వెదురు చికెన్, వెదురు బిర్యానీ గురించి వినే ఉంటారు. మరి వెదురు ఉప్పు గురించి ఎక్కడైనా చదివారా? కొరియాలో ఎక్కువగా వాడతారు దీన్ని. కాబట్టే, కొరియన్ సాల్ట్ అని పిలుస్తారు. ప్రపంచంలోని అత్యంత ఖరీదైన లవణాలలో ఇదొకటి. పావు కిలో ఎనిమిదివేల రూపాయల పైమాటే. వంటంతా అయ్యాక, చివరిగా ఫినిషింగ్ సాల్ట్‌గా వాడే వెదురు ఉప్పులో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. చర్మ, దంత సౌందర్యానికి వెదురు ఉప్పు ఉపకరిస్తుంది.
క్యాన్సర్‌ను నిరోధించే గుణాలూ ఉన్నాయంటారు. మూడేండ్ల వయసు కలిగిన వెదురును సేకరించి వాటిని సమానంగా కత్తిరించి అందులో సముద్రపు ఉప్పును నింపి బాగా కాలుస్తారు. ఈ క్రమంలో వెదురు నుంచి వెలువడిన ద్రవాలు ఉప్పుతో కలుస్తాయి. ఇది మొదటి దశ. ఇలా మొత్తం తొమ్మిది సార్లు చేస్తారు. దీంతో ఉప్పు ఉదారంగు స్ఫటిక రూపంలోకి మారుతుంది. ఆ రంగు కారణంగా దీన్ని ‘పర్పుల్ సాల్ట్’ అంటారు.