Success Story | ఈ రోజు మహర్నవమి.. లోక కంటకుడైన మహిషాసురుణ్ని అమ్మ సంహరించిన పర్వం ఇది. వరాలు పొందిన మహిషుణ్ని తెగటార్చడం అంత తేలికైన విషయం కాదు! సర్వశక్తి సంపన్నురాలైనా.. దుష్ట సంహారం కోసం అమ్మవారు నవరాత్రులూ పోరాటం చేసింది. సమస్త దేవతల శక్తినీ తనలోకి తీసుకుంది. అంతిమంగా దుష్టశిక్షణ చేసింది. ధర్మాన్ని నిలబెట్టింది. లోకాలను సృజించిన విజయదుర్గ కథ ఇది. ఆమెకే అన్ని అవరోధాలు ఎదురైతే.. మానవ మాత్రుల మాటేమిటి? ఈ విజయలక్ష్మి ఎన్నో కలలు కన్నది. చక్కగా చదువు కోవాలనుకుంది. ప్రభుత్వ ఉద్యోగం సాధించాలనుకుంది. కానీ, పేదరికం మహిషుడి కన్నా గట్టిగా ఆమెను పట్టిపీడించింది. ఆ చిన్నారిని బడి బాట మాన్పించి.. ఇటుక బట్టీకి దారితీసేలా చేసింది. ఆ దేవికి సకల దేవతల శక్తి తోడైనట్టు.. ఈ విజయలక్ష్మికి ఓ అండ దొరికింది. పాఠాలు బోధించే ఉపాధ్యాయురాలు భరోసానిచ్చింది. ఆ టీచర్ ప్రోత్సాహంతో.. విజయలక్ష్మి కొత్త శక్తిని సంతరించుకుంది. అనుకున్న లక్ష్యం చేరుకుంది.
ఇది ఓ ‘పేదింటి బతుకమ్మ’ కథ. బాగా చదువుకొని జీవితంలో ఏదో సాధించాలన్నది ఆమె కల. ఆ స్వప్నానికి కుటుంబ పరిస్థితులు అడ్డుగా మారాయి. పేదరికం ఆమెను ఇటుకబట్టీలో బాల కార్మికురాలిని చేసింది. అయితేనేం నేనున్నానంటూ ఓ టీచరమ్మ భరోసా ఇచ్చింది. ఆమెను విజేతగా నిలిపింది. తాజాగా తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన డీఎస్సీ ఫలితాల్లో సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయినిగా ఎంపికై ‘విజయలక్ష్మి’ సగర్వంగా దరహాసం చేసింది. ప్రభుత్వ ఉద్యోగం పొందాలన్న తన లక్ష్యాన్ని ముద్దాడింది. తనపై టీచరమ్మకు ఉన్న నమ్మకాన్ని నిలబెట్టింది. ఇటుకబట్టీలో వికసించిన ఈ విజయలక్ష్మి గెలపు కథ ఇది..
మంచిర్యాల జిల్లా వేమనపల్లి మండలం నీల్వాయి సమీపంలో కేతనపల్లి విజయలక్ష్మి స్వగ్రామం. తండ్రి నాగయ్య, తన ఇద్దరు సోదరులు కూలి పనులకు వెళ్తే తప్ప పూటగడవని పరిస్థితి ఆ కుటుంబానిది. చదువంటే ఎంత ప్రాణమున్నా.. ఇల్లు గడవడం కోసం విజయలక్ష్మి ఇటుకబట్టీలో బాలకార్మికురాలిగా పనిచేసింది. వారంలో మూడు రోజులు బడికి, మరో మూడు రోజులు పనికి వెళ్తుండేది. ప్రాథమిక విద్యాభ్యాసం అంతా ఇలాగే కొనసాగించింది. తర్వాత నీల్వాయి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో చేరింది. అక్కడ కూడా ఇదే తంతు. విజయలక్ష్మి పాఠశాలకు గైర్హాజరవుతున్న విషయం గుర్తించిన ఇంగ్లిష్ టీచర్ రాచకొండ కళ్యాణి స్వయంగా ఆమె ఇంటికి వెళ్లింది. ఆ విద్యార్థిని సమస్యను అడిగి తెలుసుకుంది. ఆ కుటుంబం పరిస్థితులను చూసి చలించింది. ఉన్నతంగా చదువుకోవాలన్న శిష్యురాలికి అండగా నిలవాలనుకుంది. ‘మీ బిడ్డకు అండగా నేను ఉంటాను. ఆమెను రోజూ బడికి పంపాల’ని ఆ తల్లిదండ్రులను కోరింది. కళ్యాణి టీచర్ ప్రోత్సాహంతో విజయలక్ష్మి పదో తరగతిలో 9.5 జీపీఏతో ఉత్తీర్ణత సాధించింది. మంచి మార్కులతో పాసయ్యాననే సంతోషం ఓవైపు… ఇంటర్ చదవగలనో లేదో అని పేదరికం మాటున దాగిన భయం మరోవైపు ఈ చదువుల తల్లిని పట్టుకుంది.
విజయలక్ష్మిని ఇంటర్ కూడా చదివించేందుకు టీచర్ కళ్యాణి, ఆమె భర్త శ్యాంసుందర్ (సింగరేణిలో ఇంజినీర్) ముందుకు వచ్చారు. విజయలక్ష్మిని మంచిర్యాలలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చేర్పించారు. అక్కడే ఉండేలా వసతి ఏర్పాట్లు కూడా చేశారు. ఇక ఇంటర్ తర్వాత హైదరాబాదులో డీఈడీ శిక్షణ ఇప్పించి, పెద్దపల్లిలో ఉపాధ్యాయ శిక్షణ కళాశాలలో చేర్పించారు. ఆ తర్వాత 2018లో డీఎస్సీ కోసం ప్రయత్నించింది విజయలక్ష్మి. కొద్దిలో ఉద్యోగ అవకాశం చేజారింది. తర్వాత కొంతకాలం ఓ ఇటుకబట్టీలో పనిచేస్తూ దూరవిద్య ద్వారా డిగ్రీ పూర్తి చేసింది. ఇక గత ప్రభుత్వం నిర్వహించిన ఎస్సై, కానిస్టేబుల్ పరీక్షల కోసం సింగరేణి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శిక్షణ శిబిరంలో చేరింది. శారీరక పరీక్షలకు సిద్ధమవుతున్న సమయంలో కాలు బెణకడంతో పరీక్షకు దూరమైంది. తాజాగా డీఎస్సీ నోటిఫికేషన్ పడటంతోనే అహరహం శ్రమించింది. మంచి ర్యాంకుతో సెకండరీ గ్రేడ్ టీచర్‌గా ఉద్యోగం సాధించింది. ప్రభుత్వం నుంచి నియామక పత్రం అందుకుంది. ‘తనను వెన్నంటి ప్రోత్సహించిన అమ్మలాంటి కళ్యాణి టీచర్‌కు జీవితాంతం రుణపడి ఉంటాను’ అని చెప్పుకొచ్చింది విజయలక్ష్మి. మరోవైపు తన తల్లిదండ్రుల కష్టం తీర్చే అదృష్టం దక్కిందని సంబురపడింది.
విజయలక్ష్మి పేరుకు సార్థకత కట్టబెట్టిన టీచర్ కళ్యాణి మంచిర్యాల జిల్లాలోని హాజీపూర్ మండలం సబ్బేపల్లి జడ్పీహెచ్ఎస్లో ఇంగ్లిష్ ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నారు. ఆమె భర్త శ్యాంసుందర్ సింగరేణిలో ఇంజినీర్. వీరికి ఇద్దరు అమ్మాయిలు గ్రీష్మ, హాసిని. ఒకరు ఎంబీబీఎస్ పూర్తిచేయగా, మరొకరు ఉన్నత విధ్యాభ్యాసం చేస్తున్నారు. విజయలక్ష్మిని తన బిడ్డల్లాగే అక్కున చేర్చుకున్నారు ఆమె. సామాజిక స్పృహ కలిగిన కళ్యాణి ఎన్నో సేవా కార్యక్రమాల్లో పాలుపంచుకుంటూ ఉంటారు. తాను పనిచేసేచోట పిల్లలకు అండగా నిలవడం, పాఠశాలలకు అవసరమైన సామగ్రిని సమకూర్చడంలో ముందుంటారు. వివిధ సాంస్కృతిక కార్యక్రమాల వైపు పిల్లలను ప్రోత్సహిస్తుంటారు.
విజయలక్ష్మి చాలా బాగా చదువుతుంది. ఆమె తెలివితేటలకు పేదరికం అడ్డుగోడ కాకూడదని తనను ప్రోత్సహించాలనుకున్నా. ఇందుకు నా భర్త ఎంతో సహకరించారు. నాలుగు గోడల మధ్య చదువు చెప్పడం మాత్రమే కాదు.. వారి కలలను తీర్చిదిద్దడంలోనూ టీచర్లు ముందుండాలి. పిల్లలు తప్పు చేస్తే టీచర్‌గా మందలించడమే కాదు.. వారి వెనుక ఉన్న కష్టాన్ని తెలుసుకోవాలి. అమ్మగా ప్రోత్సహించాలి. నేనున్నా అని భరోసా ఇస్తే.. ఈ మట్టిలో మరిన్ని మాణిక్యాలు వెలుగుచూస్తాయి.
– రాచకొండ కళ్యాణి
– గుజ్జుల సత్యప్రసాద్