‘చట్టం ముందు అందరూ సమానులే’ అనే మాట సినిమాల్లో వినడమే తప్ప జీవితంలో చూసింది లేదు. సత్యమేవ జయతే అనే నినాదం రాతల్లో తప్ప వాస్తవంగా గెలిచే సందర్భాలు బహు స్వల్పం. ఆ అరుదైన సందర్భాల్లో అరుదైన ఘటన తమిళనాడులో జరిగింది. పోలీస్ లాకప్‌లో తీవ్రమైన హింసకు ఇద్దరు అమాయకులు చనిపోయారు. ఆ హింసను కళ్లారా చూసిన ఓ హెడ్ కానిస్టేబుల్ చెప్పిన నిజం.. సత్యాన్ని గెలిపించింది. ఉన్నతాధికారుల వేధింపులు, బెదిరింపులకు లొంగకుండా ఆమె నిజం వైపే నిలబడింది. నిందితులు సాక్ష్యాలను మాయం చేసినా.. తన తెలివితో నిజాన్ని నిగ్గు తేల్చి సత్యమేవ జయతే..
అని నినదించింది హెడ్ కానిస్టేబుల్ రేవతి.
2020 జూన్ 19… తమిళనాడులోని తూత్తుకుడి జిల్లా శాతంకుళం పట్టణం. జనమంతా కొవిడ్ మహమ్మారి భయంతో బతుకుతున్నారు. ప్రభుత్వం లాక్‌డౌన్‌ను కొంత సడలించింది. నిర్దుష్టమైన సమయాల్లో దుకాణాలు తెరిచేందుకు కొవిడ్ ఆంక్షలను పాక్షికంగా ఎత్తివేసింది. సెల్‌ఫోన్ షాప్ నడిపే పి.జయరాజ్ నిబంధనలు ఉల్లంఘించాడని పోలీసులు అరెస్ట్ చేశారు. అతణ్ని శాతంకుళం పోలీస్ స్టేషన్లో నిర్భందించారు.
పోలీస్ లాకప్‌లో ఉన్న జయరాజ్ కోసం అతని కొడుకు బెనిక్స్ వచ్చాడు. ఆ సమయంలో తండ్రిని దూషిస్తూ కానిస్టేబుల్ చిందులేస్తున్నాడు. తండ్రిని కొడుతున్న కానిస్టేబుల్ని బెనిక్స్ అడ్డుకోబోయాడు. వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగింది. ఈ తోపులాటలో కానిస్టేబుల్ చొక్కా గుండీ ఊడి కిందపడింది. ఆ కానిస్టేబుల్ అహం నిద్రలేచింది. పట్టలేనంత కోపంతో ఆ తండ్రీ కొడుకుల మీద క్రూరంగా దాడి చేశాడు. ఒకరు కాదు ఇద్దరు కాదు ఒకరి తర్వాత ఒకరు లాఠీలు పుచ్చుకుని వారిపై దాడి చేశారు.
ఆ రోజు హెడ్ కానిస్టేబుల్ రేవతి పోలీస్ స్టేషన్లో సెంట్రీ విధుల్లో ఉంది. ఆ నాలుగు గోడల మధ్య జరుగుతున్న క్రూరమైన దాడికి తండ్రీకొడుకులు చేస్తున్న హాహాకారాలు ఆమె చెవుల్లో పడ్డాయి. వాళ్ల ఆర్తనాదాలు వింటూ ఉండలేక వారిని హింసిస్తున్న గదిలోకి వెళ్లింది. అప్పటికే బెనిక్స్, జయరాజ్ పోలీసు దెబ్బలకు రక్తమోడుతూ ఉన్నారు. ఈ దాడిని ఆపేందుకు రేవతి పోలీసులకు అడ్డు చెప్పింది. వాళ్లు వినిపించుకోలేదు. దాడి ఆపలేదు. ఒళ్లుపగిలేటట్టు, లాఠీలు విరిగేటట్టు కొట్టారు. వృద్ధుడనే కనికరం కూడా చూపలేదు. విలవిల్లాడుతూ ప్రాణం కోసం వాళ్లు చేస్తున్న ఆర్తనాదాలు ఆమె వినలేకపోయింది. అక్కడ ఉండలేక బయటికి వెళ్లిపోయింది. లాకప్ నెత్తుటి మడుగైంది. తీవ్రమైన గాయాలతో తండ్రీ, కొడుకులు ఏడుస్తున్నారు. బెనిక్స్ కదల్లేని స్థితిలో ఉన్నాడు. ఆ రక్తపు మరకలు తుడవాలని ఒక సబ్-ఇన్స్పెక్టర్ బెనిక్స్ని బెదిరించాడు. మళ్లీ దెబ్బలు పడతాయనే భయంతో ఒంటి మీద బనియన్ విప్పి ఆ మరకలు తుడిచాడు ఆ కుర్రాడు.
ఆ నిద్రలేని రాత్రి భారంగా తెల్లారింది. ఇద్దరినీ పోలీస్ కస్టడీ నుంచి జ్యుడీషియల్ కస్టడీకి పంపించారు. రెండు రోజులకే వాళ్ల పరిస్థితి విషమించింది. ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరూ కన్నుమూశారు. దెబ్బల వల్లే చనిపోయారని పోస్టుమార్టం రిపోర్ట్ వచ్చింది. పోలీసు దెబ్బలకే చనిపోయారని కుటుంబం, ప్రజలు ఆరోపించారు. పోలీసు కేసు నమోదైంది. దర్యాప్తు మొదలైంది. పోలీసుల కళ్లు కప్పడానికి నేరస్తులు సీసీ కెమెరా విజువల్స్‌ని డిలీట్ చేస్తారు. సాక్ష్యాలు మాయం చేస్తారు. ఇక్కడ పోలీసులే నిందితులు. కాబట్టి చేయకూడని పని చేశారు. దర్యాప్తు అధికారులకు సీసీ కెమెరా ఫుటేజీలో ఏమీ దొరకలేదు. జయరాజ్‌ని అరెస్ట్ చేసిన రోజు విధుల్లో ఉన్న పోలీసులు విచారణకు రావాలని పోలీసులు నోటీసులు ఇచ్చారు. అవి రేవతికి కూడా అందాయి.
దర్యాప్తు అధికారులకు అబద్ధం చెప్పమని పోలీసులు రేవతిపై ఒత్తిడి తెచ్చారు. ఈ కేసులో ఉన్న ఇద్దరు అధికారులు ఆమెను పోలీస్ స్టేషన్ బయట వ్యక్తిగతంగా కలిశారు. ఆ తండ్రీ కొడుకులపై చిత్రహింసలు జరిగినప్పుడు వాళ్లు పోలీస్ స్టేషన్లో లేరని సాక్ష్యం చెప్పాలని వేడుకున్నారు. అసత్యం చెప్పడానికి ఆమె మనసు అంగీకరించలేదు. వాళ్ల విజ్ఞప్తిని తిరస్కరించింది. ఆ తర్వాత పై అధికారుల నుంచి పిలుపు రావడం, బెదిరింపులు, బుజ్జగింపులు అన్నీ జరిగాయి. వేటికీ లొంగలేదు రేవతి. జరిగిందే చెప్పాలన్న తన నిర్ణయాన్ని మార్చుకోలేదు. ‘21 ఏళ్ల సర్వీసులో నాపై ఒక్క రిమార్క్ లేదు. సర్వీస్‌లో ఎప్పుడూ తప్పు చేయలేదు. ఇక ముందు కూడా అలాగే ఉండాలని నిర్ణయించుకున్నాను’ అని వాళ్లతో కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పింది. సీసీ టీవీ ఫుటేజీని మాయం చేసినా.. ప్రతిక్షణం ఏమి జరిగిందో మర్చిపోకుండా గుర్తుపెట్టుకుందామె. తన జ్ఞాపకాల్లోని ఆ సంఘటనల వరుస క్రమాన్ని దర్యాప్తు అధికారులకు చెప్పింది. వారికి పోలీస్ స్టేషన్ గోడలపై, బల్ల కింద ఉన్న రక్తపు మరకలు చూపించింది. ఫోరెన్సిక్ రిపోర్టులో ఆ రక్తపు మరకలు జయరాజ్, బెనిక్స్ డీఎన్ఏతో సరిపోలడంతో హత్య ఎక్కడ జరిగిందో తేలింది. ఇక ఎవరు చేశారో తేల్చే పని మిగిలింది.
పని చేస్తున్న వ్యవస్థలో.. ‘అధికారులకు విధేయంగా పని చేయాలా? చట్టానికి కట్టుబడి ఉండాలా? నిర్భయంగా బాధ్యతలు నిర్వర్తించాలా?’ అనే సందిగ్ధం, ఒత్తిడి, ఉద్యోగం పోతుందనే భయం. మనిషినే మాయం చేస్తారనే ఆందోళనతో ఆమె తీవ్రమైన మనోవేదనకు గురైంది. అంత సంక్షోభంలోనూ రేవతి అబద్ధం చెప్పలేదు. మదురై జిల్లా, సెషన్స్ కోర్ట్ బోనులో నిలుచుని పోలీస్ స్టేషన్లో జరిగిందంతా పూసగుచ్చినట్టు చెప్పింది రేవతి. అబద్ధం చెప్పమని పోలీసులు, ఉన్నతాధికారులు ఒత్తిడి చేస్తున్నా.. రేవతి నిజం కోసం నిలబడింది. ఇన్స్పెక్టర్, ఇద్దరు సబ్-ఇన్స్పెక్టర్లు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్ల తప్పుని ఎత్తి చూపడం చిన్న విషయం కాదు. ఇది కొందరు వ్యక్తులతో పోరాటం కాదు. వ్యవస్థతో యుద్ధం. ఈ పోరాటంలో రేవతి అలసిపోయింది. బెదిరింపులు, వేధింపులకు గురైంది. పోలీస్ స్టేషన్లో సాక్ష్యాలు చెరపడానికి నీళ్లు తేవాలని ఆదేశిస్తే తెచ్చింది. కానీ, కోర్టులో నిజం చెప్పాల్సి వచ్చినప్పుడు నిజమే చెప్పింది. అబద్ధం చెప్పడానికి రేవతి మనస్సాక్షి ఒప్పుకోలేదు. ఎన్నిసార్లు చెప్పినా, ఎంతమంది అధికారులు ఒత్తిడి చేసినా రేవతి మనసు మార్చుకోలేదు. నిజం మారదు కదా! కాబట్టి నిజాన్నే చెప్పాలనే ఆమె ఆలోచనా మారలేదు. కోర్టులో జరిగిందే చెప్పింది. చూసిందే చెప్పింది. నిందితులందరనీ దోషులుగా నిరూపించింది.
ఇద్దరు అమాయకుల మరణాలకు కారణమైన తొమ్మిది మందికి మరణశిక్ష పడింది. ‘ఈ పోరాటంలో అలసిపోయిన నాకు మా కుటుంబం మద్దతుగా నిలబడింది. నాకు ధైర్యం చెప్పి నాతోడుగా ఉంది. నాకు అండగా ఉన్న కుటుంబానికి హాని జరగకుండా కాపాడేందుకు నా ఇద్దరు బిడ్డలకు, భర్తకు పోలీస్ భద్రత కల్పించాలని ఆదేశించడంతో ప్రభుత్వం భద్రత కల్పించింది’ అని తీర్పు తర్వాత మీడియాతో ఆ చీకటి రోజుల్ని గుర్తుచేసుకుంటూ చెప్పిందామె. రేవతి నిజాయతీకి గుర్తింపుగా ప్రమోషన్ ఇవ్వాలని, ఆమె నిర్భీతికి పోలీసు పతాకం ఇవ్వాలని తమిళనాడు ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఆ ప్రభుత్వానికి రేవతికి ఉన్నంత నిజాయతీ ఉంటే తప్పకుండా ప్రజల కోరిక నెరవేరుతుంది.
కోర్టులో చెప్పిన నిజం. నేను నిజం చెప్పక పోయినా కోర్టు నిజం తెలుసుకునేదేమో. అప్పుడు నేను కూడా ఆ నేరంలో భాగమయ్యేదాన్ని. దోషిగా మిగిలిపోయేదాన్ని. సత్యం కోసం నిలబడినందుకు, కోర్టులో సాక్ష్యం చెప్పినందుకు నేను పడిన బాధలు ఆ దేవుడికి, నాకు మాత్రమే తెలుసు. పోలీసులకు కుటుంబాలు ఉంటాయి. ఆ కుటుంబ సభ్యులపట్ల సానుభూతి ఉంది. కానీ, పోలీసులు క్రూరంగా ప్రవర్తించకూడదు కదా!
– రేవతి, హెడ్ కానిస్టేబుల్
– జయరాజ్, బెనిక్స్