‘మగరాయుడిలా మారిపోతున్నావ్!’ స్నేహితుల ఎగతాళి. ‘ఆడపిల్లవు నీకెందుకీ ఆటలు’ ఇరుగు పొరుగు మాటలు . ‘పెండ్లి చేసేస్తే సరి’ బంధుగణం గుణం బయటపెట్టుకుంది. ‘నిలువు.. గెలువు..’ అని భుజం తట్టేవాళ్లు లేని నైరాశ్యంలో.. పట్టుదలే ఆమె మనోబలమైంది. తల్లిదండ్రుల ప్రోత్సాహం ఆ పట్టుదలకు అసలు కారణం. ఎంతటి బరువైనా అలవోకగా ఎత్తేస్తూ… ఎన్నెన్నో పతకాలు సాధించింది లంబాడా బిడ్డ తేజావత్ సుకన్యాబాయి. తాజాగా ఏషియా పసిఫిక్ ఆఫ్రికన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 76 కేజీల విభాగంలో బంగారు పతకం సాధించి అదుర్స్ అనిపించుకుంది. అంతర్జాతీయ పోటీల్లో బంగారమై మెరిసిన ఈ సింగరేణి బిడ్డ అంతరంగమిది.
మహబూబాబాద్ జిల్లాలో ‘కలెక్టర్ తండా’ మా ఊరు. నాన్న తేజావత్ లక్ష్మణ్ సింగరేణి ఉద్యోగి. మణుగూరు ఓసీ2లో ఆపరేటర్‌గా పనిచేసేవాడు. అమ్మ పేరు సుభద్ర. ఇంటిపట్టునే ఉండేది. మేం ముగ్గురం ఆడపిల్లలం. మణుగూరులోనే పెరిగాం. అక్కడ హోలీ ఫ్యామిలీ స్కూల్లో చదివాం. నేను చదువుల్లో కాస్త వెనకుండేదాన్ని. అయినా అమ్మానాన్న బాగా చదవాలని ఎన్నడూ ఒత్తిడి చేయలేదు. మా స్కూల్లో వాలీబాల్, వెయిట్ లిఫ్టింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. పోటీలు ఉండేవి కావు. మణుగూరు సింగరేణి క్లబ్లో వెయిట్ లిఫ్టింగ్ ఉండేది. చాలామంది కసరత్తులు చేసేవాళ్లు. అక్కడ నేనూ ప్రాక్టీస్ చేసేదాన్ని. కొంతమంది రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనేవాళ్లు. నేనూ వాళ్లలా మెడల్స్ గెలవాలని ఆశపడేదాన్ని. 2000 సంవత్సరం సిడ్నీ ఒలింపిక్స్‌లో కరణం మల్లీశ్వరి కాంస్య పతకం గెలిచారు. అప్పుడు నేను పదో తరగతి చదువుతున్నాను. ఆమెలా వెయిట్ లిఫ్టింగ్ చాంపియన్ కావాలని ఆనాడే అనుకున్నా.
పదో తరగతి తర్వాత హైదరాబాద్ వచ్చాను. మాసబ్‌ట్యాంక్ పాలిటెక్నిక్ కాలేజ్‌లో డిప్లొమా (సివిల్ ఇంజినీరింగ్) చేరాను. అయితే చదువుపై ఆసక్తి లేక ఆటల్లోకి వచ్చాను. ఎప్పుడో ఒకసారి కాలేజీకి వెళ్లేదాన్ని. పొద్దున, సాయంత్రం ఎల్బీ స్టేడియంలో రన్నింగ్ ప్రాక్టీస్ చేసేదాన్ని. అక్కడ వెయిట్‌లిఫ్టింగ్ కోచ్ వీఎన్ రాజశేఖర్ కనిపించారు. ఆయన్ను కలుసుకొని నేను ఏ ఆటలో రాణించగలనో సలహా ఇవ్వమని అడిగాను.
‘నీ శరీరాకృతి వాలీబాల్, బ్యాడ్మింటన్, రెజ్లింగ్, బాక్సింగ్‌కు పనికిరాదు. వెయిట్ లిఫ్టింగ్‌కి బాగా నప్పుతుంద’న్నారు. శారీరక సౌందర్యం మీద ఆసక్తి ఉంటే.. వెయిట్ లిఫ్టింగ్‌కు సెట్ అవ్వదనీ అన్నారు. అందంగా ఉండాలన్న కోరిక నాకు లేదని చెప్పాను. వెయిట్ లిఫ్టింగ్ శిక్షణలో చేరతాను అనగానే ఇంట్లోవాళ్లు ఓకే చెప్పారు. ఏడాదిపాటు వెయిట్ లిఫ్టింగ్‌లో క్లీన్ అండ్ జర్క్ (మెడ నుంచి పైకి రాడ్‌ని ఎత్తడం), స్నాచ్ (కింద నుంచి పైకి ఒకేసారి లేపడం) టెక్నిక్‌లు నేర్చుకున్నాను.
ఫిట్నెస్, బాడీబిల్డింగ్… ఏడాదంతా ఇదే. మరుసటి ఏడాది 25 కిలోల వెయిట్‌తో ప్రాక్టీస్ మొదలుపెట్టాను. తర్వాత 30, 40 కిలోలు ఇలా బరువు పెంచుకుంటూ సాధన చేశాను. మరో ఏడాది తర్వాత ఎల్బీ స్టేడియంలో డిస్ట్రిక్ట్ వెయిట్ లిఫ్టింగ్ మీట్లో పోటీ పడే అవకాశం వచ్చింది. 56 కేజీల కేటగిరీలో ఫస్ట్ వచ్చాను. అదే నా మొదటి విజయం! రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యాను. ఖమ్మంలో రాష్ట్ర స్థాయి జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీ-2013లో గోల్డ్ మెడల్ వచ్చింది. హిమాచల్‌ప్రదేశ్‌లో జరిగిన నేషనల్ జూనియర్ వెయిట్ లిఫ్టింగ్‌లో నాలుగోస్థానం వచ్చింది. తర్వాత సీరియస్‌గా ప్రాక్టీస్ మొదలుపెట్టాను. మరుసటి ఏడాది విజయవాడలో జాతీయ స్థాయి జూనియర్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో బంగారు పతకం సాధించాను.

రెండు రాష్ర్టాలు విడిపోయాయి. మా కోచ్ ఆంధ్రప్రదేశ్‌కి వెళ్లిపోయాడు. అప్పటికే డిప్లొమా అయిపోయింది. ఒక సబ్జెక్ట్ బ్యాక్లాగ్ ఉంది. చదువు సాగిపోవాలంటే జాతీయ స్థాయి పోటీలు వదులుకోవాలి. అందుకని డిస్టెన్స్‌లో మళ్లీ ఇంటర్లో చేరాను. తర్వాత ఇగ్నో నుంచి బీఏ పూర్తిచేశాను. ఇంట్లో పెండ్లి చేసుకోమని అనేవాళ్లు. నాకు మంచి అవకాశాలు వస్తున్నాయి. పతకం వస్తే మంచి జాబ్ వస్తుందని, కొన్ని రోజులు ఆగాలని చెప్తూ వచ్చాను.
కోచ్ రాజశేఖర్ సర్ అంతర్జాతీయ క్రీడాకారుడు. నా సామర్థ్యం గురించి ఆయనకు అవగాహన ఉంది. ఆయన దగ్గరే ప్రాక్టీస్ చేయాలనుకున్నాను. ఏపీలో ఉన్న శాప్‌లో చేరడానికి నాకు అర్హత లేదు. కాబట్టి ఆ సర్ నడుపుతున్న ప్రైవేట్ అకాడమీలో చేరాను. అక్కడ ప్రాక్టీస్ చేస్తూ తెలంగాణలో జరిగే జిల్లా, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నాను. 2017లో జర్మనీలో జరిగిన ఇంటర్నేషనల్ సీనియర్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ పోటీల్లో పాల్గొన్నాను. అందులో నాకు ఆరో స్థానం వచ్చింది.
వెంటనే… ఖేలో ఇండియా గేమ్స్, ఆల్ ఇండియా యూనివర్సిటీ గేమ్స్, నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ ఛాంపియన్షిప్ ఈవెంట్స్ ఆడాను. కానీ, విజేతలందరికీ జయజయధ్వానాలు పలకరని అప్పుడే తెలిసింది. తెలిసినవాళ్లు ‘ఈ వెయిట్ లిఫ్టింగ్ వల్ల నీకు ఏమొస్తుంది? నువ్వు మగరాయుడు లాగా మారిపోయావ్!’ అని నానా మాటలన్నారు. మరోవైపు పెండ్లి ముచ్చట మళ్లీ ముందుకు తెచ్చారు. మానసికంగా బాగా కుంగిపోయాను.
ఇప్పుడు వెయిట్ లిఫ్టింగ్, పవర్ లిఫ్టింగ్ పోటీల్లో పతకాలు గెలుస్తున్నాను. లెక్కలేనన్ని పతకాలు గెలిచాను. ఆస్ట్రియాలో 2023లో జరిగిన ఇంటర్నేషనల్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో ఏడో స్థానం వచ్చింది. ఈ నెల దక్షిణాఫ్రికాలో జరిగిన ఏషియా పసిఫిక్ ఆఫ్రికన్ పవర్ లిఫ్టింగ్ ఛాంపియన్‌షిప్‌లో 76 కేజీల విభాగంలో బంగారు పతకం గెలిచాను.
పట్టిందల్లా బంగారం అన్నట్టుగా ఉంది నా కెరీర్. మా అమ్మానాన్న ఇప్పుడు గర్వపడుతున్నారు. ఒకప్పుడు ఈ ఆటలొద్దు అన్నవాళ్లే ఇప్పుడు పొద్దునే నాలుగు గంటలకు ఫోన్ చేసి నిద్రలేపుతున్నారు. ప్రాక్టీస్‌కి వెళ్లావా? లేదా? అని అడుగుతున్నారు. నా వల్ల మా తండాల్లో వెయిట్ లిఫ్టింగ్ గురించి అందరికీ తెలిసింది. ఇన్నాళ్లూ వెయిట్ లిఫ్టింగ్ టెక్నిక్‌లు తెలుసుకుంటూ, సామర్థ్యం పెంచుకుంటూపోయాను. కొన్ని క్రీడలు చాలా ఖరీదయినవి. వెయిట్ లిఫ్టింగ్‌లో పేదోళ్లు ఉంటారు. వాళ్లకు అవకాశాలు కల్పిస్తే విజేతలుగా నిలుస్తారు. క్రీడాకారిణిగా రాణిస్తూనే నాలాంటి వాళ్లను పదిమందిని తయారుచేయాలన్నదే
నా లక్ష్యం.
జర్మనీ నుంచి వచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం తరపున శాట్ ఎండీ దినకర్ బాబు రూ.2 లక్షలు ఇచ్చారు. ఆ డబ్బుతో కొన్ని నెలలకు డైట్, సప్లిమెంట్స్ అవసరాలు తీరాయి. అప్పటికే నాన్న ఇద్దరు సిస్టర్స్‌కి పెండ్లి చేశాడు. అప్పులయ్యాయి. అయినా నా ఖర్చుల కోసం నెలకు రూ.18 వేలు పంపేవాడు. నా ప్రాక్టీస్‌ను ఆయన ఎన్నడూ భారంగా భావించలేదు. కానీ, బంధువులు నాన్నకు ఫోన్ చేసి పెండ్లి చేసేయమని చెప్పేవారు.
నేను ఫోన్ చేసి అమ్మావాళ్లకు నచ్చజెబుతూ ఉండేదాన్ని. కొన్నాళ్లకు వారానికి ఒకసారి అమ్మనాన్నతో మాట్లాడి ఫోన్ స్విచ్చాఫ్ చేసేదాన్ని. నా సంగతులేం తెలియకపోవడంతో ఈ పిల్ల ఎటో లేచిపోయిందని అనుకున్నారు కొందరు. గెలుపుతోనే వాళ్లకు సమాధానం చెప్పాలని నిశ్చయించుకున్నా. 2018లో స్పెయిన్‌లో జరిగిన ఇంటర్నేషనల్స్ వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో వెండి పతకం సాధించి నాపై అవాకులు చెవాకులు పేలిన వారికి సమాధానం చెప్పా.
– నాగవర్ధన్ రాయల
– కేశమౌని మహేశ్‌గౌడ్