుస్తులు ఆరే అవకాశం ఉండదు.
అలాంటప్పుడు ఏ చోటైనా కొద్దిగా వసతి ఉంటే చాలు చటుక్కున దుస్తులు ఆరేసుకుని, గబుక్కున తీసేసుకునేలాంటి అవకాశాన్ని కల్పిస్తాయి ఈ ‘పోర్టబుల్ క్లాత్స్ లైన్’లు. అవేనండీ పోర్టబుల్ దండేలన్నమాట! వీటికి ఆ చివరా ఈ చివరా హుక్కుల్లాంటివి ఉంటాయి. మధ్యలో తాడుకి బట్టల క్లిప్పులు కూడా పెట్టి ఉంటాయి.
ఆరేసిన దుస్తులు బరువు వల్లనో గాలి వల్లనో ఒకదాని మీద ఒకటి పడకుండా ఉండేందుకు మధ్యలో పూసల్లాంటి క్లిప్పులూ ఉంటాయి. గదిలో అవకాశం ఉన్న ఏదో ఓ మూల తాడు చివర ఉండే హుక్కుల్ని తగిలించుకుంటే చక్కగా బట్టలు ఆరేసుకోవచ్చు. కాస్త పొడిబారగానే దుస్తుల్నీ దండేన్నీ తీసేసి బ్యాగులో పెట్టేసుకోవచ్చు.
ఆరుబయట ఆరేసుకోవాలన్నా ఇది ఉపయోగకరమే. తీగకూడా ఎలాస్టిక్లా సాగుతుంది కనుక, పది పన్నెండు అడుగుల పొడవు వరకూ దీన్ని లాగి కట్టుకోవచ్చు. కాబట్టి ఎవరో వచ్చి దండెం కట్టాలి, ఏదో ఏర్పాటు ఉండాలి అన్న సమస్య లేకుండా ఎవరికి వారు ఎక్కడైనా హాయిగా బట్టల్ని ఆరబెట్టుకునేందుకు ఇవి చక్కగా పనికొస్తాయి. ఇక ఎక్కడికి వెళ్లినా ఆరేసే విషయంలో బెంగ అక్కర్లేనట్టే మరి!