ఉన్నత కుటుంబంలోకి కోడలిగా వచ్చానన్న సంతోషం కన్నా.. కట్టుకున్నవాడు మద్యానికి బానిస అయ్యాడన్న బాధే ఆ ఇల్లాలిని వెంటాడింది. భర్త ఎప్పటికైనా మారకపోతాడా అన్న చిన్న హోప్‌తో ఐదేండ్లు కష్టనష్టాలు అనుభవించింది. తన నమ్మకం వమ్మయింది. ఆయన మందు వదల్లేదు. భర్తను వదిలేసి.. చంటిబిడ్డ సహా వెళ్లిపోయిందామె. కూతురు దూరమైన వేళ.. ఆయనలో మార్పు మొదలైంది. తనను పట్టి పీడిస్తున్న మద్యం పిశాచిని డీ అడిక్షన్ సెంటర్ బాట పట్టి వదలించుకున్నాడు. ఆయనలో మార్పుతో మళ్లీ వాళ్ల జీవితాల్లో ఓ హోప్ మొదలైంది. ఆ సంతోషం తమ కుటుంబానికే పరిమితం కావొద్దనుకున్నారు ఆ దంపతులు! మద్యం మత్తును, ఒత్తిడి చిత్తును జయించే సమాజ నిర్మాణమే ధ్యేయంగా ‘హోప్ ట్రస్ట్’ ప్రారంభించారు రాహుల్ లూథర్, రాజేశ్వరీ లూథర్. మద్యం బాధితులకు, మానసిక రోగులకు జీవితంపై నమ్మకం కలిగిస్తూ ముందుకుసాగుతున్నారు. నేడు ‘వరల్డ్ మెంటల్హెల్త్ డే’ సందర్భంగా హోప్ ట్రస్ట్ సహ వ్యవస్థాపకురాలు రాజేశ్వరీ లూథర్ ‘జిందగీ’తో ముచ్చటించారు..
మద్యపానం కూడా ఒక మానసిక రుగ్మతే అని నా భావన. మనసు బాగా లేకపోతే.. తాగుతుంటారు. మనసు మరీ సంతోషంగా ఉన్నా… తాగుతుంటారు! ఇలా మనసును అదుపాజ్ఞల్లో ఉంచుకోలేక మద్యం మత్తులో జోగుతున్నవారు ఎందరో ఉన్నారు. ఒకప్పుడు మా ఆయన కూడా మద్యం బానిసే! 1986లో తొలిసారి ఆయనతో పరిచయం అయింది. అప్పుడు నేను బెంగళూరులో హెల్త్ కోర్స్ చేస్తున్నాను. ఏదో ట్రీట్మెంట్ కోసం రాహుల్ అక్కడికి వచ్చాడు. అలా మా ఇద్దరికీ పరిచయం ఏర్పడింది. అప్పటికే ఆయనకు తాగే అలవాటు ఉంది. ఏదైనా ప్రత్యేక సందర్భాల్లో తాగుతారేమో అనుకున్నా! మా పరిచయం ప్రేమగా మారింది. నన్ను ఇష్టపడుతున్నట్లు మా ఇంట్లోవాళ్లకు చెప్పాడు రాహుల్. వాళ్ల ఇంట్లోనూ చెప్పి పెళ్లికి ఒప్పించాడు. రాహుల్ వాళ్ల నాన్న నరేంద్ర లూథర్ అప్పటికే సివిల్ సర్వెంట్‌గా మంచి పేరు సంపాదించారు. పెళ్లి ప్రస్తావన వచ్చినప్పుడు ఆయన నా దగ్గరికొచ్చి.. ‘మా వాడికి తాగుడు అలవాటు ఉంది. వాణ్ని పెళ్లి చేసుకొని నీ జీవితం పాడు చేసుకోకు’ అని చెప్పడం ఆయన గొప్పదనం అనిపించింది. ఆ మాటలు విన్న తర్వాత ఆ ఇంటికే కోడలిగా వెళ్లాలని గట్టిగా నిర్ణయించుకున్నా.
పెళ్లి తర్వాత రాహుల్ తాగుడు మానేస్తాడని భావించాను. కొన్నిసార్లు నచ్చజెప్పాను. అయినా ఆయనలో మార్పు రాలేదు. పిల్లలు అయితే.. మార్పు వస్తుందని కొందరన్నారు. నేనూ అలాగే ఆశపడ్డాను! రెండున్నరేండ్లకు పాప పుట్టింది. తర్వాత కూడా రాహుల్ మారలేదు. మద్యానికి మరింత బానిస అయ్యాడు. ఆయన్ను చూస్తే ఒక్కోసారి కోపం వచ్చేది. అదే సమయంలో మానసికంగా మరీ ఇంత బలహీనమా అని జాలీ కలిగేది. నేను పడుతున్న బాధ చూసి ‘ఇక వీడితో వేగలేవమ్మా! విడాకులు తీసుకొని హ్యాపీగా జీవించమ’ని మామగారే సూచించారు. ఆయన మాట కాదనలేక, నా బిడ్డ భవిష్యత్తు కోసం విడాకులు తీసుకున్నా! అప్పుడే అసలు కథ మొదలైంది. నేను, పాప దూరం కావడం వల్ల రాహుల్ మానసికంగా కుంగిపోయాడు. మమ్మల్ని తిరిగి పొందాలంటే మందు మానేయడం ఒక్కటే మార్గమని తెలుసుకున్నాడు. బెంగళూరులోని డీ అడిక్షన్ సెంటర్లో చేరాడు. అక్కడే ఉంటూ మద్యం ఉచ్చులోంచి బయటపడ్డాడు. అంతేకాదు, అందులోనే పనిచేయడం మొదలుపెట్టాడు. ఆయనలో వచ్చిన మార్పు నిజమని అర్థమైంది. తిరిగి ఐదేండ్ల తర్వాత ఇద్దరం మళ్లీ పెళ్లి చేసుకొని ఒక్కటయ్యాం.
తాగుడు నుంచి పూర్తిగా బయటపడిన రాహుల్ ఒకరోజు హైదరాబాద్‌లో డీ అడిక్షన్ సెంటర్ ఏర్పాటు చేద్దామా అని అడిగాడు. ఆ సమయంలో నాకు కలిగిన సంతోషం అంతా ఇంతా కాదు. తాగుడుకు బానిసై మానసికంగా దిగజారిపోతున్నవారిని ఆ మత్తు నుంచి బయటపడేయాలని 2002లో హైదరాబాద్‌లో ‘హోప్ ట్రస్ట్’ ఏర్పాటు చేశాం. బెంగళూరులోని డి అడిక్షన్ సెంటర్ కారణంగానే తండ్రి తనకు దగ్గరయ్యాడన్న నమ్మకంతో మా అమ్మాయి మేం ఏర్పాటు చేసిన ట్రస్ట్‌కు ‘హోప్’ అని నామకరణం చేసింది. మా ట్రస్ట్ ద్వారా మద్యం బాధితులకు కౌన్సెలింగ్, ట్రీట్మెంట్ ఇస్తూ ఎందరినో మార్చగలిగాం. ‘ట్రీట్మెంట్ తర్వాత తాగుడుకు దూరమవుతారా మేడం?’ అని బాధితులతో వచ్చినవాళ్లంతా అడుగుతుంటారు. తాగుడనేది బేతాళుని కథలాంటిది. ట్రీట్మెంట్ ద్వారా ఆ దురలవాటును ఎంత దూరం చేసినా.. మళ్ల్లీ ఎవరో గుర్తు చేయగానే మొదటికి వస్తారు. కేవలం చికిత్స ఇస్తే సరిపోదు. దాని నివారణ అనేది నిరంతర ప్రక్రియ. మా దగ్గరికి వచ్చేవారికి మేం అలాంటి చికిత్సా విధానాన్నే అనుసరిస్తాం. ఇక్కడికి వచ్చిన చాలామంది తాగుడును వదలించుకున్నవాళ్లే. తిరిగి వారిని కలిసినప్పుడు చాలా సంతోషమనిపిస్తుంది.
సాధారణంగా మానసికంగా దుర్బలంగా ఉన్నప్పుడే.. ఇలాంటి దురలవాట్లకు గురవుతుంటారు. సమస్య మూలాల్లోకి వెళ్లి అరికట్టడానికి ప్రణాళికలు చేశాం. అందులో భాగంగా కళాశాలలు, పాఠశాలలు, ఇతర టీవీ షోల్లో మత్తు వల్ల కలిగే అనర్థాలను వివరించాం. మొదట్లో డీ అడిక్షన్ సెంటర్ మాత్రమే నిర్వహించేవాళ్లం. కరోనా తర్వాత.. చాలామంది మానసిక ఒత్తిడితో బాధపడుతున్నారని భావించి మెంటల్ హెల్త్‌పై ఫోకస్ చేశాం. మానసిక ఒత్తిడికి గురవుతున్నవారికి కౌన్సెలింగ్‌లు ఇవ్వడం ప్రారంభించాం. ప్రస్తుత సమాజంలో చాలామంది మానసిక ఒత్తిడితో సతమతమవుతున్నారు. చిన్న చిన్న సమస్యలను కూడా తట్టుకోలేకపోతున్నారు. భార్యాభర్తలు, యువత, సెలబ్రెటీలు సైతం మెంటల్ హెల్త్ కావాలంటూ మమ్మల్ని సంప్రదిస్తుంటారు. అలాంటి వాళ్ల ఒత్తిడికి కారణాలు తెలుసుకొని కౌన్సెలింగ్ ఇస్తుంటాం. కానీ ఇప్పటివరకు చాలామంది మళ్లీ కౌన్సెలింగ్ కావాలంటూ రెండోసారి తిరిగి రాలేదు. ఇది మాకు ఎంతో సంతృప్తినిస్తుంది.
ఒకప్పుడు పాతికేండ్లు దాటిన యువకులే మద్యం తాగేవాళ్లు. ఇప్పుడు రోజులు మారాయి. టీనేజ్‌లోకి రాగానే.. మందుకు, డ్రగ్స్‌కు అలవాటుపడుతున్నారు. దీనికితోడు ఓటీటీ కంటెంట్ పిల్లలపై తీవ్ర దుష్ప్రభావం చూపుతున్నది. ఒక తరాన్నే నాశనం చేస్తున్నది. ఇలాంటి పరిస్థితుల్లో మత్తు పదార్థాలు, మానసిక ఆరోగ్యంపై మరింత అవగాహన అవసరం. మానసికంగా దృఢంగా ఉన్నవాళ్లు మత్తులో చిత్తవ్వరు అని నా నమ్మకం. ఒత్తిడి, మత్తు పదార్థాలకు దూరంగా ఉండే సమాజ నిర్మాణమే మా ‘హోప్’ లక్ష్యం.
కౌన్సెలింగ్ కోసం వచ్చే విద్యార్థులు, బస్తీవాసులకు ఉచితంగానే సేవలందిస్తున్నాం. మత్తు పదార్థాలకు వ్యతిరేకంగా కళాశాలల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. నశాముక్త్ భారత్‌లో భాగంగా కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నాం. చికిత్స కన్నా నివారణే మేలు అనే నినాదంతో గ్రామాలు, పట్టణాల్లో
అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం.
– రాజు పిల్లనగోయిన