‘విత్తనం చనిపోతూ… పంటను వాగ్దానం చేసింది’ అంటాడు కవి శివసాగర్. ‘పంటను కాపాడుతూ… విత్తన స్వావలంబనను వాగ్దానం చేస్తున్నాను’ అంటున్నది ఆదివాసీ మహిళా రైతు లహరీ బాయి! అందరూ బతుకుదెరువు కోసం సాగు చేస్తుంటే ఆమె దేశవాళీ విత్తనాలను కాపాడేందుకు సేద్యం చేస్తున్నది. విత్తన స్వావలంబనే ఆదివాసీ ఆహార సంస్కృతిని కాపాడుతుందని దేశీ విత్తనాల సేకరణ, సంరక్షణే ఆచరణగా ఎంచుకుంది. ఇంటినే విత్తన భాండా గారంగా మార్చింది. దేశీ రైతులకు ఆదర్శంగా నిలిచిన లహరీ బాయి… ‘మిల్లెట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా’ గౌరవం అందుకుంది.
కావాల్సిన పంటల కోసం విత్తనం అడిగితే లాభాలిచ్చే విత్తనం చేతికిస్తుంది మార్కెట్. ‘నీ లాభం నీది.. నా లాభం నాది’ అని వ్యాపారి అంటగట్టే విత్తనంతో సాగుబడి చేపడితే రైతుకు కావాల్సిన తిండి గింజలు దొరకవు. ‘లాభం కోసం పండించిన పంట తినడానికి పనికిరానప్పుడు మా ఆకలి తీర్చే గింజలు ఎవరిస్తారు? సంప్రదాయ పంటలు మాయమైతే అమ్మ చేతి వంటలు మర్చిపోవాల్సిందేనా?’ అని లహరీ బాయికి సందేహం వచ్చింది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని డిండౌరీ జిల్లా సిల్పిదీ ఆమె ఊరు. ‘బైగా’ ఆదివాసీ తెగకు చెందిన ఆమె… తమవాళ్లు చిరుధాన్యాల సాగును తగ్గించడం గమనించింది. వాటి సాగు పూర్తిగా ఆగిపోతే రేపు ఆ పంట కావాలంటే విత్తనాలే ఉండవనే భయం ఆమెను విత్తనాల సేకరణకు పురికొల్పింది. ‘శ్రీ అన్న’ పేరుతో బైగా ఆదివాసీలు సాగుచేస్తున్న చిరుధాన్యాల విత్తన సేకరణను పదేండ్ల క్రితం మొదలుపెట్టింది. సేకరించిన విత్తనాలను పెంపు చేసేందుకు తనకున్న మూడు ఎకరాల వ్యవసాయ భూమిని కార్యక్షేత్రంగా ఆమె ఎంచుకుంది.
చిరుధాన్యాలు అంతరించి పోకుండా కాపాడుకోవాలన్నది లహరీ బాయి లక్ష్యం. భవిష్యత్లో ఈ పంటల సాగు కోసం విత్తనాలు భద్రంగా ఉంచాలనుకుంది. తను ఉంటున్న రెండు గదుల ఇంటిలోనే ఒక గదిలో విత్తన బ్యాంక్ ఏర్పాటుచేసింది. దశాబ్ద కాలంలో జొన్నలు, సజ్జలు, రాగులు, కొర్రలు తదితర 16 రకాల దేశవాళీ పంటలకు సంబంధించిన 150 కంటే ఎక్కువ రకాల విత్తనాలు సేకరించింది. వాటిని సంరక్షించేందుకు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంది. చేతికొచ్చిన పంటను మొదట ఆరబెట్టిన తర్వాత మట్టి పాత్రల్లో నిల్వచేస్తుంది. పురుగు పట్టకుండా, తేమ చేరకుండా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఏ పాత్రలో ఏ విత్తనాలు భద్రపరిచిందీ, ఏ కాలానికి చెందినవీ తెలిసేలా ఆ మట్టి పాత్రలపై వివరంగా రాసి పెడుతుంది.
లహరీ బాయి లాభం కోసం ఈ విత్తన సేకరణ మొదలుపెట్టలేదు. విత్తన స్వావలంబన సాధించాలన్నది ఆమె కోరిక. తన పొలంలో తన కోసం కాకుండా తన ఇరుగుపొరుగు కోసం సాగు చేస్తున్నది. పండించిన దేశవాళీ విత్తనాలను ఇరుగుపొరుగు వారికి సాగు కోసం ఇస్తుంది. దేశవాళీ పంటలకు ప్రాణప్రదమైన ఈ విత్తనాలను సాగు చేసేందుకు ఆసక్తి చూపే రైతులకు ఉచితంగా ఇస్తుంది. తొలకరి చినుకులు పడ్డాక పోడు దున్నేందుకు సిద్ధమయ్యే రైతులు లహరీ బాయి దగ్గర విత్తనాలు తీసుకునేందుకు వస్తారు. క్షేత్రమెరిగి విత్తనం, పాత్రనెరిగి దానం అంటారు. అందుకే తాను రైతులకు కిలో విత్తనాలు ఇస్తే… పంట చేతికొచ్చిన తర్వాత కిలోన్నర విత్తనాలు తిరిగి ఇవ్వాలని నిబంధన పెడుతుంది. ఇలా విత్తనాల ఉద్యమంలో ఇతర రైతుల్ని భాగస్వాముల్ని చేసింది.
బైగాచక్ అటవీ ప్రాంతంలోని 25 ఆదివాసీ గూడేల్లో నివసిస్తున్న 350 మంది రైతులు చిరుధాన్యాలను సాగుచేసేందుకు సహకార సంఘాన్ని ఏర్పాటు చేసుకున్నారు. ఈ సంఘానికి లహరీ బాయి నాయకురాలు. ఆదివాసీ రైతులు ఏర్పాటు చేసుకున్న సహకార వ్యవస్థ చిరుధాన్యాల సాగుని చేపడుతున్నది. ఒక ఆదివాసీ గూడెం రైతులు కనీసం ఎనిమిది రకాల చిరుధాన్యాలను సాగు చేసేలా సహకార సమితి ప్రణాళిక రూపొందించింది. పంట చేతికి వచ్చిన తర్వాత సీడ్ బ్యాంక్ కోసం ప్రతి రైతూ కనీసం ఆరు కిలోల చిరుధాన్యాలను ఇవ్వాల్సి ఉంటుంది. వచ్చే వ్యవసాయ సీజన్లో మళ్లీ రైతులు తమకు కావాల్సిన విత్తనాలను ఈ సహకార సంఘం నుంచి పొందుతారు. లహరీ బాయి నుంచి స్ఫూర్తి పొందిన ఓ నలభై మంది ఆదివాసీ మహిళలు స్వచ్ఛందంగా ఇదే బాటపట్టారు. పప్పులు, నూనెగింజలు, కూరగాయల విత్తనాలను భద్రపరుస్తున్నారు. వాటినే సాగు చేయాలని నిశ్చయించుకున్నారు. లహరీ బాయి కృషిని గుర్తించిన భారత ప్రభుత్వం ఆమెను ‘మిల్లెట్ అంబాసిడర్ ఆఫ్ ఇండియా’గా నియమించింది. 28 ఏండ్ల వయసులో ఒక మారుమూల ఆటవీ ప్రాంతంలోని ఆదివాసీ మహిళకు దక్కిన అరుదైన గౌరవం ఇది. ఆదివాసీ ఆహార సంస్కృతిలో భాగమైన పంటల సాగు చేపడుతూ, విత్తన స్వావలంబన సాధించిన లహరీబాయి కృషిని దేశమే కాదు ప్రపంచ దేశాలు గుర్తించాయి. ఇండోర్లో జరిగిన జీ 20 దేశాల వ్యవసాయ కూటమి సమావేశానికి ఆమె ఆహ్వానం అందుకున్నది. ఆ సమావేశంలో వివిధ దేశాల నేతలే కాదు వ్యవసాయ శాస్త్రవేత్తలూ ఆమెను ప్రశంసించారు.
పాత పంటలు పండించగానే సరిపోదు. కొనేవాళ్లు ఉంటేనే ఆదివాసీ రైతుకు నాలుగు రూపాయలు దక్కుతాయి. పండించిన పంట ఉపయోగపడితేనే రేపటి పంటకు రైతు సిద్ధపడతాడు. బైగా ఆదివాసీలు పండించే చిరుధాన్యాలను వినియోగంలోకి తెచ్చేందుకూ ఓ ప్రణాళిక అమలు చేస్తున్నది లహరీబాయి. తన నానమ్మ సహకారంతో చిరుధాన్యాలతో ఒకప్పుడు ఆ తెగ ప్రజలు వండుకున్న వివిధ వంటకాల గురించి తెలుసుకున్నది. ఆ వంటకాలు వండటం నేర్చుకున్నది. నలుగురికి నేర్పి తమ ఆహార సంస్కృతిని నిలుపుకొన్నది. ఏ జాతి మనుగడ సాగించాలన్నా దాని భాష, సంస్కృతిని కాపాడుకోవాలి. ఆ వారసత్వం ఒక తరం నుంచి మరో తరానికి కొనసాగాలి. ప్రపంచీకరణ యుగంలో అన్ని జాతులూ ఎదుర్కొంటున్న ఈ సమస్యకు ఎంతోమంది ఎన్నో ప్రయోగాలు చేస్తున్నారు. లహరీబాయి చేపట్టిన విత్తన స్వావలంబన వాటిలో ఒకటి!