మన గుండె ప్రతి క్షణం లయబద్ధంగా పనిచేస్తుంది. సాధారణంగా ఆరోగ్యవంతుల్లో గుండె నిమిషానికి 60 నుంచి 100 సార్లు కొట్టుకుంటూ శరీరంలోని ప్రతి అవయవానికి రక్తాన్ని సరఫరా చేస్తుంది. ఈ ప్రక్రియ సజావుగా సాగడానికి గుండెలోని విద్యుత్ సంకేతాలు సమన్వయంతో పనిచేయాలి. అయితే ఈ లయ దెబ్బతింటే గుండె స్పందనలు అస్తవ్యస్తంగా మారతాయి. అలాంటి పరిస్థితుల్లో అత్యంత సాధారణంగా కనిపించే గుండె రిథమ్ వ్యాధినే ‘ఏట్రియల్ ఫిబ్రిలేషన్’ (ఎఎఫ్ లేదా ఎఫిబ్) అంటారు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వయసు పెరుగుతున్న కొద్దీ ఈ సమస్య మరింతగా పెరుగుతున్నది. ఒకప్పుడు అరుదుగా కనిపించిన ఈ వ్యాధి ఇప్పుడు భారతదేశంలో కూడా వేగంగా విస్తరిస్తున్నది.
మధుమేహం, అధిక బరువు, రక్తపోటు, గుండెపోటు నేపథ్యం, నిద్రలో గురక సమస్యలు, జీవనశైలి మార్పులు వంటి అంశాలు ఏట్రియల్ ఫిబ్రిలేషన్కు ప్రధాన కారణాలుగా చెప్పవచ్చు. అయితే ఇది సాధారణ గుండె దడ మాత్రమే కాదు. అది స్ట్రోక్, గుండె వైఫల్యం వంటి తీవ్రమైన సమస్యలకు దారితీసే ప్రమాదం ఉంది. ఈ సమస్యను సమయానికి గుర్తించి, సరైన చికిత్స అందిస్తే పూర్తి స్థాయిలో రుగ్మతను అధిగమించవచ్చు. ఈ వ్యాధి నియంత్రణ కోసం ప్రస్తుతం ‘పల్స్ ఫీల్డ్ అబ్లేషన్’ అనే అత్యాధునిక చికిత్సా పద్ధతి అందుబాటులోకి వచ్చింది. అసలు ఈ గుండె లయ తప్పడానికి గల కారణాలేంటి? దాని వల్ల కలిగే అనర్థాలేంటి? ఈ సమస్యను గుర్తించే పద్ధతులు, అందుబాటులో ఉన్న చికిత్సా విధానాలు, ‘పల్స్ ఫీల్డ్ అబ్లేషన్’ చికిత్సా పద్ధతి పనితీరు, దానివల్ల రోగికి కలిగే ప్రయోజనాలను నేటి ఊపిరిలో తెలుసుకుందాం.
గుండె లయ తప్పడాన్నే వైద్య పరిభాషలో ఏట్రియల్ ఫిబ్రిలేషన్ అంటారు. గుండెలోని పై రెండు గదులను ‘ఏట్రియా’ అంటారు. సాధారణ పరిస్థితుల్లో ఇవి క్రమబద్ధంగా సంకోచించి రక్తాన్ని దిగువ గదులైన వెంట్రికల్స్కు పంపిస్తాయి. కానీ ఏట్రియల్ ఫిబ్రిలేషన్లో ఈ గదులు వేగంగా, అసమానంగా కంపించడం ప్రారంభిస్తాయి. ఫలితంగా గుండె పంపింగ్ వ్యవస్థ సమన్వయం కోల్పోతుంది. దీనివల్ల రోగులకు గుండె దడ, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, అలసట, తల తిరుగుడు, ఛాతీలో అసౌకర్యం, వ్యాయామ సామర్థ్యం తగ్గిపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. అయితే ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, కొంతమంది రోగుల్లో ఎలాంటి లక్షణాలు కనిపించకపోవచ్చు. అందుకే వైద్యులు దీనిని ‘సైలెంట్ రిథమ్ డిజార్డర్’గా పేరొంటారు.
ఏట్రియల్ ఫిబ్రిలేషన్ వల్ల స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది. గుండెలోని ఏట్రియా సమర్థంగా పనిచేయకపోవడంతో రక్తం నిల్వ ఉండి గడ్డకట్టే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ‘లెఫ్ట్ ఏట్రియల్ అప్పెండేజ్ (LAA)’ అనే చిన్న సంచిలో రక్తం గడ్డకడుతుంది. ఈ గడ్డ విడిపోయి మెదడుకు చేరితే స్ట్రోక్ సంభవిస్తుంది. ఆరోగ్య అధ్యయనాల ప్రకారం, ఏట్రియల్ ఫిబ్రిలేషన్ ఉన్నవారిలో స్ట్రోక్ ప్రమాదం సాధారణ వ్యక్తులతో పోలిస్తే దాదాపు ఐదు రెట్లు ఎకువగా ఉంటుంది. అంతేకాకుండా గుండె వైఫల్యం, జ్ఞాపకశక్తి క్షీణత, తరచూ ఆసుపత్రి చేరికలు, మరణాల రేటు కూడా పెరుగుతాయి.

ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చికిత్సలో ప్రధానంగా మూడు అంశాలు ఉంటాయి. అందులో ఒకటి స్ట్రోక్ నివారణ, రెండోది గుండె స్పందనల నియంత్రణ, మూడోది రోగి జీవన నాణ్యత మెరుగుదల.
స్ట్రోక్ నివారణ : సాధారణంగా ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చికిత్సలో స్ట్రోక్ నివారణకు ప్రథమ ప్రాధాన్యం ఇస్తారు. ఈ క్రమంలో రోగి పరిస్థితి ఆధారంగా రక్తం గడ్డకట్టకుండా చేసే మందులు (అంటీకోగ్యులెంట్లు) ఇవ్వడం జరుగుతుంది. గతంలో చాలామంది ఆస్పిరిన్ సరిపోతుందని భావించేవారు. అయితే ఏట్రియల్ ఫిబ్రిలేషన్ కారణంగా వచ్చే స్ట్రోక్ నివారణలో ఆస్పిరిన్ ప్రభావవంతం కాదని ఆధునిక వైద్య పరిశోధనలు స్పష్టం చేశాయి.
గుండె స్పందనల నియంత్రణ : ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చికిత్సలో రెండో ప్రాధాన్యం.. గుండె స్పందనలను క్రమబద్దీకరించడం. అంటే లయబద్ధంగా సాధారణ స్థితికి తీసుకురావడం. ఇందుకోసం అత్యాధునిక ‘కాథెటర్ అబ్లేషన్’ పద్ధతి అందుబాటులోకి వచ్చింది. గుండె స్పందనలను సాధారణ స్థితికి తీసుకురావడానికి గత రెండు దశాబ్దాల్లో అత్యంత విజయవంతమైన చికిత్సగా ‘కాథెటర్ అబ్లేషన్’ పురోగతి సాధించిందని చెప్పవచ్చు. ఈ ప్రక్రియలో రక్తనాళాల ద్వారా సన్నని కాథెటర్లను గుండెలోకి ప్రవేశపెట్టి, అసాధారణ విద్యుత్ సంకేతాలను ఉత్పత్తి చేసే ప్రాంతాలను నిర్వీర్యం చేస్తారు. ముఖ్యంగా పల్మనరీ వీన్ల ప్రాంతం నుంచి వచ్చే అసాధారణ సంకేతాలను అడ్డుకుంటారు. ఇప్పటివరకు ఈ ప్రక్రియలో రెండు ప్రధాన పద్ధతులు ఉపయోగించేవారు. అందులో 1.రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్ (వేడి ద్వారా) 2. క్రయోబెలూన్ అబ్లేషన్ (చల్లటి పరిస్థితులు). ఈ రెండు పద్ధతులూ సమర్థవంతమైనప్పటికీ, వేడి లేదా చలి ప్రభావం వల్ల అన్నవాహిక, నరాలు, రక్తనాళాలపై కొంత దుష్ప్రభావాలు ఏర్పడేవి.
పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ : ఏట్రియల్ ఫిబ్రిలేషన్ చికిత్సలో అత్యాధునిక పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ (పీఎఫ్ఏ) పద్ధతి ఒక విప్లవాత్మక మార్పు తీసుకువచ్చిందని చెప్పవచ్చు. ఇది వేడి లేదా చల్లటి పరిస్థితులకు బదులుగా అతి స్వల్ప కాలం పాటు విద్యుత్ పల్స్లను ఉపయోగించి గుండె కండర కణాలను మాత్రమే లక్ష్యంగా చేసుకుంటుంది.
ఈ ప్రక్రియను వైద్య పరిభాషలో ‘ఇర్రివర్సిబుల్ ఎలెక్ట్రోపొరేషన్’ అంటారు. ఇందులో గుండె కణాల పొరలలో సూక్ష్మ రంధ్రాలు ఏర్పడి అవి నియంత్రితంగా పనిచేయకుండా మారతాయి. ఫలితంగా చుట్టుపకల ఉన్న అన్నవాహిక, నరాలు, రక్తనాళాలపై ప్రభావం పడకుండా ఉంటుంది.

పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ ప్రత్యేకత : పల్స్ ఫీల్డ్ అబ్లేషన్కు ఉన్న అతిపెద్ద ప్రయోజనం ‘టిష్యూ సెలెక్టివిటీ’. అంటే గుండె కణాలపై ప్రభావం చూపుతూ ఇతర అవయవాలను ఎకువగా దెబ్బతీయదు. దీంతో సంప్రదాయ అబ్లేషన్లో అరుదుగా కనిపించే, అత్యంత ప్రమాదకరమైన ‘ఏట్రియో-ఈసోఫేజియల్ ఫిస్టులా’ వంటి సమస్యలు నియంత్రణలో ఉంటాయి. అంతర్జాతీయ అధ్యయనాలు కూడా ఈ సాంకేతికత సురక్షితమని, సమర్థవంతమని సూచిస్తున్నాయి.
పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ వల్ల చికిత్సా సమయం తగ్గుతుంది. గతంలోని సంప్రదాయ అబ్లేషన్ ప్రక్రియకు 3 నుంచి 4 గంటల సమయం పట్టేది. కానీ, పల్స్ ఫీల్డ్ అబ్లేషన్ ప్రక్రియ సుమారు గంటలోనే పూర్తవుతుంది. ఫలితంగా అనస్థీషియా సమయం తగ్గుతుంది. రోగి త్వరగా కోలుకుంటాడు. తద్వారా దవాఖానలో ఎక్కువ రోజులు ఉండాల్సిన పరిస్థితి తగ్గుతుంది. చికిత్స అనంతరం చాలామంది రోగులు ఒక రోజులోనే ఇంటికి వెళ్తున్నారు. కొందరు చికిత్స జరిగిన మరుసటి రోజే సాధారణ పనులను ప్రారంభిస్తున్నారు.