నిడమనూరు, జూన్ 8 : మండలంలోని ప్రభుత్వ భూముల్లో అనుమతి లేకుండా మట్టి తవ్వకాలు అడ్డూ అదుపు లేకుండా సాగుతున్నాయి. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పేరుతో గ్రామాల్లోని ప్రభుత్వ భూములు, ఏనె గుట్టలపై మాఫియా కన్నేసింది. ఏనె గుట్టలను కరిగిస్తున్నా కాపాడాల్సిన రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. అధికార పార్టీ నేతల సిఫార్సులతో తిలా పాపం తలా పిడికెడు అన్నచందంగా మైనింగ్ అనుమతుల్లేకుండానే మట్టిని జేసీబీలతో తవ్వుతూ టిప్పర్లు, ట్రాక్టర్లలో తరలిస్తూ మట్టి మాఫియా లక్షలాది రూపాయల అక్రమ సం పాదనకు తెర లేపింది. దీనికి అడ్డుకట్ట వేసే వారు లేకపోవడంతో ఏనె గుట్టలు, ప్రభుత్వ భూములు ఆక్రమణదారుల చెరలోకి వెళ్తున్నాయి.
ఊట్కూరు, తుమ్మడం, వడ్డెరి గూడెం గ్రామాల పరిధిలోని ప్రభు త్వ భూముల్లో మట్టి తవ్వకాలు నిరంతరాయంగా సాగుతున్న తీరు అధికారుల బాధ్యతారాహిత్యానికి నిదర్శనం. తుమ్మడంలోని ప్రభుత్వ భూమి సర్వే నంబరు 840లో అనుమతుల్లేకుండానే అధికార పార్టీకి చెందిన కొందరు మట్టిని అక్రమంగా తవ్వి విక్రయిస్తున్న తీరు అధికారుల పర్యవేక్షణా లోపాన్ని తేటతెల్లం చేస్తోంది. మట్టి అక్రమ తవ్వకాలపై చర్యలు తీసుకునే నాథుడే లేకపోవడంతో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. సెలవు రోజుల్లో మరింత రెచ్చిపోతున్న మాఫియా అడ్డగోలు ధరలకు మట్టిని విక్రయిస్తోంది. మట్టి అవసరం ఉన్న జనం కొనుగోలు చేయలేక లబోదిబోమంటున్నారు. మట్టి తవ్వకాలు, తరలింపును అరికట్టే వారు లేకపోవడంతో గుట్టలతో పాటు ప్రభుత్వ భూములు, శిఖం భూములు ఆక్రమణదారుల చెరలోకి వెళ్తున్నాయి.

అధికారుల కనుసన్నల్లోనే..
మట్టి తవ్వకాలు ఆసాంతం అధికారుల కనుసన్నల్లోనే సాగుతున్నట్లు ఆరోపణలున్నాయి. మట్టి తవ్వకాలకు సంబంధించి అధికారులకు వేలాది రూపాయల ముడుపులు అందుతున్నట్లు పలువురు ఆరోపిస్తున్నారు. ఇప్పటి వరకు మట్టి తవ్వకాలపై ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రభుత్వ భూము ల్లో తవ్వకాలపై ఎవరైనా ఫిర్యాదు చేస్తే విచారణకు పరిమితం చేయడం పరిపాటిగా మారుతోంది. ఇప్పటి వర కు అక్రమంగా మట్టి తవ్వకాలకు సం బంధించి కేసులు నమోదు చేయకపోవ డం అధికారుల చిత్తశుద్ధికి నిదర్శనం.
భవిష్యత్లో మట్టి అవసరాల సంగతేమోగాని గుట్టలు కనుమరుగవుతున్నాయి. ఇప్పటికైనా జిల్లా ఉన్నతాధికారులు మట్టి తవ్వకాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. ఈ విషయమై తాసీల్దార్ జంగాల కృష్ణయ్యను వివరణ కోరగా ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల కోసం ఉన్నతాధికారుల ఆదేశానుసారమే అనుమతులిచ్చినట్లు తెలిపారు. అక్రమంగా మట్టి విక్రయాల అంశం తమ దృష్టికి రాలేదన్నారు. అక్రమ తవ్వకాలు చేపడితే విచారణ జరిపి చర్యలు తీసుకుంటామన్నారు.