మెరుపు..
సోషల్ మీడియా.. ఎవరో ఒకరిని ఒక్కసారిగా ఆకాశానికి ఎత్తేస్తుంది. ఫొటోనో-వీడియోనో.. డ్యాన్సో-డైలాగో.. ఏదో ఒకదాన్ని తెగ వైరల్ చేసేస్తుంది. అందులో కనిపించిన వారిని ఓవర్‌నైట్ స్టార్‌గా మార్చేస్తుంది. ప్రస్తుతం మరాఠీ నటి గిరిజ ఓక్ కూడా.. అలాంటి వైరల్ ఫేమ్‌నే అందుకున్నది. తాజాగా, ఓ యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నది గిరిజ. నీలిరంగు చీరలో సింపుల్‌గానే ముస్తాబైనా.. తన అందంతో అందరినీ కట్టిపడేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు సామాజిక మాధ్యమాల్లో చెక్కర్లు కొడుతున్నాయి. దాంతో, నిన్నమొన్నటి దాకా ఎవరికీ పెద్దగా తెలియని గిరిజ.. ఇప్పుడు జాతీయ స్థాయిలో తెగ ట్రెండ్ అవుతున్నది. దాంతో, ‘ఎవరీ గిరిజ?’ అంటూ నెట్టింట సెర్చ్ మొదలైంది. మహారాష్ట్రలోని నాగ్‌పూర్.. గిరిజ ఓక్ స్వస్థలం. డిగ్రీ తర్వాత నాటకరంగంలోకి ప్రవేశించింది. థియేటర్ ఆర్ట్స్ ప్రావీణ్యం సంపాదించి, మొదట్లో కొన్ని యాడ్ ఫిల్మ్స్ చేసింది. ఆ తర్వాత సినిమాలు, సీరియల్స్‌లోకి ఎంటరైంది. మరాఠీతోపాటు హిందీలోనూ అవకాశాలు దక్కించుకుంది. తారే జమీన్ పర్, షోర్ ఇన్ ది సిటీ, జవాన్ లాంటి సినిమాల్లో నటించింది. కార్టెల్, మోడ్రన్ లవ్ ముంబై వెబ్‌సిరీస్‌లతోనూ మంచిపేరు తెచ్చుకుంది. అయితే, దాదాపు 20 ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉంటూ, 30 వరకూ ప్రాజెక్టులలో పనిచేసినా ఈ నటికి పెద్దగా గుర్తింపు రాలేదు. కానీ, ఒకేఒక్క యూట్యూబ్ ఛానెల్ ఇంటర్వ్యూ.. గిరిజ ఓక్‌ను జాతీయస్థాయి సెలెబ్రిటీగా మార్చేసింది.
ఉరుము..
ఓవైపు గిరిజ ఓక్‌ను దేశవ్యాప్తంగా తెగ వైరల్ చేసిన సోషల్ మీడియా.. మరోవైపు ఆమెకు లేనిపోని చిక్కులు తెచ్చిపెడుతున్నది. కొందరు గిరిజ ఫొటోలు, వీడియోలను ఏఐ టెక్నాలతో అశ్లీలంగా మార్ఫింగ్ చేస్తున్నారు. వాటిని సామాజిక మాధ్యమాల్లో వైరల్ చేస్తున్నారు. ఈ మార్ఫింగ్ ఫొటోలపై గిరిజ ఓక్ తాజాగా స్పందించింది. ఏఐతో సృష్టించిన మార్ఫింగ్ ఫొటోల వల్ల తాను ఇబ్బంది పడుతున్నట్లు చెప్పుకొచ్చింది. ముఖ్యంగా, తన 12 ఏళ్ల కొడుకు భవిష్యత్తు గురించి ఆందోళన వ్యక్తం చేసింది. “ఇప్పుడు వైరల్ అవుతున్న మార్ఫింగ్ ఫొటోలను చాలామంది చూసి వదిలేస్తారు. కానీ, అవి ఇంటర్నెట్లో శాశ్వతంగా ఉండిపోతాయి. నా 12 ఏళ్ల కొడుకు ఇప్పుడు సోషల్ మీడియా వాడటం లేదు. కానీ, భవిష్యత్తులో వాడవచ్చు. అప్పుడు ఈ మార్ఫింగ్ ఫొటోలను చూస్తే? ఆ ఆలోచనే నాకు భయాన్ని కలిగిస్తున్నది” అంటూ భావోద్వేగానికి గురైంది.ఆ ఫొటోలను వెంటనే సామాజిక మాధ్యమాల్లోంచి తొలగించాలని విజ్ఞప్తి చేసింది.