పేదరికం, వెనుకబాటుతనం ఒకేచోట నివసించే తండాలో ఓ బిడ్డకు పుట్టుకతోనే చిత్రకళ అబ్బింది. తన ప్రతిభేంటో తనకే తెలియదు. హైదరాబాద్‌లో ఉన్నత చదువులు చదువుతూ కుంచె పడితే మట్టిలో మాణిక్యం బయటపడింది. ప్రొఫెషన్ కోర్సులు చేసేంత స్తోమత లేదు. తల్లిలేని బిడ్డను తండ్రిలా ఆదరించిన కోచ్ ఆమెను కళా ప్రపంచంలోకి నడిపించాడు. పెండ్లితో ఎంతోమంది కళాకారిణుల ప్రయాణం ఆగిపోతుంది. కానీ, ఆమె కళల విహారం వివాహంతో మరో మలుపు తిరిగింది. పల్లెలోనే ఉంటూ ప్రపంచ నగరాలకు తను గీసిన చిత్రాలను పరిచయం చేస్తున్నది బాధవత్ వెంకటలక్ష్మి.
మాది మెదక్ జిల్లా నర్సాపూర్ దగ్గర్లోని జానకంపేట. చిన్నప్పటి నుంచీ ఏదో ఒకటి చేయాలనే తపన ఉండేది. మాది పల్లెటూరు కావడంతో అక్కడ ఏం చేయడానికి ఉండేది కాదు. నాకు తోచినట్టుగా బొమ్మలు గీస్తూ ఉండేదాన్ని. ఎమ్మెస్సీ కంప్యూటర్ సైన్స్ చదవడం కోసం హైదరాబాద్ వచ్చాను. కాలేజ్ అయిపోయిన తర్వాత హాస్టల్లో ఖాళీగా ఉండకుండా ఏదో ఒకటి నేర్చుకోవాలనుకున్నాను. దగ్గర్లో ఏయే ఇన్స్టిట్యూట్లు ఉన్నాయో వెతికాను. మా హాస్టల్‌కి దగ్గర్లోనే ఒక ఆర్ట్ ఇన్స్టిట్యూట్ కనిపించింది. చిన్నప్పటి నుంచి కాలక్షేపం కోసం బొమ్మలు గీసే దాన్ని కదా… ఆర్ట్ ఇన్స్టిట్యూట్ చూడగానే అందులో ఏదో ఉత్సాహం కలిగింది. ఇన్స్టిట్యూట్ నడిపే ప్రవాత్ సార్‌కి నా డ్రాయింగ్స్ చూపిస్తే.. ఇంప్రెస్ అయిపోయారు. ‘ఇంతకాలం ఎక్కడున్నావ్. ఏం చేస్తున్నావ్? బాగా డ్రాయింగ్ వేస్తున్నావ్. వెంటనే చేరండి’ అన్నారు.
2
వారంలో మూడు రోజులు సాయంత్రం ఆర్ట్ క్లాసులు ఉండేవి. పెన్సిల్‌తో డ్రాయింగ్స్ గీసేదాన్ని. సార్ షేడింగ్స్ ఇవ్వడం నేర్పించారు. చాలా తొందరగా నేర్చుకున్నాను. నేను గీసిన బొమ్మలు చూసి.. ‘ఇంత బాగా వేస్తున్నావ్. నువ్వే నా ఇన్స్టిట్యూట్ నడిపేలా ఉన్నావ్!’ అని సార్ ప్రోత్సాహించారు. ‘నీకున్న టాలెంట్‌కి ఈ ఫీల్డులోకి ముందే వచ్చుంటే మంచి ఆర్టిస్ట్‌గా పేరొచ్చేది. నీ లైఫ్ సెటిల్ అయ్యేది’ అని నాలో స్ఫూర్తిని నింపారు. నా ఆర్ట్‌ని మెచ్చుకునేందుకు మా అమ్మానాన్నలతో మాట్లాడాలని ప్రవాత్ సార్ అనుకున్నారు. ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అడిగారు. ‘మా నాన్న మేస్త్రీ పని చేసేవాడు. నాకు చాలా చిన్న వయసు ఉన్నప్పుడే చనిపోయాడు. మా అమ్మకు ఆరోగ్యం బాగుండదు. మేము ముగ్గరం అక్కచెల్లెళ్లం. మా నాయనమ్మే నన్ను చదివిస్తున్నది’ అని చెప్పాను. అప్పుడు సార్ ‘నువ్వు నేర్చుకోవాలనుకున్నంత కాలం నేర్చుకో. ఫీజు అడగను. నువ్వు ఓ స్టేజ్‌కి వచ్చిన తర్వాత లక్ష కాదు రెండు లక్షలు ఇచ్చినా తీసుకుంటాను. అప్పటి వరకు ఫ్రీ’ అని చెప్పారు. అన్నట్టే ఆయన ఫీజు తీసుకోలేదు.
ఎమ్మెస్సీ, ఆర్ట్ కోచింగ్.. రెండిటినీ మేనేజ్చేయలేకపోయాను. ఇంట్రస్ట్ ఉన్నా సీరియస్‌గా నేర్చుకోలేదు. ఎమ్మెస్సీ అయిపోయింది. ఇంతలో కరోనా వచ్చింది. ఇంటికే పరిమితమయ్యాను. సార్ చెప్పిన టిప్స్, ఇచ్చిన నాలెడ్జ్ తోటి బొమ్మలు గీయడం ప్రాక్టీస్ చేస్తూ వచ్చాను. అప్పుడప్పుడూ సార్‌కి కాల్ చేసేది. ఆయన చెప్పిన ట్రిక్స్ ఫాలో అయ్యేది. ఆయన అన్ని రకాల పెయింటింగ్స్ నేర్పించారు. స్కెచ్, షేడింగ్స్, పోర్ట్రెయిట్, అక్రిలిక్స్, ఆయిల్ కలర్, వాటర్ కలర్ పెయింటింగ్స్ గీయడం నేర్పించారు. ఒక కంపెనీ ఆన్లైన్లో ఆర్ట్ ట్రైనింగ్‌కి సెలెక్ట్ అయ్యాను. అందులో ఏ గ్రేడ్ సాధించాను. తర్వాత వాళ్లే నన్ను టీచర్‌గా తీసుకున్నారు. రెండేళ్లు ఆన్లైన్లో ఆర్ట్ పాఠాలు చెప్పాను. ఆర్ట్ కమ్యూనిటీ అర్బన్ స్కెచెస్లో చేరాను. వాళ్లతో కలిసి అర్బన్ స్కెచ్‌లు గీశాను.
అయిదేండ్ల కిందట నాకు పెండ్లయింది. ఆ తర్వాత పిల్లలు. ఇంట్లో పనులకే సమయం సరిపోతున్నది. మళ్లీ ఉద్యోగంలో చేరలేదు. ఫైన్ ఆర్ట్స్ చదవాలని రెండేళ్ల కిందట తెలుగు విశ్వవిద్యాలయం ఎంట్రన్స్ రాశాను. నాలుగో ర్యాంక్ వచ్చింది. జేఎన్‌ఏఎఫ్‌యూ ఎంట్రన్స్‌లో అరవై నాలుగో ర్యాంక్ వచ్చింది. పిల్లల బాధ్యత కారణంగా వెనకడుగు వేశాను. అయినా మా ఆయన సపోర్ట్‌తో ఆర్టిస్ట్‌గా ముందుకు వెళ్తున్నాను. నర్సాపూర్ దగ్గర ఒక స్కూల్లో ఆర్ట్ టీచర్‌గా చేరాను. పిల్లలు కాస్త పెద్దవాళ్లు అయ్యాక నేను మిస్ చేసుకున్న ఫైన్ ఆర్ట్స్ కోర్స్ చదువుతాను.
ఆర్ట్ నేర్చుకునే రోజుల్లో.. నా ఫ్రెండ్‌కి పెండ్లి కుదిరింది. ఆమెకు పోర్ట్రెయిట్ గీసి, గిఫ్ట్ ఇచ్చాను. అప్పుడే నేను బొమ్మలు గీస్తానని నలుగురికీ తెలిసింది. నేను టీచర్‌గా పనిచేస్తున్న స్కూల్లో.. ఓ టీచర్ నాతో వాళ్లన్నయ్య బొమ్మ గీయించుకుంది. ఆ సంతోషాన్ని తన వాట్సాప్ స్టేటస్‌లో పంచుకుంది. దానివల్ల మరికొంతమందికి నా గురించి తెలిసింది. అప్పటి నుంచి ఆర్డర్లు వస్తూనే ఉన్నాయి. ఆర్డర్ ఇచ్చినవాళ్ల ద్వారా నలుగురికి తెలియడం, మరికొన్ని ఆర్డర్లు రావడంతో నాకు చేతినిండా పని ఉంటున్నది. ఇప్పుడు ఆన్లైన్లో ఎక్కడెక్కడి నుంచో ఆర్డర్లు వస్తున్నాయి. ఏ పెయింటింగ్ వేయమంటే అది వేస్తాను. పోర్ట్రెయిట్స్, చేర్యాల పెయింటింగ్స్, దేవతలు, ల్యాండ్‌స్కేప్స్ వేస్తాను. ఏ మీడియం ఆర్డర్ చేస్తే ఆ మీడియం వేసి ఇస్తున్నాను. నాకు దేవుడిచ్చిన టాలెంట్ ఇది. నలుగురికి చూపించాలి. చిత్రకళ నాకు దొరికిన నేస్తం. అలాగే యూట్యూబ్ చానెల్ ద్వారా ఆర్ట్ పాఠాలూ చెబుతున్నాను. నన్ను చదివించిన నాయనమ్మకు సదా రుణపడి ఉంటాను. ఈ కళలో మంచి స్థాయికి చేరుకోవాలన్న కల అయితే ఉంది! అందుకోసం నిరంతరం ప్రయత్నిస్తూనే ఉంటాను.
– నాగవర్ధన్ రాయల