Sunkari Ramadevi | వంటింట్లో పిల్లల కోసం చపాతీలు చేస్తుండగా.. ఎందుకో గోధుమపిండి రబ్బరులా సాగిపోయింది. తయారీదారులు అందులో ఏవో రసాయనాలు కలిపినట్టు ఆమెకు అర్థమైపోయింది. ఆ సంఘటనే సుంకరి రమాదేవిని శుద్ధమైన వంటింటిదినుసుల వ్యాపారం వైపు అడుగులు వేయించింది.
సుంకరి రమాదేవి ఒక సాధారణ గృహిణి. అలా అని కుటుంబమే ప్రపంచమని అనుకోలేదు. కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలబడింది. ఆ మంచితనంతోనే గ్రామ సర్పంచ్‌గా కూడా సేవలు అందించింది. భర్త ముకుందరెడ్డి ప్రభుత్వ ఉపాధ్యాయుడు. హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం గంటూరుపల్లి ఆ దంపతుల స్వగ్రామం. భర్తకు తరచూ బదిలీలు తప్పవు కాబట్టి, వ్యవసాయ బాధ్యతలనూ పిల్లల సంరక్షణను రమాదేవి భుజాన వేసుకున్నది. బిడ్డలు ప్రయోజకులు అయ్యారు. రమాదేవి కూడా పురుషులతో పోటీపడి సేద్యం చేస్తూ.. ‘అత్యుత్తమ మహిళా రైతు’ అవార్డు గెలుచుకున్నది.
ఓరోజు వంటింటి దినుసుల్లో రసాయనాల ఆనవాళ్లు రమాదేవిని కలవరానికి గురిచేశాయి. ఆ సంఘటన రసాయనాల జాడలేని స్వచ్ఛమైన వంటింటి వస్తువులను వినియోగదారులకు అందించాలన్న పట్టుదలకు కారణమైంది. వెంటనే పట్టణానికి మకాం మార్చిందామె. హనుమకొండలో శ్రీరామ ఆర్గానిక్ ఆయిల్స్ పేరిట వ్యాపారం మొదలుపెట్టింది. చెన్నై నుంచి గానుగ యంత్రాన్ని తెప్పించి అన్ని రకాల నూనెలను గానుగ పట్టి అమ్మడం ప్రారంభించింది. పప్పులను తనే స్వయంగా మర ఆడించేది. ఆ సమయంలోనే వరంగల్‌లోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా సంస్థ ఏడీఆర్ డాక్టర్ ఉమ్మారెడ్డిని సంప్రదించింది. పరిశోధనా కేంద్రం ఆవరణలోని దాల్ మిల్లును వినియోగించుకునేందుకు అనుమతి ఇచ్చారాయన. రమాదేవి దుకాణంలో అన్నిరకాల పప్పులు, పిండి, పసుపు, కారం, పచ్చజొన్న గడుక, క్వినోవా, రాగులు, సజ్జలు, అరికెలు, సామలు, అండుకొర్రలు, బ్లాక్ రైస్, రెడ్ రైస్, పుచ్చ, గుమ్మడి గింజలు తదితర వంటింటి దినుసులు అందుబాటులో ఉన్నాయి. ఇందులో చాలావరకూ తన ఆరెకరాల వ్యవసాయ భూమిలో ఆమె పండించినవే.
ప్రతి నిత్యం ఉదయాన్నే ద్విచక్ర వాహనంపై పన్నెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న స్వగ్రామానికి వెళ్లి వస్తుంది రమాదేవి. అక్కడ వ్యవసాయ పనులు పర్యవేక్షిస్తుంది. రైతుల నుంచి నాణ్యమైన దినుసులు కొనుగోలు చేస్తుంది. తిరిగి వచ్చి దుకాణం పనులు చూసుకుంటుంది. ఆమె దగ్గర అల్లం వెల్లుల్లి పేస్టు కూడా లభిస్తుంది. దానితో రుచికరంగా, ఆరోగ్యకరంగా ఎలా వండాలో కస్టమర్లకు నేర్పుతుంది. వరంగల్ నుంచి సుదూర ప్రాంతాలకు వెళ్లేవారు కూడా ఇక్కడే దినుసులు కొనుగోలు చేసి తీసుకెళ్తుంటారు. నూనెలు పట్టిన తర్వాత మిగిలిన గానుగ వ్యర్థాలను డెయిరీ ఫామ్‌లకు సరఫరా చేసి అదనపు ఆదాయం పొందుతున్నదామె. ‘నేను లాభాల కోసం ఇదంతా చేయడం లేదు. మార్కెట్లో రుచీపచీ లేని వంటింటి వస్తువులతో అనారోగ్యం బారిన పడుతున్నవారికి నాణ్యమైన, స్వచ్ఛమైన దినుసులను అందించాలనే ఉద్దేశంతోనే వ్యాపారాన్ని ప్రారంభించా’ అంటున్నది రమాదేవి.
– కొన్నె దేవేందర్ రెడ్డి
“Jyoti | ఒకప్పుడు రోడ్లపై భిక్షమెత్తుకుంది.. ఇప్పుడు ఓ కంపెనీకి మేనేజర్ అయ్యింది”
“Kanika Reddy | విమానయాన సంస్థకే సీఈవో అయిన ఈమె ఎంతోమంది మహిళలకు ఇన్స్పిరేషన్”
“Manasa Varanasi | ప్రపంచ సుందరి కాలేకపోయినా.. మనసు మాత్రం బంగారం”
“9999 మేకులపై 9 నిమిషాలు నాట్యం చేసిన లిఖిత.. ఎలా సాధ్యమైందంటే..”