ఆధునిక సమాజంలో ఆడవాళ్లు అన్నిరంగాల్లోనూ రాణిస్తున్నారు. తమకు నచ్చినట్లుగా కెరీర్ను నిర్మించుకుంటున్నారు. ఆయా రంగాల్లో ఉన్నత పదవులను చేపడుతున్నారు. పెండ్లి-పిల్లల తర్వాత కూడా.. తమ కెరీర్ను కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో కొందరు భర్త కంటే ఎక్కువగా సంపాదిస్తున్నారు. కుటుంబ బాధ్యతను స్వీకరిస్తున్నారు. అయితే, కొన్ని కుటుంబాల్లో మాత్రం, భార్య సంపాదన.. భర్తకు చేటు చేస్తున్నదని పరిశోధకులు అంటున్నారు. భర్త కన్నా భార్య ఎక్కువ సంపాదిస్తున్నప్పుడు.. సామాజికంగా, మానసికంగా, కుటుంబ సంబంధాలలో చోటుచేసుకునే మార్పులపై ‘ది ఎకనామిస్ట్’ పత్రిక ఇటీవల ఒక అధ్యయనం నిర్వహించింది.
ఇందుకోసం 17 ఏండ్ల డేటాను విశ్లేషించింది. ఈ అధ్యయనం ప్రకారం.. భార్యకన్నా తక్కువ ఆదాయం ఆర్జిస్తున్న పురుషులు అధిక మానసిక ఒత్తిడికి గురవుతున్నారట. మహిళలుకూడా వారి బంధంపై అసంతృప్తికి లోనవుతున్నారట. నివేదిక ప్రకారం.. మొత్తంగా 30 శాతం జంటలలో భార్యలు తమ భర్తల కంటే ఎక్కువ సంపాదిస్తున్నారని తేలింది. ఆయా కుటుంబ ఆదాయంలో భార్య వాటా 70 శాతం లేదా అంతకంటే ఎక్కువ ఉన్నప్పుడు.. వారి భర్తలు తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురయ్యే అవకాశం 2.5 రెట్లు ఎక్కువగా ఉన్నది. ఆసక్తికరంగా.. వివాహం చేసుకోకుండా సహజీవనం చేస్తున్న జంటల మధ్య కూడా ఇలాంటి పరిస్థితే కనిపించింది. ఇక్కడ మహిళ ఆదాయం 50 శాతం కంటే ఎక్కువ ఉన్నప్పుడు.. పురుషులలో మానసిక ఒత్తిడి 1.5 రెట్లు ఎక్కువగా ఉన్నది.
అయితే, ఇందుకు తక్కువ సంపాదనే ప్రధాన కారణం కాదనీ, దానివెనక మరిన్ని కారణాలు ఉండొచ్చని వారు అంటున్నారు. తామే కుటుంబానికి ఆర్థిక పోషకులుగా ఉండాలనే నమ్మకంతో పెరగడం వల్ల.. కొంతమంది పురుషులు ఒత్తిడికి గురవుతున్నారు. మరికొందరు స్నేహితులు, బంధువులు, సమాజం తమ సంబంధాన్ని ఎలా చూస్తారోనని ఆందోళన చెందుతున్నారు. అదే సమయంలో ఎక్కువ సంపాదనతో భార్యలకు ఆర్థిక స్వేచ్ఛ వస్తున్నప్పటికీ.. గృహ బాధ్యతలు తగ్గకపోవడంతో వారిలో వైవాహిక సంతృప్తి తగ్గుతున్నదని తేలింది. నిజానికి వేతనాల్లో లింగ బేధంపై సమాజంలో ఇప్పటికే ఎంతో మార్పు వచ్చింది. కానీ, వ్యక్తిగత బంధాలు, పాత సంప్రదాయ భావజాలాల నుంచి బయటికి రావడానికి మరింత సమయం పడుతుందని ఈ విశ్లేషణ స్పష్టం చేస్తున్నది.