కవాడిగూడ, జూన్ 8: భవన నిర్మాణ రంగంలోని అన్ని విభాగాల కార్మికులు ఐక్యంగా ఉండాలని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. ఎస్. ప్రవీణ్‌కుమార్ సూచించారు. కార్మికులు విడిపోకుండా కలిసికట్టుగా పోరాడి హక్కులు సాధించుకోవాలన్నారు. తమ న్యాయమైన హక్కుల సాధన కోసం భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం ఇందిరాపార్కు వద్ద తాపీ మేస్త్రీల ఆత్మగౌరవ సభ నిర్వహించారు. భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం గ్రేటర్ హైదరాబాద్ అధ్యక్షుడు సూర వెంకటయ్య అధ్యక్షతన జరిగిన ఈ సభలో బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్. ఎస్. ప్రవీణ్‌కుమార్, మాజీ గవర్నర్ పాల్గొని మద్దతు తెలిపారు.
ఈ సందర్భంగా ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ మాట్లాడుతూ వెల్ఫేర్ బోర్డు నుంచి వచ్చే నిధులను కార్మికుల సంక్షేమానికి వినియోగించాలన్నారు. ఈఎస్ఐ, పీఎఫ్‌లు కార్మికులకు అందాలని, సెంట్రింగ్ కాంట్రాక్టర్స్, తాపీ మేస్త్రీల మధ్య కార్మిక శాఖ మంత్రి రాజీ కుదుర్చాలని సూచించారు. భవన నిర్మాణ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం ముందుకు రావాలన్నారు. సెంట్రింగ్ కాంట్రాక్టర్స్, తాపీమేస్త్రీల మధ్య వచ్చిన పంచాయితీని ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకొని పరిష్కరించాలన్నారు. భవన నిర్మాణ రంగ కార్మికుల న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని చెప్పారు.
భవన నిర్మాణ రంగాల కార్మిక సంఘం అధ్యక్షుడు కామల్ల ఐలయ్య మాట్లాడుతూ సెంట్రింగ్ కాంట్రాక్టర్లు తాపీ మేస్త్రీలపై చేసిన అనుచిత వ్యాఖ్యలను వెనక్కి తీసుకుని భేషరతుగా తాపీ మేస్త్రీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ నెల 10న రాష్ట్రవ్యాప్తంగా సమ్మెకు పిలుపునిచ్చారు. భవన నిర్మాణ కార్మికులంతా అన్ని రకాల పనులు బంద్ చేసి నిరవధిక సమ్మె కొనసాగిస్తారని కామల్ల ఐలయ్య వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం, కాంట్రాక్టర్స్ దిగి వచ్చేంత వరకు బంద్ నిర్వహిస్తామని ఆయన స్పష్టం చేశారు. సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఉప్పు సాయికుమార్, తాటికొండ మధు, నాయకులు మెరుగు యాదగిరి, శ్రీరాములు, రవికుమార్ గ్రేటర్ హైదరాబాద్ అన్ని జోన్ల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.