రోగ నిరోధక టీకాను ‘వ్యాక్సిన్’ అంటారు. వీటిని నోటి ద్వారా గానీ ఇంజెక్షన్ రూపంలో గానీ ఇస్తారు. వ్యాక్సిన్ ఇచ్చిన కొంతకాలానికి వ్యాధి నిరోధక శక్తి సమకూరుతుంది. ఆతర్వాత, సాధారణంగా వ్యాధి లక్షణాలు కనిపించవు. టీకాలను బ్యాక్టీరియా, వైరస్ల నుంచి గానీ బ్యాక్టీరియా స్రవించే ‘టాక్సిన్’ నుంచి గానీ తయారు చేస్తారు.
సజీవ టీకాలు : ల్యాబ్‌లో కొన్ని ప్రత్యేక ప్రక్రియల ద్వారా.. జీవం ఉన్న సూక్ష్మ క్రిములలో రోగాన్ని కలిగించే శక్తిని తొలగించి, సజీవ టీకాలను ఉత్పత్తి చేస్తారు. సజీవ టీకాలు చాలా శక్తిమంతమైనవి. కారణం, ఇవి శరీరంలో ప్రత్యుత్పత్తి జరపడం వల్ల సూక్ష్మజీవుల సంఖ్య పెరగడమే. వీటిని ఒకసారి ఇస్తే సరిపోతుంది. ఉదాహరణకు వైరస్ నుంచి మీజిల్స్, బ్యాక్టీరియా నుంచి బీసీజీ టీకాలు.
నిర్జీవ టీకాలు : సూక్ష్మజీవులను ఉష్ణోగ్రతతో గానీ రసాయనాలతో గానీ చంపి తయారు చేస్తారు. ఇవి అంత శక్తిమంతమైనవి కావు. ఉదాహరణకు కలరా టీకా. ఇవి ఇచ్చిన తర్వాత వచ్చే సమస్యలు కూడా ఎక్కువే.
టాక్సాయిడ్ : డిఫ్తీరియా, టెటానస్ టీకాలను బ్యాక్టీరియా స్రవించిన టాక్సిన్ నుంచి తయారు చేస్తారు. అంతకు ముందే, కొన్ని ప్రత్యేక ప్రక్రియల ద్వారా విష లక్షణాలను నిర్మూలిస్తారు.
మిశ్రమ టీకాలు : ఒక్కో జబ్బుకు ఒక్కొక్క టీకా ఇవ్వాలంటే, పిల్లలు అనేకసార్లు ఆరోగ్య కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. దీనివల్ల ఖర్చు ఎక్కువ. సమయమూ వృథా. అంతేకాకుండా, ఒక్కొక్కటి ఒక్కోసారి ఇచ్చినట్లయితే, అన్ని డోసులూ పూర్తిగా ఇవ్వకముందే పిల్లలకు అంటు వ్యాధులు రావొచ్చు. కాబట్టి కొన్ని టీకాలలో 2 నుంచి 6 రకాలు కలిసి ఉంటాయి. ఉదాహరణకు బ్యాక్టీరియా మిశ్రమ టీకా డీపీటీ. ఇది మూడు వ్యాధుల నుంచి రక్షిస్తుంది. వీటిని విడివిడిగా ఇచ్చినప్పటి కంటే, మిశ్రమ రూపంలోనే బాగా పని చేస్తాయి. వైరస్ రకానికి చెందిన మిశ్రమ టీకాలకు ఉదాహరణ.. ఎంఎంఆర్. ఇది మూడు వ్యాధుల నుంచి రక్షిస్తుంది.
డీపీటీ, హెపటైటిస్-బి, హిబ్, ఐపీవీ టీకాలను కలిపి మిశ్రమ టీకాగా అభివృద్ధి పరిచారు. దీనివల్ల తొమ్మిదిసార్లు ఇంజెక్షన్లు చేయించే బదులు, మూడుసార్లు చేయిస్తే ఆరు వ్యాధుల నుంచి రక్షణ లభిస్తుంది. మిశ్రమ టీకాలు మిగతా టీకాల్లాగే పని చేస్తాయి. వీటివల్ల అదనంగా వచ్చే సమస్యలేమీ ఉండవు.
పాలీ సాకరైడ్ టీకాలు : దీన్ని బ్యాక్టీరియా ఉపరితలంపై ఉండే ఒక రకమైన చక్కెర పదార్థాల నుంచి తయారు చేస్తారు. ఉదాహరణకు హిబ్ టీకా, మెనింగోకాకల్ టీకా, న్యూమోకాకల్ టీకా.
రీ-కాంబినెంట్ టీకాలు : వీటిని జెనెటిక్ ఇంజినీరింగ్ ప్రక్రియ ద్వారా తయారు చేస్తారు. ఉదాహరణకు హెపటైటిస్-బి, టైఫాయిడ్ టీకా.
డాక్టర్ కర్రా రమేష్‌రెడ్డి
పిల్లల వైద్య నిపుణులు
Read Today's Latest Zindagi News and Telugu News
- Tags
-
Coronavirus
-
vaccine
RELATED ARTICLES
-
-
-