ప్రస్తుతం ‘ప్రేమ’ అనే మాటకు అర్థమే మారిపోయిందని అంటున్నాడు బాలీవుడ్ సీనియర్ హీరో అజయ్ దేవ్గన్. తమకాలంలో ‘ప్రేమ’కు ఎంతో విలువ, ప్రాధాన్యత ఉండేదనీ.. కాలక్రమంలో దాని విలువ తగ్గిపోతున్నదని ఆవేదన వ్యక్తంచేస్తున్నాడు. తన తాజా సినిమా ‘దే దే ప్యార్ దే 2’ ప్రమోషన్ కార్యక్రమంలో భాగంగా.. ఓ యూట్యూబ్ ఛానెల్‌కు ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చాడు అజయ్ దేవ్గన్. ఈ సందర్భంగా.. ప్రేమ, పెళ్లి విషయాలపై తన అభిప్రాయాలను పంచుకున్నాడు. “మన తరంలో.. ‘ఐ లవ్యూ’ అని చెప్పడం చాలా పెద్ద విషయం. ఎదుటివారిపై ఎంతో ప్రేమ, నమ్మకం ఉంటేనేగానీ చెప్పేవాళ్లం కాదు. కానీ, ఇప్పుడు ఆ మాటలకు అర్థం, విలువ లేకుండా పోయింది. ‘ప్రేమ’ లోతు ఇప్పటివారికి అర్థం కావడంలేదు” అంటూ చెప్పుకొచ్చాడు. అయితే, అంతకుముందు అజయ్ దేవ్గన్ భార్య, బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ కాజోల్ కూడా ప్రేమ-పెళ్లి విషయంపై చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. పెళ్లికీ ఒక ఎక్స్పైరీ డేట్ ఉండాలని, రెన్యువల్ ఆప్షన్ కూడా ఉండాలని కాజోల్ చెప్పడం.. అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది.
అజయ్ దేవ్గన్-కాజోల్‌ది బాలీవుడ్లో అత్యంత ప్రాముఖ్యత కలిగిన ప్రేమకథలలో ఒకటి. 1995లో వచ్చిన ‘హల్చల్’ సినిమా సెట్స్‌లో.. వీరిద్దరూ మొదటిసారి కలుసుకున్నారు. స్నేహంతో మొదలు పెట్టి.. ప్రేమికులుగా మారారు. దాదాపు నాలుగేళ్ల డేటింగ్ తర్వాత.. 1999లో వివాహబంధంలోకి అడుగుపెట్టారు. ఆ తర్వాత కూడా పలు విజయవంతమైన చిత్రాలలో కలిసి నటించారు. అయితే, ప్రేమ-పెళ్లి వ్యవహారంపై ఈ బాలీవుడ్ కపుల్ చేసిన వ్యాఖ్యలు.. ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి. 26 ఏళ్ల వైవాహిత జీవితం నేపథ్యంలో.. కాజోల్-అజయ్ దేవగన్ నుంచి ఇలాంటి వ్యాఖ్యలు రావడం ఏమిటా? అని నెటిజనం ఆశ్చర్యపోతున్నది. ‘ఆ వ్యాఖ్యల వెనక మర్మం ఏమిటా?’ అని బుర్రలు బద్ధలు కొట్టుకుంటున్నది. ఇక సినిమాల విషయానికి వస్తే.. కాజోల్ ఇటీవలే మా, సర్జమీన్ చిత్రాలతో ప్రేక్షకులను పలకరించింది. ప్రస్తుతం ‘మహారాజ్ఞి’ సినిమా చిత్రీకరణ దశలో ఉన్నది. అజయ్ దేవ్గన్ కూడా మంచి జోష్‌మీద సినిమాలు చేస్తున్నాడు. తాజాగా, ‘దే దే ప్యార్ దే2’తో మరో హిట్‌ను ఖాతాలో వేసుకున్నాడు.