కొత్త విద్యలు నేర్చుకుని కోట్లు సంపాదించాలని కోరుకునే కాలమిది. కుల వృత్తి కాకున్నా నాటకం వారి కుటుంబ వృత్తి. బువ్వ పెట్టని నాటకాన్ని వదిలి ఆ కుటుంబం హోటల్ బిజినెస్‌లోకి మారిపోయింది. రంగు వెలిసిన నాటకాన్ని వదిలి తలో పని చూసుకుంటే.. ఆమె రంగస్థలాన్ని నమ్ముకుంది. నాటకాన్ని నిలబెట్టాలని ఇంకా ముఖానికి రంగేసుకుంటున్నది. సురభి వారసత్వాన్ని కొనసాగిస్తూ రాణి రుద్రమలా, సారలమ్మలా తెలంగాణ రంగస్థలంపై రణ నినాదం చేస్తున్నది వనారస హారిక! నాటక రంగంలో తనదైన శైలిలో రాణిస్తున్న హారిక అంతరంగం ఆమె మాటల్లోనే..
రంగస్థలం నా పుట్టినిల్లు. సురభి కుటుంబంలో పుట్టాను. మా వాళ్లందరూ రంగస్థల కళాకారులే! మా నాన్న రేకంద మురళీకృష్ణ నటుడు. అంతేకాదు రంగస్థల తెరలపై అద్భుతమైన దృశ్యాలను చిత్రించేవాడు. మేకప్ ఆర్టిస్ట్ కూడా. అమ్మ రమాలక్ష్మి కూడా సురభి కుటుంబంలోనే పుట్టి పెరిగింది. మంచి నటి. ఇద్దరు నటుల గారాల పట్టిగా పెరుగుతూనే రంగస్థలంపైకి వచ్చాను. నాకు మూడేండ్లు ఉన్నప్పుడే బాల నాగమ్మ నాటకంలో చిన్నారి నాగమ్మగా నటించాను. ఆ సంగతి మా అమ్మ చెబితే తెలిసింది. చిన్నతనంలోనే చాలా నాటకాల్లో వేషాలు వేశానట.ఆ సంగతులు నాకు మాత్రం లీలగా గుర్తున్నాయంతే!
అమ్మకు నేనే చెలికత్తె!
చిన్న వయసులో డైలాగులు కంఠస్థం చేయడం కష్టంగా ఉండేది. ‘మనకు చదువు, నాటకం.. రెండూ అవసరం’ అని మావాళ్లు చెప్పేవాళ్లు. పిల్లలందరిలా చదువుకుంటూ నాటకాలు వేసేదాన్ని. హైదరాబాద్ (వనస్థలిపురం)లో వినాయక నాట్యమండలి పేరుతో మా వాళ్లు నాటకాలు వేసేవాళ్లు. అమ్మకు రంగస్థల నటిగా మంచి పేరుంది. వేరే నాటక సంస్థలు కూడా అవకాశాలు ఇచ్చేవి. ఓసారి అమ్మ ‘ప్రహ్లాద’ నృత్య రూపక ప్రదర్శన కోసం నన్నూ తీసుకెళ్లింది. అమ్మ రంభగా, నేను ఊర్వశిగా నృత్యం చేశాం. అప్పటికి నా పదో తరగతి పూర్తయింది. ఆ నృత్యరూపకం ప్రదర్శనతో రమాలక్ష్మి కూతురు డ్యాన్స్ బాగా వేస్తుందనే పేరొచ్చింది. ఈ విషయం విని.. మిర్యాలగూడలోని నాటక సమాజంలో నటించేందుకు డైరెక్టర్ రామచందర్ రావు గారు అవకాశం ఇచ్చారు. అలా ‘ఉషా పరిణయం’లో అమ్మ ఉష పాత్ర పోషిస్తే నేను తనకు చెలికత్తెగా నటించాను.మా పెద్దనాన్న సురభి కొండలరావు గారు చిన్నప్పుడే నాకు సంగీతం, తాళ జ్ఞానం నేర్పించారు. వాయిస్ పెద్దగా రావడానికి కారణం ఆయనే. మా అమ్మ శాస్త్రీయ నృత్యం నేర్చుకోలేదు. రంగస్థలానికి కావల్సిన మేరకు నేర్చుకుంది. తన దగ్గరే నేను డ్యాన్స్ నేర్చుకున్నా. పాత్ర పోషణ, డైలాగ్ డిక్షన్ అన్నీ అమ్మే చెప్పింది.
మా ఆయనే నా హీరో
మా బంధువులబ్బాయి (సురభి ఫ్యామిలీ లోని) కార్తీక్‌తో నాకు పెండ్లి జరిగింది. మా అత్తగారి కుటుంబ నేపథ్యం కూడా రంగస్థలమే. కార్తీక్, నేను చిన్నప్పుడు కలిసి నాటకాలు వేసేవాళ్లం. ఆయన హీరో అయితే, నేను హీరోయిన్ అన్నమాట. పాతాళ భైరవిలో నేను ఇందుమతినైతే.. మా ఆయన తోట రాముడు. శ్రీనివాస కల్యాణం, ఘంటసాల, కత్తి కాంతారావు, ఎంఎస్ సుబ్బలక్ష్మి నాటకాల్లోనూ మేమిద్దరం జోడీగా నాయకానాయికలుగా నటించాం, మెప్పించాం. అలా నా పుట్టినిల్లు, మెట్టినిల్లు రెండూ రంగస్థలమే అయింది. పెండ్లి తర్వాత మా పెద్దనాన్న వాళ్లు నడిపే ‘సాయి సంతోషి నాట్య మండలి’లో నాటకాలు వేశాం. పిల్లలు కలిగిన తర్వాత నాలుగేండ్లపాటు రంగస్థలానికి దూరంగా ఉన్నాను.
బతుకు మారలే
కడుపునిండని కాలంలో మా వాళ్లు ముఖానికి రంగు వేసుకోవడం మానేశారు. రంగస్థలాన్ని వీడి హోటల్ రంగంలోకి మారిపోయాం. తిరుపతిలో హోటల్ పెట్టాం. కార్యస్థలం మారినా బతుకు మారలేదు. ఆ హోటల్ పెద్దగా నడవలేదు. అక్కడి నుంచి పెద్ద పెండ్యాలకు వచ్చాం. అక్కడా పెద్దగా నడవలేదు. పల్ల్లగుట్టకు వెళ్లాం. అక్కడా అంతే. ఈ హోటల్ అందరి ఆకలి తీర్చడమే కానీ, మా ఆకలి తీర్చదని గుర్తించడానికి చాలాకాలమే పట్టింది. తరాలుగా వచ్చిన వృత్తి అన్నం పెట్టలేదు. కొత్త ఆశలతో పెట్టుకున్న వృత్తీ మా కడుపు నింపలేదు. దాంతో ఆ హోటల్ మూసేశాం.
ఆ తృప్తి చాలు
మా మామగారు చనిపోయారు. మా ఆయన బతుకుదెరువు కోసం కంప్యూటర్ నేర్చుకున్నారు. డిజైనర్‌గా కొత్త కెరీర్ మొదలుపెట్టారు. ఆయన ఇల్లు నడుపుతున్నారు. ఆర్థిక పరిస్థితుల వల్ల ఆయన నటనకు పూర్తిగా దూరమయ్యారు. నాకు నటనంటే ఇష్టం. ఖాళీగా ఉండటం ఎందుకని మళ్లీ నాటకాల్లోకి వచ్చాను. ఖమ్మం, మిర్యాలగూడ, జడ్చర్ల, కర్నూలు, హైదరాబాద్‌లోని నాటక పరిషత్‌లు ప్రదర్శనకు పిలుస్తుంటాయి. వచ్చిన అవకాశాల్ని వదలుకోకుండా నటిస్తున్నాను. ఇందులో పెద్దగా ఆదాయం లేదు. కళాకారులకు ఆదాయం కన్నా.. ప్రేక్షకులను మెప్పించేలా పాత్ర పోషించామన్న తృప్తే ఎక్కువ విలువైనది.
నంది గెలుస్తా!
మాయాబజార్లో శశిరేఖ పాత్ర నాకు గుర్తింపు తెచ్చింది. ‘సమ్మక్క-సారలమ్మ’ జానపద నాటకంలో సమ్మక్క పాత్ర నాకు ఇష్టం. ఈ మధ్య రాణీ రుద్రమ నాటకంలో రుద్రమదేవి పాత్ర పోషించాను. నాకు బాగా సంతృప్తినిచ్చిన నాటకం ఇది. ఈ మూడు నాటకాలు ఇష్టంగా నటిస్తాను. చిన్నప్పటి నుంచి పెరిగిన సురభి కుటుంబ ప్రభావం వల్ల నాకు పద్య నాటకం ఇష్టం. అందుకే పౌరాణిక నాటకాల్లో ఉత్సాహంగా నటిస్తాను. సామాజిక నాటకాలు కొంచెం కష్టమే అనిపిస్తుంది. తిరుపతి, మిర్యాలగూడ, రావులపాలెంలో జరిగిన పరిషత్ నాటకోత్సవాల్లో ఉత్తమనటి అవార్డులు గెలుచుకున్నాను. నంది నాటకోత్సవాల్లోనూ ఉత్తమ నటి పురస్కారం గెలుచుకోవాలన్నదే నా కోరిక.
కుటుంబం మద్దతుతోనే..
కొత్త నాటకం ప్రదర్శించాలంటే పది నుంచి నెల రోజుల వర్క్‌షాప్ ఉంటుంది. ఒక ప్రదర్శన కోసం అన్ని రోజులు అక్కడ ఉండి నేర్చుకోవాల్సిందే. ఒక్కోసారి నెల రోజులు పడుతుంది. అప్పటికే ప్రదర్శించిన నాటకం అయితే రెండు రోజులు రిహార్సల్స్ చేస్తే సరిపోతుంది. ఎక్కడ నాటకాలు ఉన్నా, ఎన్ని రోజులు అక్కడ ఉండాల్సి వచ్చినా వెళ్లక తప్పదు. నా కుటుంబం మద్దతుతో నా ప్రస్థానం కొనసాగించగలుగుతున్నా. మా ఆయన నాటకాలు వేయడం మానేసినా, నాకు ఫుల్ సపోర్ట్‌గా ఉంటారు. ఏ పాత్ర వేస్తానన్నా వద్దనరు. నేను బయటికి వెళ్లిన రోజుల్లో పిల్లల బాధ్యత అంతా మా అత్తగారే చూసుకుంటారు.