Varanasi | సూపర్ స్టార్ మహేష్ బాబు – రాజమౌళి కాంబినేషన్లో రూపొందుతున్న పాన్ వరల్డ్ మూవీ ‘వారణాసి’పై భారీ అంచనాలు నెలకొన్నాయి. షూటింగ్ వేగంగా కొనసాగుతున్న నేపథ్యంలో, ఈ సినిమా విశేషాలను అభిమానులతో పంచుకోవడానికి దర్శకుడు రాజమౌళి ప్రత్యేకంగా ‘గ్లోబ్ ట్రాటర్’ పేరుతో భారీ ఈవెంట్‌ను రామోజీ ఫిల్మ్ సిటీలో నిర్వహించారు.ఈ కార్యక్రమంలో సంగీత దర్శకుడు ఎం.ఎం. కీరవాణి మాటల్లోనే సినిమా రిలీజ్ డేట్ వెల్లడించడం హైలైట్‌గా నిలిచింది. “వారణాసి 2027 సమ్మర్లో థియేటర్లలోకి రాబోతోంది” అని చెప్పకనే చెప్పేశారు.
ఈవెంట్లో కీరవాణి, మహేష్ బాబు సినిమా ‘పోకిరి’పై తన అభిమానాన్ని పంచుకున్నారు.“పోకిరి ఎన్నిసార్లు చూశానో నాకు కూడా గుర్తు లేదు. చాలామంది నా మెలొడీని మాత్రమే చెబుతారు… కానీ మెలొడీ నాదే, ఫాస్ట్ బీట్ నాదే,” అని చెప్పి, పోకిరి ఫేమస్ డైలాగ్‌ను పవర్ఫుల్ టోన్‌లో చెప్పి సభను ఉర్రూతలూగించారు. మహేష్ బాబు ఫ్యాన్స్ గుండెల్లో ప్లాట్ కొన్నాను… టైల్స్ కూడా వేస్తున్నాను అని చెప్పి అభిమానులను ఖుషీ చేశారు. “మోసగాళ్లకు మోసగాడు చూసిన దగ్గర నుంచి కృష్ణగారికి డై హార్డ్ ఫ్యాన్ అయ్యాను. అటువంటి మహానటుడి వారసుడితో – మహేష్ బాబుతో పనిచేస్తుండటం గౌరవంగా ఉంది. మహేష్ విశ్వరూపం ఈ సినిమాలో కనిపిస్తుంది,” అని అన్నారు.
ఈ ఈవెంట్లో మహేష్ బాబు తన ఫస్ట్ లుక్‌తో కూడిన టైటిల్ వీడియోను విడుదల చేశారు.త్రిశూలం పట్టుకుని, ఎద్దుపై సవారీ చేస్తూ వచ్చిన మహేష్ లుక్ సోషల్ మీడియాలో దుమ్ము రేపుతోంది. మహేష్ బాబును రుద్ర అవతారంలో చూపించిన రాజమౌళి విజువల్ ట్రీట్ ఎలా ఉండబోతుందో అభిమానుల్లో ఆసక్తి పుట్టించింది. చిత్రంలో ప్రియాంక చోప్రా – మందాకిని పాత్ర, పృథ్వీరాజ్ సుకుమారన్ – కుంభ పాత్ర (విలన్ పాత్ర) పోషిస్తున్నారు. వారి ఫస్ట్ లుక్ పోస్టర్స్ ఇప్పటికే వైరల్ అయ్యాయి. ముఖ్యంగా పృథ్వీరాజ్ లుక్‌పై సోషల్ మీడియాలో మీమ్స్, పోలికలు వెల్లువెత్తాయి. తమిళ సినిమా ‘24’లో సూర్య గెట్అప్తో పోలుస్తూ ట్రోల్స్ కూడా వచ్చాయి. పాన్ వరల్డ్ విజన్‌తో రూపొందిస్తున్న ‘వారణాసి’ 2027 సమ్మర్‌కు సిద్ధమవుతోంది.నందిపై రుద్రుడిలా దూసుకొస్తున్న మహేష్ బాబు ఫస్ట్ లుక్ చూస్తే, సినిమా ఎలాంటి విజువల్ స్పెక్టకిల్‌గా ఉంటుందో ఇప్పుడే ఊహించేస్తున్నారు ఫ్యాన్స్.