e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, September 21, 2021
Home జిందగీ సబ్బండ గోల్కొండ నజర్‌ బోనం!

సబ్బండ గోల్కొండ నజర్‌ బోనం!

బోనం ప్రకృతి పండుగ. పచ్చికుండ.. పచ్చటాకులు.. బెల్లంబువ్వతో తల్లిని మొక్కే వేడుక. ‘బోనం దీస్కో అమ్మా’ అని వేనోళ్ల కొలిచే సంబురం. ‘లోకం సల్లగుండాలె’ అని మనసార తలిచే వేదిక. బంజారి దర్వాజ కాడ వెలుగులు చిమ్మంగ.. పటేలమ్మ పాయసం వండంగ.. గజ్జెల పోతరాజు గావుకేక లేయంగ.. తోడొచ్చిన భక్తుల తొట్టెలలు ఊరేగంగ.. సబ్బండ గోల్కొండ కదలిరాంగ.. ఎల్లలోకాల దేవత ఎల్లమ్మకు నేడు నజర్‌ బోనం సమర్పిస్తున్నారు!

వన్నె తగ్గని బోనమిది. వందల యేండ్లనాడు ఎత్తుకున్న బోనం సంప్రదాయాన్ని తెలంగాణ సమాజం పడగొట్టకుండా కాపాడుకుంటున్నది. కాలం మారింది. తరాలు మారాయి. కానీ బోనం శోభ మాత్రం తగ్గలేదు. ఇంటింటికీ.. తాపతాపకూ తళతళ మెరుస్తూ బంగారు బోనమై మన బతుకుల్లో భద్రంగా ఉండిపోయింది. గోల్కొండ కోటలో నాడు తొలిబోనంగా ఎక్కిన సబ్బండ వర్ణాల నజర్‌ బోనం.. నేడూ అంగరంగ వైభవంగా ఆషాఢ వేడుకలకు శ్రీకారం చుడుతున్నది.

- Advertisement -

తొమ్మిది బోనాలు
ఆషాఢ బోనాలు షురువయ్యాయి. నేడు గోల్కొండ కోటపైనున్న జగదాంబికా ఎల్లమ్మకు తొలి బోనం సమర్పించడంతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. గోల్కొండలో ఎల్లమ్మ తల్లికి బోనం సమర్పణ తర్వాత వరుసగా లష్కర్‌, లాల్‌ దర్వాజ బోనాలు ఉంటాయి. వీటి తర్వాత తెలంగాణలోని ప్రతీ పల్ల్లే బోనాల ఉత్సవాలతో మార్మోగుతుంది. గోల్కొండలో ఎక్కే తొలి బోనానికి, ఎల్లమ్మ గుడిలో వెలిగే తొలి దీపకాంతికి ఒక చారిత్రక నేపథ్యం ఉంది. జూలై 11 నుంచి ఆగస్టు 8 వరకు తొమ్మిది బోనాలు ప్రతీవారం గోల్కొండ కోటపై ఎక్కుతూనే ఉంటాయి. అఖండ జ్యోతి వెలుగుతూనే ఉంటుంది.

నజర్‌ బోనం
ఈ రోజు (జూలై 11)న అమ్మకు సమర్పించే బోనాన్ని ‘నజర్‌ బోనం’ అంటారు. అక్కన్న మాదన్నల కాలం నుంచే నజర్‌ బోనం తీసే సంప్రదాయం నడుస్తున్నది. మామూలుగా ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటప్పుడు దిష్టి తీస్తారు. బోనాల ఉత్సవాలు నిర్వహిద్దామని అక్కన్న మాదన్నలు తానీషాకు చెప్పినప్పుడు కూడా, ‘నజర్‌’ కార్యక్రమం నిర్వహించాల్సిందిగా ఆదేశించాడట సుల్తాన్‌. అప్పటినుంచీ గోల్కొండ జగదాంబికా అమ్మవారికి తొలి బోనంతో నజర్‌ తీస్తున్నారు. అందుకే ఈ రోజు ఒకే ఒక్క బోనం ఎక్కిస్తారు. నజర్‌ బోనం సమర్పించిన తర్వాత వచ్చే ప్రతీ ఆది, గురువారాల్లో ప్రజలంతా బోనమెక్కిస్తారు.

ఊరుమ్మడి ఉత్సవం
జగదాంబికా అమ్మవారికి సమర్పించే ఈ తొలి బోనం ఏ ఒక్కరో సమర్పించేది కాదు. ప్రజలకు, అమ్మవారికి సేవ చేసే సబ్బండ కులాల ఉమ్మడి బోనమిది. బోనం సమర్పణలో సమష్టి భాగస్వామ్యం ఉంటుంది. తలా ఒక పనిని పంచుకొని నజర్‌ బోనం ఎక్కిస్తారు. బ్రాహ్మణ, కుమ్మరి, కాపు, కమ్మరి, వడ్రంగి, స్వర్ణకారి, చాకలి, మంగలి, మస్కూరి, బైండ్ల, బ్యాగరి, నీరుడు, పంబ, దేవదాసి, దర్జీ వంటి కులవృత్తుల వాళ్లంతా కలిసి ఈ బోనం సమర్పిస్తారు. పండుగలు, ఉత్సవాలు ప్రజల ఐకమత్యం కోసమేనని చాటిచెప్పడంలో తెలంగాణ తొలి బోనమే ఆదర్శంగా నిలుస్తున్నది.

పటేలమ్మ నైవేద్యం
నజర్‌ బోనం ఉత్సవాల్లో భాగంగా కుమ్మరి ఒకరోజు ముందుగా కుండను తీసుకొచ్చి పటేలమ్మకు ఇస్తాడు. ‘పటేలమ్మ’ ఆచారం అక్కన్న మాదన్నల కాలం నుంచే వస్తున్నది. అక్కన్న మాదన్నలు కోటపై బోనం పెడదామని పాదుషాకు చెప్పినప్పుడు, గోల్కొండకు చెందిన మున్నూరు కాపు మహిళతో పరమాన్నం వండించి, బోనంగా సమర్పించారు కాబట్ట్టే, ‘పటేలమ్మ బోనం’ అన్న పేరు వచ్చిందని స్థానికులు చెప్తున్నారు. ప్రస్తుతం ‘లక్ష్మమ్మ పటేలమ్మ’ బోనానికి నైవేద్యం వండుతున్నారు. ఆ నైవేద్యాన్ని బోనం కుండలోకి పోసి, 25 మంది పోతరాజులతో నజర్‌ బోనం తీసుకొని ఊరేగింపుగా వెళ్తారు. బోనంతోపాటు కల్లు సాకకూడా తీసుకెళ్తారు.

మూడు ఊరేగింపులు
లంగర్‌హౌజ్‌ చౌరస్తానుంచి సాయిబాబ చారి, పటేలమ్మ, ఇతర కులవృత్తుల ప్రతినిధుల ఆధ్వర్యంలో 12 గంటలకు నజర్‌ బోనం ఊరేగింపు ప్రారంభమవుతుంది. ఇంకోవైపు దిగంబరరావు, అనంతాచారి ఇంట్లో అమ్మవారికి ఒడిబియ్యం పోస్తారు. అక్కడినుంచి దేవతా విగ్రహాలతో కోటపైకి ఊరేగింపుగా బయల్దేరుతారు. 12.30 గంటలకు చాకలి రాజు అమ్మవారిని పీటలపైకి ఎత్తుకొంటాడు. మంగలి సుధీర్‌ జ్యోతి దీపం పట్టుకొని వెళ్తాడు. ఈ మూడు ఊరేగింపులు గోల్కొండ చౌరస్తాలో కలుసుకుంటాయి. కోటలోకి ప్రవేశించాక గావుకేక పెడతారు. మొదటి మెట్టు దగ్గర శాంతికోసం యాట బలి ఇచ్చి, కోటపైనున్న ఆలయం వద్దకు వెళ్తారు. అక్కడ అమ్మవారికి బోనం, కల్లుసాక సమర్పిస్తారు. జగదాంబికా అమ్మవారికి పట్టువస్ర్తాలు, బోనం, తొట్టెల, ఒడిబియ్యం సమర్పించాక వాటిని అక్కడే పెడతారు. నజర్‌ బోనం ఎక్కినప్పటి నుంచి వారానికి రెండుసార్ల చొప్పున ప్రజలు తొమ్మిది బోనాలు తీస్తారు. బోనానికొక పూజచేసి అమ్మవారిని కొలుస్తారు. తొమ్మిది పూజలు అయిపోయిన తర్వాత, ఆగస్టు ఎనిమిదో తేదీన అమ్మవారికి సమర్పించిన బోనం కుండ, కలశం, దేవీ విగ్రహాలు కోటనుంచి తీసుకొస్తారు. సాయిబాబ చారి, పటేలమ్మ, కులవృత్తుల వార్లు బోనం కుండ తీసుకోగా, చాకలి రాజు అమ్మవారి పీటలను ఎత్తుకొని దిగంబరరావు, అనంతాచారి ఆధ్వర్యంలో విగ్రహాలను యథా స్థానంలో ప్రతిష్ఠిస్తారు. ఈ ఘట్టం ముగిసే నాటికి తెలంగాణలో ఆషాఢ బోనాలు పరిసమాప్తం అవుతాయి.

సమారోహణ
ఆషాఢ శుద్ధ పాడ్యమి రోజున మొదలైన గోల్కొండ జగదాంబికా మహంకాళి ఉత్సవాలతో.. రాష్ట్రవ్యాప్తంగా బోనాలకు శంఖారావం పూరిస్తారు. జూలై 11న నజర్‌ బోనంతో ఎల్లమ్మ ఆలయంలో మొదటి పూజ జరుగుతుంది. 15వ తేదీ గురువారం రెండో పూజ, 18న మూడో పూజ, 22న నాలుగో పూజ ఉంటాయి. ఆరోజు చండీహోమమూ నిర్వహిస్తారు. 25న ఐదో పూజ, 29న ఆరో పూజ చేస్తారు. ఇదేరోజు అమ్మవారికి శాకాంబరి పూజ చేస్తారు. ఆగస్టు 1న ఏడో పూజ ఉంటుంది. ఆ సాయంత్రం సేవా కార్యక్రమం నిర్వహిస్తారు. ఆగస్టు 5న ఎనిమిదో పూజ, 8న తొమ్మిదో పూజతోపాటు సమారోహణ కుంభ హారతితో బోనాలు ముగుస్తాయి.

ఎల్లలు దాటిన సంస్కృతి
బోనం అనాదిగా వస్తున్న సంప్రదాయం. పండగలు పల్లెలనుంచి పట్నానికి పాకుతాయి. కానీ, బోనం పట్నంలో పుట్టి పల్లెలకు విస్తరించింది. ఎంత టెక్నాలజీ పెరిగినా, మన ఆచార వ్యవహారాల్లో ఎన్ని మార్పులు వచ్చినా అమ్మకు బోనం సమర్పించడం ఆగలేదు. ఎల్లలు దాటి దేశదేశాన తెలంగాణ బోనం ఊరేగుతున్నది. అమీర్‌పేటనుంచి అట్లాంటా దాకా, కాచిగూడనుంచి కాలిఫోర్నియా దాకా, లాలాగూడనుంచి లండన్‌ దాకా ‘అమ్మా బైలెల్లినాదో’ అని ఆడిపాడుతున్నారు.

… దాయి శ్రీశైలం

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement
Namasthe Telangana