శీతాకాలం వచ్చేసింది. మంచుతెరలు కమ్మినప్పుడు వెచ్చగా ముసుగుపెట్టలేం కాబట్టి, స్వెటర్లో దూరిపోతాం. చలి కేవలం ఒంటికేనా గోటికి లేదా… అంటూ కొత్త ట్రెండు తెరమీదకి వచ్చింది. ‘స్వెటర్ నెయిల్ డిజైన్స్’, ‘క్రోచెట్ నెయిల్ ఆర్ట్’ పేరుతో వస్తున్న ఈ ఫ్యాషన్ గోళ్లకు చలి కోటు తొడిగేస్తుంది. అదేనండీ, ఆ డిజైన్లు అచ్చం స్వెటర్లానే కనిపిస్తాయన్నమాట. మనం వేసుకునే దుస్తులకు సరిపోయేలా నచ్చిన రంగుల్లో వీటిని డిజైన్ చేసుకోవచ్చు.

అల్లికల్ని గోరుకు అతికించి కుందన్లు, మెరుపులు, ఇతర డిజైన్ల అలంకరణలనూ చేరుస్తారిందులో. లేదా అల్లికల మోడల్ని నెయిల్ ఆర్ట్ వేసే రంగులతోనే తీసుకురావచ్చు. కాస్త క్లాసీ లుక్ కావాలనుకుంటే ఇంగ్లిష్ రంగులతో పాటు సహజ రంగుల్లో వీటిని ప్రయత్నించొచ్చు.

అదే నిండుగా ప్రత్యేకంగా కనిపించాలనుకుంటే క్రోచెట్ నెయిల్ డిజైన్స్ ఎంచుకోవచ్చు. రంగురంగుల దారాలతో నఖాకృతిలో రూపుదిద్దిన అల్లికల్ని జాగ్రత్తగా గోటి మీద అలంకరించడమే ఈ ట్రెండు. చలికాలానికి సరికొత్తగా స్వాగతం పలకాలంటే ఈ విభిన్నమైన ఫ్యాషన్ ట్రై చేయాల్సిందే!