నిజాం ఆజ్ఞలు ధిక్కరిస్తూ… 1947 ఆగస్టు 7న హైదరాబాద్ నగరంలో స్వాతంత్య్రం కావాలని దీక్ష జరుగుతున్నది. నిరసనకు దిగిన మహామహులను పోలీసులు అరెస్ట్ చేసిండ్రు. వాళ్లల్ల ఉన్న ఓ పదహారేళ్ల పిల్లగాడిని చూసి జడ్జి ఆశ్చర్యపోయిండు. జాలి చూపి.. క్షమాపణ కోరితే ఇంటికి పంపిస్తనన్నడు. జైలుకైనా పోత.. కానీ, క్షమాపణ అడిగేది లేదన్నడు ఆ పిల్లగాడు బెబ్బులి పులిలా! అన్నట్టే జైలుకు పోయిండు. తుపాకీ పట్టిండు. మళ్లీ జైలుకు పోయిండు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత నిజాయతీగా బతకడమే నిజమైన దేశసేవ అనుకున్నడు. ఆ అబ్బాయి ఎవరో కాదు. తెలుగు అకాడమీ కొండలరావుగా పేరుపడ్డ వెలిచాల కొండలరావు! ఈ స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ సమరయోధుడి అంతరంగం ఆయన మాటల్లోనే..
ఓసారి జన్నారం దగ్గర బస్సు ఎక్కనీకి పోయిన. అక్కడున్న పోలీస్ ఇన్స్పెక్టర్ నా దగ్గరకొచ్చి ‘ఎవరు నువ్వు? ఎందుకొచ్చినవ్?’ అనడిగిండు. ఎవడు చూస్తడులే అనుకొని ఉత్తరాలు జేబులనే పెట్టుకున్న. ఆ ఉత్తరాలు తీస్కోని చదివిండు. ‘ఓహో! నువ్వు లీడర్ వేనా! రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవా?’ అంటూ అరెస్ట్ చేసిండు. ఆరు నెలలు అసిఫాబాద్ జైల్లో ఉన్న. ఆపరేషన్ పోలోకి కొద్ది రోజుల ముందు నన్ను వదిలిపెట్టిండ్రు.
నాకు రాజకీయాలు ఎంత ఇష్టమో సాహిత్యం అంతే ఇష్టం. ఇంటర్ చదివే రోజుల్లోనే గొప్ప సాహితీవేత్తలతో పరిచయాలు ఉండేవి. ఇంటర్ కాలేజీకి దేవులపల్లి కృష్ణశాస్త్రిని, విశ్వనాథను తీసుకువచ్చి మాట్లాడించాను. విశ్వనాథ సాహిత్యాన్ని అనువదించాను. ఉస్మానియాలో బీకామ్ చదివేప్పుడు రామ్ మనోహర్ లోహియాతో సీ హాస్టల్ మీటింగ్‌లో మాట్లాడించాను. ఆయన ప్రధాని నెహ్రూకి విరోధి. కాబట్టి వద్దని వీసీ బెదిరించినా సభ నిర్వహించా.
మా నాన్న వెలిచాల కేశవరావు స్వాతంత్య్ర సమరయోధుడు. మాది కరీంనగర్ జిల్లా, రామడుగు దగ్గర గుండి అనే ఊరు. నాన్న జాతీయోద్యమం, సహకార ఉద్యమంల పనిచేసిండు. కాంగ్రెస్ పార్టీ హైదరాబాద్ స్టేట్‌కి కార్యదర్శిగానూ పనిచేసిండు. మా నాన్న రచయిత. మా ఇంటికి ఆంధ్రపత్రిక, ఆంధ్రప్రభ, కృష్ణా పత్రికలు వస్తుండె! మాతోని పుస్తకాలు బాగా చదివిస్తుండె. వివేకానందుడు, అరవింద్ ఘోష్, సిస్టర్ నివేదిత, చలం రచనలు చదివిన. పత్రికలు, పుస్తకాలతో ప్రభావితమైన.
హైదరాబాద్ (నానల్ నగర్)లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఒక మీటింగ్ జరిగింది. దానికి జవహర్లాల్ నెహ్రూ వచ్చిండు. ఆ మీటింగ్‌కి మా నాన్న నన్ను తీస్కపోయిండు. నెహ్రూకి హైదరాబాద్ స్టేట్ల అదే ఫస్ట్ మీటింగ్. ఆయన ప్రసంగాన్ని కేవీ నరసింహారావు అనువాదం చేసిండు. స్వాతంత్య్రం ఎందుకు అవసరం. స్వాతంత్య్రం కోసం ఎంతగా పోరాడుతున్నాం. అయినా ఎందుకు రావట్లేదు? ఏం చేస్తే వస్తుంది? స్వాతంత్య్రం వస్తే… ఆర్థికంగా, విద్యాపరంగా, సాంస్కృతికంగా కలిగే ప్రయోజనాలు నెహ్రూ చెప్పిండు. ‘హైదరాబాద్ రాజ్యంలోని ప్రజలకూ స్వాతంత్య్రం కావాలె. భారత దేశానికి స్వాతంత్య్రం వస్తే, మీకూ వస్తది. మీరూ పోరాడాలె’ అని నెహ్రూ పిలుపునిచ్చిండు. అప్పుడు నాకు పదహారేళ్లు. ఆ రోజున నేను దేశం కోసం పనిచేయాల్నని డిసైడ్ అయిన.
హైస్కూల్ చదువు కోసం కరీంనగర్ పోయిన. ఏడు, ఎనిమిది అక్కడే చదివిన. సి.నారాయణరెడ్డి నేను క్లాస్మేట్స్. ఇద్దరం ఒకే బెంచ్ మీద కూర్చునేటోళ్లం. సోషలిస్ట్ నాయకుడు గౌతం రావు, పీవీ నరసింహారావు నాకు సీనియర్లు. గౌతం రావుకు లోహియాకు సోషలిస్ట్ భావాలు ఉంటుండె. ఆయన వల్ల నేనూ కాంగ్రెస్‌లో సోషలిస్ట్ గ్రూపులో తిరుగుతుండె. అప్పుడు ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఉండేది. ఇందులో కమ్యూనిస్ట్, సోషలిస్ట్ భావాలున్నవాళ్లు ఎక్కువ సంఖ్యలో ఉండేటోళ్లు. నాకు ఆ సంస్థతో సంబంధాలు ఏర్పడినయ్.
ఆ రోజుల్లో… ప్రతి పాఠశాలలో నిజాం రాజుని కీర్తిస్తూ ‘తాబద్ ఖాలహ్ హాలమ్’ పాడేటోళ్లు. ‘మా రాజు గొప్పోడు. దయామయుడు. రాజ్యం ఎల్లకాలం వర్ధిల్లాలె. ఆయన కీర్తి కలకాలం వర్ధిల్లాలె. రాజు ఆరోగ్యంగా ఉండాలె’ అని దేవుణ్ని ప్రార్థించేటోళ్లు. నేను ఎనిమిదో తరగతి చదివేటప్పుడు… అందరూ తాబద్ ఖాలహ్ హాలమ్ పాడుతుంటే నేను వందేమాతరం అని ఎలుగెత్తి పాడిన. అందరూ నా వైపే చూసిండ్రు. ఆశ్చర్యపోయిండ్రు. ఓ టీచర్ నన్ను హెడ్ మాస్టర్ దగ్గరకు తీస్కపోయిండు. ‘సార్ ఈ పిల్లగాడు వందేమాతరం పాడిండ’ని చెప్పిండు. నన్ను బడి నుంచి బహిష్కరించిండ్రు.
కాంగ్రెస్ పార్టీ వాళ్లు నన్ను హైదరాబాద్‌కు పోయి చదువుకోమన్నరు. అక్కడ ఉండే ఏర్పాట్లు వాళ్లే చూసుకున్నరు. అప్పుడు ఆల్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఆఫీస్ సుల్తాన్ బజార్ల ఉంటుండె. నేను ఆఫీస్ సెక్రటరీగా పని చేసుకుంట.. కేశవ మెమోరియల్ స్కూల్ల చదువుకున్న. పదో తరగతి అయిపోయినంక వివేకవర్ధిని విద్యాలయంల ఇంటర్మీడియెట్ల చేరిన. రెడ్డి హాస్టల్ ఉంటుండె. అక్కడున్న విద్యార్థుల్లో చాలామంది రాజకీయాల్లో తిరిగేది. రామచంద్రారెడ్డి, బాగారెడ్డి, రామిరెడ్డి అప్పుడు అక్కడే ఉన్నరు. వివేకవర్ధిని విద్యాలయం విద్యార్థి సంఘానికి లీడర్‌గా ఎన్నికైన. 1947 ఆగస్టు 7న డాక్టర్ మెల్కొటే సారథ్యంల పుత్లీబౌలిల సత్యాగ్రహం జరిగింది. యాభై మంది పాల్గొన్నరు. అందుల నేనూ ఉన్న. పోలీసోల్లు అరెస్ట్ చేసి, తీస్కపోయిండ్రు. అప్పుడు నాకు పదహారేండ్లు. మున్సిఫ్ మెజిస్ట్రేట్ ముందు నిలబెట్టిండ్రు. జడ్జి ‘క్యాకర్తే తుమ్ (ఏం చేస్తవ్)’అన్నడు. నేను ‘మై యే కర్తూ (ఇదే చేస్తా)’ అన్న. నా జవాబుకు జడ్జి ఆశ్చర్యపోయిండు. ‘చిన్నపిల్లవాడివి. కాబట్టి, క్షమాపణ చెబితే ఇడిసిపెడ్తా’ అన్నడు. ‘జైలుకైనా పోతగని.. క్షమాపణ చెప్పా’ అన్న. జడ్జి ఎగాదిగా చూసిండు. వారం రోజులు చంచల్‌గూడ జైలులో ఉన్న.
ఇండియాకి స్వాతంత్య్రం వచ్చింది. నిజాం రాజ్యం భారతదేశంల చేరాల్నని కొంతమంది, నిజాం నుంచి స్వాతంత్య్రం కావాల్నని ఇంకొంతమంది కొట్లాడుతున్నరు. హైదరాబాద్ ఇండియన్ యూనియన్ల విలీనం కావాల్నని ఉద్యమం చేసేటోళ్లని పట్టుకుంటున్నరు. జైళ్లల్ల పెడుతున్నరు. నిజాం రాజ్యానికి బయట నాలుగు క్యాంపులు పెట్టిండ్రు. నేను విజయవాడ క్యాంపు పోయిన. అక్కడ అయ్యదేవర కాళేశ్వరరావు బిల్డింగ్‌లో యాభై మంది దాకా ఉంటుండె. వారిలో ఖమ్మం, వరంగల్ నాయకులు చానామంది ఉన్నరు. జమలాపురం కేశవరావు, బొమ్మకంటి, హయగ్రీవాచారి, వీబీ రాజు, ఎస్బీ గిరి లాంటి వాళ్లతో పరిచయం కలిగింది. నాలుగు నెలలు చీరాల, వేటపాలం తిరిగిన.
సోషలిస్టులు ఆయుధాలు పట్టి పోరాడేది. ఒకరోజు ఎర్రుపాలెం రైల్వే స్టేషన్ మీద దాడి చేయాలనుకున్నరు. ఒక టీమ్ బయలుదేరింది. ఆ సంగతి తెలిసి నేను వస్తానని అడిగితె.. చిన్నవాడివి వద్దన్నరు. గట్టిగ ఏడ్చిన. సరే రమ్మని నన్నూ కలుపుకొన్నరు. ఎనిమిది మందిమి పోయినం. అందుల ఎస్బీ గిరి, మేనన్ ఉన్నరు. నాకు పిస్టల్ ఇచ్చినరు. మేమంతా బార్డర్ల ఉన్న జయంతి అనే ఊరికి చేరుకున్నం. అర్ధరాత్రి బయలుదేరి ఎర్రుపాలెం స్టేషన్‌పై దాడి చేసినం. మేం తుపాకులతో కాల్పులు మొదలుపెట్టంగనె.. ‘సచ్చిపోతున్నం. దేవుడా కాపాడు’ అంటూ అరుపులు వినపడ్డయ్. కానీ, అటువైపు నుంచి కాల్పులు, ప్రతిఘటన లేకుండె. కొన్నాళ్లకు నాకు స్టెన్‌గన్ ఇచ్చి, ఇది సంచిల పెట్టుకోని చాందాలో ఉన్న క్యాంప్‌నకు పొమ్మన్నరు. విజయవాడల రైలెక్కిన. అప్పటికే కమ్యూనిస్టులు సాయుధ పోరాటం మొదలుపెట్టినరు. ఆ రైలులో ఒక కమ్యూనిస్ట్‌ని పోలీసులు కాల్చిండ్రు. తూటా దిగిన కాలు వేలాడుతున్నది. రక్తం పారుతున్నది. ఏడెనిమిది మంది పోలీసులు ఉన్నరు. ఆ రక్తం నా కంపార్ట్మెంట్లోకి వచ్చింది. నాకు భయమైతాంది. కాసేపు సోంచాయించుకుంట.. కింద మీద పడుకుంట ఉన్న. మధిర, కాజీపేట, బెల్లంపల్లి దాటుకుని చాందా చేరిన.
చాందా క్యాంప్‌ల కొన్ని రోజులు ఉన్న. విరాళాల కోసం అసిఫాబాద్ పోయిన. జన్నారం దగ్గర బస్సు ఎక్కనీకి పోయిన. అక్కడున్న పోలీస్ ఇన్స్పెక్టర్ నా దగ్గరకొచ్చి ‘ఎవరు నువ్వు? ఎందుకొచ్చినవ్?’ అనడిగిండు. ఎవడు చూస్తడులే అనుకొని ఉత్తరాలు జేబులనే పెట్టుకున్న. ఆ ఉత్తరాలు తీస్కోని చదివిండు. ‘ఓహో! నువ్వు లీడర్ వేనా! రాజ్యానికి వ్యతిరేకంగా పనిచేస్తున్నవా?’ అంటూ అరెస్ట్ చేసిండు. ఆరు నెలలు అసిఫాబాద్ జైల్లో ఉన్న. ఆపరేషన్ పోలోకి కొద్ది రోజుల ముందు నన్ను వదిలిపెట్టిండ్రు. దేశానికి స్వాతంత్య్రం వచ్చింది. నిజాం రాజ్యం ఇండియన్ యూనియన్ల కలిసింది. ఇగ దేశం కోసం పనిచేయడం అంటే నిజాయతీగా బతకడమే అనుకున్న. చదువు మీద దృష్టి పెట్టిన. ఉస్మానియాల బీకామ్, ఎమ్‌కామ్ చదివిన. లక్నోల లా చదివిన. కాలేజీ లెక్చరర్‌గా కెరీర్ మొదలుపెట్టిన. కరీంనగర్, జగిత్యాల, సిటీ కాలేజ్‌ల ఉద్యోగాలు చేసిన. తెలుగు అకాడమీ డైరెక్టర్‌గా పని చేసిన. ఏ కొలువు చేసినా దేశానికి సేవ చేస్తున్న అనే అనుకున్న. ఎంతోమందిని ప్రయోజకుల్ని చేసిన.
– నాగవర్ధన్ రాయల
– వీరగోని రజనీకాంత్గౌడ్