అమ్మాయిల ఆహారపు అలవాట్లకు.. రుతుచక్రానికి మధ్య సంబంధం ఉన్నదని పరిశోధకులు చెబుతున్నారు. ప్రాసెస్ చేసిన ఆహార పదార్థాలను ఎక్కువగా తినే బాలికలు.. త్వరగా రజస్వల అవుతారని తాజా అధ్యయనంలో తేల్చారు. అదే సమయంలో ఆరోగ్యకరమైన ఆహారం తీసుకునేవారిలో రుతుచక్రం ఆలస్యం అవుతుందని వెల్లడించారు. ఇందుకోసం 9 నుంచి 14 ఏళ్ల మధ్యలో ఉన్న 7,500 మంది బాలికలను పరిశోధకులు ఎంచుకున్నారు. వారి ఆహారపు అలవాట్లను నిశితంగా గమనించడంతోపాటు ఏ వయసులో రుతుచక్రం ప్రారంభమైందో తెలుసుకున్నారు. ఆశ్చర్యకరంగా.. ప్రాసెస్ చేసిన స్నాక్స్, చక్కెర పానీయాలు వంటి అనారోగ్యకరమైన ఆహారాలను ఎక్కువగా తీసుకునే అమ్మాయిల్లో 15 శాతం మందికి సగటు కంటే ముందుగానే రుతుచక్రం ప్రారంభమైందని గుర్తించారు.
అదే సమయంలో.. ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లను పాటించే అమ్మాయిలకు.. రుతుస్రావం ప్రారంభమయ్యే అవకాశం 16 శాతం తక్కువగా ఉందని పరిశోధకులు కనుగొన్నారు. ఇలా ఆడపిల్లలు చిన్న వయసులోనే రజస్వల కావడానికి ప్రధాన కారణం.. ఊబకాయమేనట! అధిక బరువు వల్ల శరీరంలో ఇన్సులిన్ పరిమాణం పెరుగుతుంది. ఇది ఈస్ట్రోజెన్ హార్మోన్ స్థాయిని పెంచుతుంది. దాంతో, అమ్మాయిల శరీరంలో అనేక మార్పులతోపాటు పీరియడ్స్ కూడా ప్రారంభం అవుతాయి. అందుకే, జంక్‌ఫుడ్ ఎక్కువగా తినే అమ్మాయిలు.. త్వరగా రుతుచక్రానికి దగ్గరవుతున్నారని పరిశోధకులు వెల్లడిస్తున్నారు. ఇలా చిన్న వయసులోనే రుతుస్రావం కావడం వల్ల దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలు వచ్చే ప్రమాదం ఉన్నదని వారు హెచ్చరిస్తున్నారు. మధుమేహం, ఊబకాయం, గుండె సంబంధ వ్యాధులతోపాటు రొమ్ము క్యాన్సర్ కూడా వచ్చే ప్రమాదం పెరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.