Fans club Page | ‘ఫలానా హీరోకు నువ్వు ఫ్యాన్ అయితే.. నేను ఏసీ’ అంటూ తమ అభిమాన స్థాయిని చాటుకుంటారు కొందరు. నిలువెత్తు కటౌట్ కోసం నిలువుదోపిడి సమర్పించుకునే అభిమానులూ ఉంటారు. రక్తతిలకం దిద్ది.. ప్రత్యేకతను నిరూపించుకుంటారు మరికొందరు. ఇంతకుమించిన రీతిలో ఇప్పుడు ఆన్లైన్లో అభిమానాన్ని ప్రదర్శిస్తున్నారు ఈ తరం ఫ్యాన్లు. నచ్చిన నటీనటుల పేరుతో ‘ఫ్యాన్ క్లబ్ పేజీ’ ప్రారంభించి అదరగొడుతున్నారు. వీటిని వేదికగా చేసుకొని అభిమానులకు మరింత చేరువ అవుతున్నారు నటీనటులు.
ఓ ముప్పయ్ ఏండ్లు వెనక్కి వెళ్తే సినీతారలపై అభిమానాన్ని గుండెల్లో దాచుకునేవాళ్లు! అత్యవసరం అయితేనో, వాదోపవాదాల సమయంలోనో తప్పించి సదరు అభిమానం వ్యక్తమయ్యేది కాదు!! ఇంకాస్త వెనక్కి వెళ్తే ప్రత్యుత్తరం రాని చిరునామాకు వీలునామా అంత భారీస్థాయిలో ఉత్తరాలు రాసేవారు. అదృష్టం బాగుండి.. ఆ తార ఓ చిత్తరువు పంపితే నోబెల్ బహుమతి వచ్చినంత పొంగిపోయేవారు. ఈస్ట్‌మన్ కలర్ సినిమా రోజుల్లో.. ప్రత్యర్థి హీరో వాల్పోస్టర్లపై పేడముద్దలు కొట్టి, తమ కథానాయకుడిపై అభిమానాన్ని చాటుకునేవారు. ఇక తెలుపు-నలుపు రోజుల్లో అయితే, ఎక్కడ సినిమా పిచ్చోడు అనుకుంటారో అని ఫలానా హీరోకు అభిమానులం అని చెప్పుకోవడానికే జంకేవారు. ఇప్పుడు కాలం మారింది. సినీతారలపై అభిమానం చాటుకునే పద్ధతులూ మారాయి. అన్నిటికీ ఆన్ లైన్‌ను వేదికగా మలుచుకుంటున్నారు. తమ అభిమానాన్ని ఆగమేఘాల మీద చాటుకుంటున్నారు. తారలూ అంతే వేగంగా స్పందిస్తున్నారు.
ఫ్యాన్స్ క్లబ్ ట్రెండ్ ఇప్పటిది కాదు. దశాబ్దాల కిందటే సినిమా ఇండస్ట్రీ అంత పెద్దగా విస్తరించింది. పల్లె పల్లెలోనూ హీరోలకు అభిమానులు ఉండేవాళ్లు. కొత్త సినిమా విడుదల కాగానే నానా హంగామా చేసేవారు. సినిమా ఎలా ఉన్నా.. ‘వందరోజులు పక్కా’ అని ముచ్చటగా మూడుసార్లు చెప్పేవారు. భారీ కటౌట్లు పెట్టి క్షీరాభిషేకాలు చేసి, రక్త తిలకాలు దిద్దేవారు. నిన్నమొన్నటి వరకు, ఆ మాటకొస్తే ఇప్పటికీ ఈ ట్రెండ్ కొనసాగుతూనే ఉంది. అయితే, అభిమానులు ఎంత గుండెలు బాదుకున్నా, గుండీలు తెంపుకున్నా సదరు హీరోలను నేరుగా కలిసే భాగ్యం ఏ కొందరికో దక్కేది. అభిమానులపై ఎంత ప్రేమ ఉన్నా, కలవాలనే ఆరాటం ఉన్నా.. సినీతారలకు అందుకు తగిన అవకాశాలు పెద్దగా ఉండేవి కావు. సినిమా వందరోజుల పండుగ పూట ‘అభిమాన దేవుళ్లకు కృతజ్ఞతలు’ అని తమ విధేయతను చాటుకునేవారు హీరోలు. ఫ్యాన్స్ క్లబ్ నిర్వాహకులతో అడపాదడపా భేటీ అయినవాళ్లూ లేకపోలేదు. ప్రత్యక్షంగా అందరినీ కలుసుకోవడం మాత్రం వీలయ్యేది కాదు. దీనికి ఆన్లైన్ ఫ్యాన్స్ క్లబ్స్ పరిష్కారంగా కనిపిస్తున్నాయి. అభిమానులందరినీ ఒకేసారి పలకరించేందుకు ఇవి అవకాశం కల్పిస్తున్నాయి. ఫ్యాన్స్ అందరినీ ఒక్కతాటిపైకి తేవడానికి వేదికలూ అవుతున్నాయి.
ఇప్పుడు హీరో, హీరోయిన్ అని తేడా లేకుండా అందరిపైనా అభిమానాన్ని మనస్ఫూర్తిగా ప్రదర్శించడానికి ఆన్లైన్ వేదికలను ఎంచుకుంటున్నారు. ట్విటర్, ఫేస్బుక్, ఇన్‌స్టాలో ఫ్యాన్స్ క్లబ్ పేజీలు ఏర్పాటుచేసి ఆనందాన్ని పంచుకుంటున్నారు. దాదాపు నాయికానాయకులు అందరి పేరిట ఈ ఆన్లైన్ ఫ్యాన్స్ క్లబ్ పేజీలు పుట్టుకొచ్చాయి. వీటిలో కొన్ని సదరు హీరో, హీరోయిన్ల అనుమతితో ఏర్పడినవి కావడం విశేషం. 2010లో తలపతి విజయ్ పేరిట ట్విటర్లో ‘యాక్టర్ విజయ్ ఫ్యాన్స్’ అనే పేజీ మొదలైంది. దీనికి దాదాపు 11 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇందులో హీరో విజయ్ సినిమాలు, ఇతర విశేషాలను ఎప్పటికప్పుడు అప్లోడ్ చేస్తుంటారు. పైగా దీనికి అభిమానులే అడ్మిన్లు కావడం విశేషం. విజయ్ కూడా తన వ్యక్తిగత విషయాలను ఈ ఫ్యాన్పేజీ ద్వారా అభిమానులతో పంచుకుంటుంటారు. ‘యాక్టర్ విజయ్ ఫ్యాన్స్’ నుంచి అడపాదడపా ఆసక్తికరమైన సంగతులు కూడా షేర్ చేస్తుంటాడు విజయ్. సామాజిక చైతన్యం పెంచుకోమంటూ అభిమానులను ప్రోత్సహిస్తుంటాడు.
కథానాయిక సమంతకు ఆఫ్‌లైన్‌లోనే కాదు ఆన్‌లైన్‌లోనూ మంచి ఫాలోయింగ్ ఉంది. ఆ అభిమానులందరూ ‘సమంత ఫ్యాన్స్’ పేజీతో ట్విటర్లో ఒక్కటయ్యారు. సమంత ఫ్యాన్ పేజీని నిర్వహించడానికి ప్రత్యేకంగా అడ్మిన్లు కూడా ఉన్నారు. ట్విటర్ పేజీ సాక్షిగా అభిమానులతో రెగ్యులర్‌గా టచ్‌లో ఉంటుంది సమంత. సినిమా అప్డేట్లన్నీ అడ్మిన్లు ఫ్యాన్స్ పేజీలో పొందుపరుస్తుంటారు. సమంత అంగీకరించిన వాటిని పోస్ట్ చేస్తారు. తెలుగునాట మహేశ్‌బాబుకు ఆన్లైన్లో గట్టి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అధికారికంగా ‘మహేశ్‌బాబు ఫ్యాన్ క్లబ్’ పేజీ కూడా ట్విటర్లో అందుబాటులో ఉంది. ‘నాకు, అభిమానులకు మధ్య చక్కని వారధి ఈ పేజీ. వారి అభిప్రాయాలను నేరుగా తెలుసుకోవడానికి ఎంతగానో ఉపయోగపడుతుంది’ అని చెప్పుకొచ్చాడు మహేశ్. మరెందరో హీరోలు, హీరోయిన్లకు ట్విటర్, ఇన్‌స్టా, ఫేస్బుక్లో ఫ్యాన్స్ పేజీలు అందుబాటులో ఉన్నాయి. వాటిని నిర్వహించడానికి ప్రత్యేక వ్యవస్థలూ ఏర్పడ్డాయి. ఆసక్తికరమైన విషయం ఏంటంటే! ఈ అధికారిక ఫ్యాన్స్ పేజీలో తమ అభిమాన నటులకు సంబంధించిన విషయాలే తప్ప, ఇతర నటీనటులకు వ్యతిరేకంగా, వారిని కించపరిచే విధంగా పోస్ట్‌లు పెట్టకపోవడం ఆహ్వానించదగ్గ పరిణామం.
Viral video: కోల్‌కతా విమానాశ్రయంలో సిబ్బందితో కలిసి నటి మోనామీ ఘోష్ డ్యాన్స్.. వీడియో వైరల్
Kanika Kapoor | రెండో పెండ్లి చేసుకున్న బాలీవుడ్ సింగర్ కనికా కపూర్
తండ్రి అయిన లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ ఫేమ్ సుధాకర్ కోమాకుల
బాలీవుడ్ నటి దియా మీర్జాకు చేదు అనుభవం..!