Varanasi | సూపర్ స్టార్ మహేశ్‌బాబు – దర్శక ధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కాంబినేషన్ లో వస్తున్న గ్లోబల్ యాక్షన్ అడ్వెంచర్ ‘వారణాసి’ నుంచి భారీ అప్డేట్ వచ్చేసింది. అభిమానులతోపాటు మొత్తం సినీ పరిశ్రమ వేచి చూసిన గ్లింప్స్ వీడియోను గ్లోబ్‌ట్రాటర్ గ్రాండ్ ఈవెంట్లో ఘనంగా విడుదల చేశారు. మూడు నిమిషాల నిడివితో వచ్చిన ఈ వీడియోలో చూపించిన విజువల్స్ ప్రపంచ స్థాయి మేధస్సు, విపరీతమైన స్కేలు చూపిస్తున్నాయి. గ్లింప్స్‌లో వారణాసి 512 CE, గ్రహశకలం శాంభవి 2027 CE, అంటార్కిటికా–ఆఫ్రికా, ఉగ్రభట్టి కేవల్, లంకా–త్రేతాయుగం, వారణాసి మణికర్ణిక ఘాట్ వంటి అనేక ప్రాంతాలు, యుగాలు చూపించారు. దీంతో ఈ చిత్రం ఒక్క జానర్‌కు పరిమితం కాదని స్పష్టమవుతోంది. టైమ్ ట్రావెల్, సైన్స్ ఫిక్షన్, మైథలాజీ, యాక్షన్ అడ్వేంచర్ అదుర్స్ అనిపించేలా గ్లింప్స్‌ను రూపొందించారు.
అంతర్జాతీయ స్థాయిలో నిర్మిస్తోన్న ఈ సినిమా రాజమౌళి కెరీర్లోనే అత్యంత పెద్దదిగా మారనున్నట్లు ఈ వీడియో చెబుతోంది. అత్యున్నత నాణ్యతతో చూపించిన వీఎఫ్ఎక్స్ గ్లింప్స్‌కు స్పెషల్ అట్రాక్షన్ అయింది. చివర్లో నందిపై కూర్చొని, చేతిలో త్రిశూలం పట్టుకుని రౌద్రంగా నిలిచిన మహేశ్‌బాబు లుక్ ఫ్యాన్స్‌ను షాక్‌కి గురి చేస్తోంది. సోషల్ మీడియాలో “ఈ సినిమాకు ఆకాశమే హద్దు” అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. చిత్రంలో మహేశ్ బాబు .. రుద్ర, ప్రపంచాన్ని చుట్టే సాహస యాత్రికుడు కాగా, ప్రియాంక చోప్రా – మందాకిని పాత్ర పోషించింది. పృథ్వీరాజ్ సుకుమారన్ – కుంభ, శక్తివంతమైన విరోధి పాత్ర పోషించాడు.
ఇక ఈవెంట్లో ‘సంచారి’ పాట కూడా మార్మోగగా, ఇప్పటికే ఆ పాట సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కీరవాణి సంగీతం సమకూరుస్తుండగా, కేఎల్ నారాయణ – కార్తికేయ ఈ చిత్రాన్ని భూభాగాలపై షూట్ చేస్తూ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఇప్పటివరకు 60 రోజుల షూటింగ్ పూర్తయిందని రాజమౌళి వెల్లడించారు. ఇంకా ప్రధాన కార్యక్రమాలు మిగిలి ఉన్నందున త్వరలో మరో షెడ్యూల్ ప్రారంభించనున్నారు. ‘వారణాసి’ను 2027 సమ్మర్లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటివరకూ వచ్చిన ప్రమోషనల్ కంటెంట్‌తోనే సినిమా అంచనాలు ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోయాయి. ఈ గ్లింప్స్‌తో రాజమౌళి–మహేశ్ కాంబినేషన్ సరికొత్త ప్రపంచాన్ని ఆవిష్కరించబోతోందని స్పష్టమవుతోంది.