ఆర్థిక రాజధాని ముంబై.. ఆనందకరమైన నగరంగా నిలవడం గొప్ప విషయమని అంటున్నదని బాలీవుడ్ సీనియర్ నటి రవీనా టాండన్. తాజాగా, టైమ్ అవుట్ మ్యాగజైన్ విడుదల చేసిన ‘సిటీ లైఫ్ ఇండెక్స్-2025’లో ఆసియాలోనే అత్యంత సంతోషకరమైన నగరంగా ముంబై ఎంపికైంది. ఇదే నగరంలో పుట్టి పెరిగిన 53 ఏళ్ల రవీనా.. ముంబైతో తనకున్న అనుబంధాన్ని ఈ సందర్భంగా పంచుకున్నది.
“ఇక్కడి ప్రజలే.. ఈ మహానగరపు ఆత్మ. వారి కలలను నెరవేర్చడంలో ముంబై ఎప్పుడూ ముందే ఉంటుంది” అంటూ ముంబైని ఆకాశానికి ఎత్తేసింది. ఇంకా మాట్లాడుతూ.. “ఇక్కడి ప్రజల్లోనే ఈ నగర బలం మొత్తం దాగిఉంది. ఏదైనా సరే ముందుకు సాగడానికి, ఆశాజనకంగా ఉండటానికి ఇక్కడి ప్రజల్లో చెప్పలేని అవగాహన ఉంది. ఇక్కడ అన్నివర్గాల వారూ నివసిస్తారు. కూలీలు మొదలుకొని కోట్లకు పడగలెత్తినవారు కనిపిస్తారు. ఈ నగరం అందరినీ సమాన దృష్టితోనే చూస్తుంది. ఎందుకంటే.. వారంతా ముంబై అభివృద్ధిలో కీలకంగా వ్యవహరించేవారే కదా!” అంటూ చెప్పుకొచ్చింది. నగరంలో తనకు ఆనందాన్ని కలిగించే ప్రదేశాలెన్నో ఉన్నాయనీ, ప్రశాంతమైన వాతావరణంలో, జీవితాన్ని రీఛార్జ్ చేసుకుంటూ సమయాన్ని గడిపాననీ వెల్లడించింది.
ఇక సినీ పరిశ్రమ కేంద్రంగా పెరిగిన రవీనా.. నగరంలోని చిరస్మరణీయ సినిమా షూటింగ్‌ల గురించీ పంచుకున్నది. “సినిమా కోసం నా తండ్రి పడే కష్టాన్ని చూస్తూ పెరిగాను. స్కూల్లో కన్నా.. సినిమా సెట్స్‌లోనే ఎక్కువగా గడిపాను. అందుకే.. ఈ సినిమా ప్రపంచం నన్ను అమితంగా ఆకర్షించింది. గోరేగావ్ ఫిల్మ్ సిటీ, దక్షిణ ముంబై లాంటి ప్రదేశాలలో జరిగే షూటింగ్స్.. నా జ్ఞాపకాల్లో చిరస్థాయిగా నిలిచి ఉంటాయి” అంటూ గతాన్ని గుర్తుచేసుకున్నది. కొన్నేళ్లుగా అత్యంత వేగంగా అభివృద్ధి చెందినప్పటికీ.. ముంబై నగర ఆత్మ, స్ఫూర్తి ఏమాత్రం మారలేదని చెబుతున్నది. దివంగత బాలీవుడ్ దర్శకుడు రవి టాండన్ వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది రవీనా టాండన్. ‘పథర్ కే ఫూల్’లాంటి సూపర్ హిట్ చిత్రంతో పరిశ్రమలోకి అడుగుపెట్టి.. ‘గోల్డెన్ లెగ్’ ట్యాగ్ అందుకున్నది. ఆ తర్వాత హిట్టుమీద హిట్టు కొడుతూ.. బాలీవుడ్ క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నది. ఒక్క ఏడాదిలోనే ఎనిమిది బ్లాక్‌బస్టర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్నది. అడపాదడపా సినిమాలు చేస్తున్నా.. లైమ్‌లైట్‌కు మాత్రం దూరంకాలేదు. ప్రస్తుతం రవీనా నట వారసురాలిగా ఆమె ముద్దుల తనయ రషా తడానీ కొనసాగుతున్నది.