మనం రోజూ తీసుకునే ఆహారాల్లో బ్రేక్‌ఫాస్ట్ చాలా ముఖ్యమైనది. అందులో పోషకాలు ఎక్కువగా ఉంటే మంచిదని అందరి అభిప్రాయం. అందులో భాగంగానే ఉదయాన్నే ఖాళీ కడుపుతో పండ్లు తినవచ్చా? లేదా? అనే సందేహం చాలామందికి కలుగుతుంది. కొందరు ఇది ఆరోగ్యానికి ఎంతో మేలని చెబితే, మరికొందరు వద్దని సలహా ఇస్తుంటారు. ఈ గందరగోళానికి తెరదించుతూ అసలు విషయాలను తెలుసుకుందాం.
పండ్లు తినేటప్పుడు కొన్ని పద్ధతులు పాటిస్తే అవి శరీరానికి అద్భుతమైన శక్తినిస్తాయి. పండ్లు తింటే బరువు పెరుగుతామని లేదా రక్తంలో చకెర స్థాయులు పెరుగుతాయని చాలామంది భయపడుతుంటారు. కానీ, సరైన పద్ధతిలో తీసుకుంటే ఏ సమస్యా రాదు. ఉదయాన్నే వ్యాయామం చేసే అలవాటు ఉన్నవారికి పండ్లు ఒక వరంలా పనిచేస్తాయి. ఇవి శరీరానికి తక్షణ శక్తిని అందించి, వరవుట్ చేయడానికి కావాల్సిన సత్తువను ఇస్తాయి. మారెట్లో సీజన్లతో సంబంధం లేకుండా అన్నిరకాల పండ్లు మనకు కనిపిస్తుంటాయి. వాటిలో ఆయా సీజన్లలో దొరికే పండ్లకే మొదటి ప్రాధాన్యం ఇవ్వాలి. అవి సహజంగా పండుతాయి కాబట్టి అందులో పోషకాలు కూడా ఎకువగా ఉంటాయి. నారింజ, బత్తాయి వంటివి తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్ సి అందుతుంది. స్ట్రాబెర్రీలు, బ్లూబెర్రీలు, దానిమ్మ పండ్లలో యాంటి ఆక్సిడెంట్స్ పుషలంగా ఉండి మన ఆరోగ్యానికి రక్షణనిస్తాయి. శరీరంలో నీటి శాతాన్ని పెంచడానికి కర్బూజ లాంటి పండ్లు మేలు చేస్తాయి.
అరటిపండులో పొటాషియం ఎకువగా ఉండటం వల్ల రోజంతా శక్తి అందుతుంది. పండ్లలో ఉండే సహజ సిద్ధమైన ఫ్రక్టోజ్ నెమ్మదిగా జీర్ణమై ఇన్సులిన్ హార్మోన్‌పై నేరుగా ప్రభావం చూపకుండా శరీరానికి శక్తిని అందిస్తుంది. అందుకే తీపి పదార్థాలు తినాలనే కోరికను నియంత్రించడంతో పాటు బరువు తగ్గడంలోనూ పండ్లు కీలక పాత్ర పోషిస్తాయి. పండ్లు తిన్నప్పుడు కొందరికి ఎసిడిటీ వచ్చే అవకాశం ఉంటుంది. దీన్ని నివారించడానికి పండ్లతోపాటు బాదం లేదా వాల్ నట్స్ లాంటి కొన్ని డ్రై ఫ్రూట్స్‌ను కలిపి తీసుకోవాలి. ఇలా చేయడం వల్ల రోగనిరోధక శక్తి పెరగడమే కాకుండా ఎసిడిటీ సమస్య రాకుండా ఉంటుంది. పండ్లు ఆరోగ్యకరమైనవే కదా అని మోతాదుకు మించి తినకూడదు. మరీ ముఖ్యంగా.. ఫ్యాటీ లివర్ సమస్య ఉన్నవారు పండ్ల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అతిగా ఫ్రక్టోజ్ తీసుకోవడం వల్ల శరీరంలో కొవ్వు స్థాయులు పెరిగే ప్రమాదం ఉంది. అందుకే, మీ శరీర తత్వాన్ని బట్టి మితంగా పండ్లను తీసుకుంటూ ఆరోగ్యకరమైన ఉదయాన్ని ప్రారంభించండి.