సివిల్స్ మొదటి ప్రయత్నంలో ప్రిలిమ్స్ కూడా దాటలేక పోయిందామె. కుంగుబాటు నీడలా వెంటాడింది. దిగాలుపడుతున్న బిడ్డకు అండగా నిలిచారు తల్లిదండ్రులు. ‘నువ్వు సాధించగలవు’ అని వెన్ను తట్టారు. ఉత్సాహంగా మరో ప్రయత్నానికి నడుం బిగించింది. సొంతంగా ప్రిపేర్ అయింది. ప్రణాళికా బద్ధంగా తన మేధకు పదును పెట్టింది. రెండో ప్రయత్నంలోనే సివిల్స్‌లో 11వ ర్యాంకు సాధించి.. టాక్ ఆఫ్ ద తెలంగాణగా నిలిచింది ఇట్టబోయిన శివాని. రాణిరుద్రమ తనకు స్ఫూర్తి అని చెబుతున్న ఈ ఓరుగల్లు బిడ్డ ‘జిందగీ’తో పంచుకున్న విశేషాలు ఆమె మాటల్లోనే..
లక్ష్యం గొప్పగా ఉంటే సరిపోదు.. ప్రయత్నం బలంగా చేయాలని మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవారు. ఆయన మాటలే నేటి విజయానికి బాటలు పరిచాయి. మాది ఖిలా వరంగల్‌లోని శివనగర్. నాన్న రాజు మెడికల్ రిప్రజెంటేటివ్, అమ్మ రజిత గృహిణి. నాకో తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. నా స్కూల్ చదువంతా ఖమ్మంలో సాగింది. పదో తరగతి తర్వాత ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూకేషన్ చేశాను. ఎందుకో తెలియదు కానీ చిన్నప్పటి నుంచి సివిల్స్ కొట్టాలని ఉండేది. బీటెక్ పూర్తయ్యాక సివిల్స్ సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాను.
మామూలు మధ్యతరగతి కుటుంబం ఆలోచన అంతా చదువుల చుట్టూనే తిరుగుతుంది. మా ఇంట్లోనూ అంతే! కష్టపడి చదువుకుంటేనే భవిష్యత్తు అని చెప్పేవారు నాన్న. మా చదువులకు ఏ లోటూ రాకుండా చూసుకునేవారు. చిన్నప్పటి నుంచి టీవీలో న్యూస్ చూడటం తప్ప.. గంటల కొద్దీ సినిమాలు చూసి ఎరుగం. అప్పుడప్పుడు నాన్న జీకే ప్రశ్నలు అడిగేవారు. ఇంట్లో పేపర్ చదవడం తప్పనిసరి. పెద్దవుతున్న కొద్దీ.. న్యూస్ బాగా ఫాలో అవ్వడం అలవాటైపోయింది. దినపత్రికల్లో కలెక్టర్లు తీసుకున్న నిర్ణయాలు, చేసే పనుల గురించి చదివినప్పుడు మనం కూడా ఆ స్థాయికి చేరుకోవాలి అనిపించేది. అలా తెలియకుండానే ఐఏఎస్ కావాలన్న లక్ష్యం నాలో జీర్ణించుకుపోయిందేమో! 2023 ప్రిలిమ్స్‌లో ఐదు మార్కుల తేడాతో విఫలమయ్యాను. మానసికంగా ఇబ్బందిపడ్డాను. కుంగుబాటుకు గురయ్యాను.
‘వైఫల్యాలను అధిగమించినప్పుడే గెలుపు రుచి ఇంకా బాగుంటుంది’ అని అమ్మానాన్న ప్రోత్సహించారు. వారి సహకారంతో రెండో ప్రయత్నానికి శ్రీకారం చుట్టాను. సత్యం జైన్ గైడెన్స్, ఉచిత ఆన్లైన్ స్టడీ మెటీరియల్‌ను నమ్ముకొని యుద్ధానికి సిద్ధమయ్యాను. రెగ్యులర్ కోచింగ్ తీసుకోకుండా సొంతంగా ప్రిపేర్ అయ్యాను. సివిల్స్‌లో ఆంత్రొపాలజీ ఆప్షనల్‌గా తీసుకున్నాను. మనుషులకు సంబంధించిన సబ్జెక్టు కావడంతో ఆసక్తితో చదివాను. ఈ ప్రయాణంలో సెల్‌ఫోన్, సోషల్ మీడియాకు దూరం పాటించాను. నా దృష్టంతా పరీక్ష మీదే కేంద్రీకరించాను. సివిల్స్ ప్రిపరేషన్ వల్ల తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన గ్రూప్ 1లోనూ విజయం సాధించాను. 21వ ర్యాంకు సాధించాను. ఆ సంగతి మరవక ముందే… సివిల్స్‌లో 11వ ర్యాంకు రావడం మరింత ఆనందం కలిగించింది. ర్యాంకు సంగతి నాన్నే స్వయంగా చెప్పడంతో భావోద్వేగానికి గురయ్యాను. నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. కలెక్టర్‌గా పదిమందికీ సేవ చేసే అవకాశం దొరికింది. పోటీ పరీక్షలకు లక్షల మంది హాజరైతే.. వందల మందికి మాత్రమే ఇలాంటి అరుదైన అవకాశం లభిస్తుంది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని.. పేదలకు అండగా నిలవాలన్నదే నా అభిమతం.
సివిల్స్ ఇంటర్వ్యూలో ఎక్కువగా కాకతీయ సామ్రాజ్యం గురించి ప్రశ్నలు అడిగారు. వరంగల్‌లో పుట్టి, పెరిగిన నాకు కాకతీయుల చరిత్ర, రాణీ రుద్రమ శక్తియుక్తులు, ఇక్కడి చారిత్రక నిర్మాణాలపై విపరీతమైన ఆసక్తి ఉండేది. అందుకే కాకతీయ వైభవం గురించి బాగా అధ్యయనం చేశా! దీంతో ఇంటర్వ్యూలో వాళ్లు అడిగిన ప్రశ్నలకు సహేతుకంగా సమాధానాలు చెప్పగలిగా. అలాగే వరంగల్ జిల్లా మిర్చి, హ్యాండ్లూమ్పై కూడా ప్రశ్నలు అడిగారు. అన్నిటికీ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వగలిగాను.
– కొత్త రమేశ్
చకినాల శ్యామ్ సుందర్