శరన్నవరాత్రులు అమ్మవారి పూజతో లోకం పునీతం అవుతుంది. అమ్మ వేడుకకు అంతిమఘట్టం విజయదశమి ఉత్సవం. పేరులోనే విజయాన్ని తురుముకున్న దసరా నాడు ప్రారంభించే సత్కార్యం నిర్విఘ్నంగా కొనసాగుతుందని పెద్దల మాట. విజయదశమి నాడు శమీ పూజ ప్రత్యేక ఘట్టం. పండుగ నాడు జమ్మి చెట్టును పూజించి, శమీ పత్రాలను బంగారంగా భావించి, పెద్దలకు ఇచ్చి ఆశీస్సులు అందుకుంటారు. శమీ వృక్షాన్ని కల్పతరువుగా, దేవతా వృక్షంగా భావిస్తారు. యజ్ఞయాగాది క్రతువుల కోసం జమ్మి కొమ్మలను రాపిడి చేసి అగ్ని పుట్టిస్తారు. జమ్మి చెట్టును గెలుపు వృక్షంగా చెబుతారు. అజ్ఞాతవాసానికి బయల్దేరే సమయంలో పాండవులు విజయదశమి రోజునే తమ ఆయుధాలను జమ్మి చెట్టు మీద దాచి వెళ్లారట. తిరిగి అదే విజయదశమి నాడు వారు జమ్మిచెట్టు రూపంలో ఉన్న అపరాజితా దేవిని పూజించి, తమ ఆయుధాలను తీసుకున్నారు. అలా అపరాజితాదేవి ఆశీస్సులు పొందిన పాండవులు కురుక్షేత్ర సంగ్రామంలో విజేతలుగా నిలిచారని నమ్ముతారు. రామునికి సైతం జమ్మిచెట్టు ప్రీతికరమైనదని చెబుతారు (రామస్య ప్రియదర్శనీ). జమ్మిచెట్టును శక్తి స్వరూపంగా భావిస్తారు. ఆ శక్తి అనుగ్రహంతో రాముడు.. రావణుడిని సంహరించాడని చెబుతారు. పురాణాల్లో ఇంతటి ప్రాధాన్యం ఉండటంతో జమ్మిచెట్టుకు ప్రత్యేకత ఏర్పడింది. దసరా రోజు శమీ వృక్షానికి ప్రదక్షిణలు చేస్తూ.. “శమీ శమయతే పాపం శమీ శత్రు వినాశనీ, అర్జునస్య ధనుర్ధారీ రామస్య ప్రియదర్శనీ” అనే శ్లోకాన్ని చదువుతారు. పూజ పూర్తయిన తర్వాత జమ్మి ఆకులను బంగారంలా భద్రంగా ఇళ్లకు తీసుకువెళ్తారు. వాటిని తమ పెద్దల చేతిలో ఉంచి వారి ఆశీర్వాదాన్ని తీసుకుంటారు. జమ్మి ఆకులకు ఉన్న ఆధ్యాత్మిక ప్రాధాన్యం రీత్యా అవి బంగారంతో సమానంగా భావిస్తారు. దీని వెనుక ఓ పురాణ కథ కూడా ప్రాచుర్యంలో ఉన్నది. కుబేరుడు ఒకనాడు రఘుమహారాజుకు భయపడి జమ్మిచెట్లున్న ప్రాంతంలోనే బంగారాన్ని కురిపించాడట! అలా జమ్మి ఆకులను బంగారంగా పిలుచుకుంటారు. జమ్మిని పూజించడం అంటే జీవితంలో సకల విజయాలనూ సాధించాలని కోరుకోవడమే!
ఎలాంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా జమ్మి బతుకుతుంది. నీటి లభ్యత తక్కువగా ఉన్నా.. పెరిగి పెద్దదవుతుంది. కష్టనష్టాలు ఎన్ని ఎదురైనా తట్టుకొని నిలబడాలని చెబుతుంది. పట్నవాసులకు అంతగా పరిచయం లేకపోవచ్చు గానీ, గ్రామీణులకు జమ్మి సుపరిచితమే. దీని కొమ్మలు, ఆకులు పశువులకు మేతగా ఉపయోగపడతాయి. దీని వేళ్లు భూసారాన్ని పట్టి ఉంచుతాయి. ఈ చెట్టులోని ప్రతిభాగంలోనూ ఔషధ గుణాలున్నాయి. దీని నుంచి వచ్చే గాలిని పీల్చినా, దీని చుట్టూ ప్రదక్షిణాలు చేసినా ఆరోగ్యం సమకూరుతుందని పెద్దల నమ్మకం.